Total Pageviews

Thursday, November 6, 2014

కార్తిక మాస వనభోజనాలు
                       
కార్తిక మాసం  అనగానే ఎవరికైనా గుర్తు వచ్చేది ,పూజలు ,వ్రతాలూ ,దైవ దర్శనాలు ,వనభోజనాలు . నాకు మాత్రం
వనభోజనాలు  అనగానే  మనసు అడవిలోకి వెళ్ళిపోతుంది . ఎందుకలా ! అంటారా ఇది చదివితే  మీకే తెలుస్తుంది .
ఇక్కడ ఎన్నిసార్లు ,ఎంతమంది తో  , ఎన్నిచోట్లకు  వెళ్ళినా ,నా మనసుకు  నచ్చినవి  నాకు గుర్తుండి పొఇనవి మేం
అడవిలో వున్నపుడు  వేల్లినవే . అవే  నాకిష్టం ,ఉదయమే  మంచులో ప్రయాణం , ఉదయిస్తున్న సూర్యుడు  ,
విచ్చుకుంటున్న  పువ్వులు ,వాటిమీద  మంచు బిందువులు , పేరుతెలియని  పిట్టల  కువ కువలు ,గట్టిగా
అరుస్తూ  తమ ఉనికి  తెలియ చేసే  కౌజు పిట్టలు ,  నిప్పుకోళ్ళు , ఆ కొమ్మకి  ఈకొమ్మకి గెంతుతూ  గంతులేసే కోతులు ,పూరి విప్పి ఆడుతూ  శబ్దాని కి మాయమయ్యే  నెమళ్లు ,కుందేళ్ళు , మనసులో  చటుక్కున మెదులు
తాడు  సృష్టి కర్త ,  జోహార్లు  చెప్పకుండా  ఉండలేము .


   
నెల ముందు నించి  అత్యంత ఉత్సాహంగా  ప్రణాళిక  వేసే వారు ,మానాన్న గారు . తోటి ఉద్యోగులందరి కి  ముందే
చెప్పి ఉంచే వారు ఫలానా  రోజున  వన భోజనాలు  అందరూ కుటుంబం తో రావాలని . అప్పటికి తాయారు చెయ్య
వలసిన  వంటలు , వెంట తీసు కెల్లా వలసిన జాబితా  తయారయ్యేది . బాగా వండే  గార్డ్స్ ని  ఎంచి ,వాళ్ళతోనే
వందించే వారు . వెళ్ళే చోటు మాత్రం  పెద్దగా  ఆలోచించ వలసిన  పని లేదు . ఎందు కంటే  అడివంతా  అందాలే !
అందరం కల్సి  ఎక్కడికి వెళ్ళినా  ఆనందమే , వేరే సరదాలు  ఏమి  అక్కడ ఉండేవి కాదు  కాబట్టి  అందరూ  ఆ
రోజు కోసం  ఎదురు  చూసే వాళ్ళు . ఆరోజు ఆడవాళ్ళు  ప్రత్యేకం గా  తయారయ్యేవాళ్ళు . ఈమె  ఆఫీసెర్ భార్య ,
ఆమె గుమస్తా  భార్య  అనే తేడాలే  లేవు ,అంతా కలిసి మెలిసి వుండేవారు . ఒకరి పిల్లలిని ఒకరు  దగ్గరికి తీసే
వాళ్ళు .  ఒకసారి  కాఫీ తోటకు వెళ్తే ,మరోసారి  కమలా తోటకి వెళ్ళే వాళ్ళం . ఒకసారి పాములేరు  వెళ్తే ,మరో
సారి సాంతం  అడవి లోకి తీసుకెళ్ళే  వాళ్ళు . అక్కడ ''ఇప్పపూల ''చెట్లు ఉండేవి . అవి మన కిస్ మిస్  మాదిరి
ఉండి పిస్తా పప్పులా  తెరచి వుంటుంది . వాటితో  సారా  కాస్తారట . ఎన్నో ఏళ్ళు  నిలవ పెట్టినది మరింత రుచి
ఖరీదు వుంటాయి . వీళ్ళ లో  కొంతమంది కొంటేవాళ్ళు వుండేవారు . వాళ్ళు అక్కడికి వెళ్ళడానికే  ఇష్టం
చూపించేవారు . మిగతా వాళ్ళని ఒప్పించి  అక్కడికే తీస్కేల్లె వాళ్ళు . తాగామన్న  సరదాలో వాగే వాళ్ళు
కొందరైతే , వాసనకే పడి  పొయ్యేవాళ్ళు మరికొందరు . ఏదేదో వాగేసి  భార్యలకు  అడ్డంగా  దొరికి పొయ్యేవాళ్ళు .అందరిని తీసుకెళ్ళడానికి  జీపు లు  సరిపోవు , జీపులు ఒకటి  వుండే ను ,రెండు వుండే ను ,మహా ఐతే
పోలిస్ జీప్ కూడా అడిగేవారు ,వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు . పోలీస్ వారు , ఫారెస్ట్ వారు ఐకమత్యం గా
వుండేవారు . సిట్టింగ్స్ పెట్టేవాళ్ళు . వాళ్ళంతా  కలిసి కూర్చునే  సమయం లో తరచూ వాళ్ళు చెప్పుకునే
జోక్ ఒకటి  నాకు ఇప్పటికి గుర్తు వుంది . ''ఫారెస్ట్ ఓడిని  పెళ్ళికి  పోలీసోడిని  చావుకి  పిలవకూడదు ''.
అని ఒకసామెత  అనుకోండి కాని వాళ్ళు  విపరీతం గా నవ్వు కొనేవాళ్ళు . పెళ్ళికి పిలిస్తే  ఫారెస్ట్ ఓడు
'ఈ పందిరికి కలప  ఎక్కడిది ? వంటలకి  వంటచెరకు [పుల్లలు ] ఎక్కడివి అంటాడట . పోలీస్ ని
చావుకి పిలిస్తే 'ఎలా చచ్చాడు ? ఎందుకు చచ్చాడు అంటూ  ఆరా తీస్తాడట  అదీ  వాళ్ళ నవ్వుల కారణం .

రెండు లారీ  లు  శుబ్రం గా  కడిగించి ,గడ్డి వత్తుగా వేయించి ,పైన టార్పన్ పరచి  కూర్చోడానికి  వీలుగా
ఏ ర్పాటు  చేసేవారు . ఆడవాళ్ళూ పిల్లలు ఎక్కడానికి  రెండు  స్టూల్స్  పెట్టేవారు . అవి వెంట తీసు కెళ్ళే
వాళ్ళం  అక్కడ దిగాలిగా 1 ఒకసారి రెండో లారి వచ్చేసరికి  ఆలస్యమైంది  అంతవరకూ మొదటి లారి
లోని వాళ్ళు  దిగ దానికి  కుదర లేదు . అప్పటినించి ,ఒక్కో లారి కి  ఒక జీప్  సహాయం గా వుంటుంది .
భోజనాలు , స్టూల్స్  అన్ని వేరు వేరు గా  సర్దించే వారు . మధ్యలో   తప్పి పొఇనా  ఎవరి కి ఇబ్బంది
లేకుండా ఈ ఏ ర్పాటు .  ప్రయాణం లో  సరైన బాట  వుండేది కాదు , ఎత్తు పల్లాల లో  ఊగుతూ
ఉయ్యాల మాదిరి  ప్రయాణం సాగేది , నడుములు లారీకి  కొట్టుకుని  ఆబాధ  వుండేది చూడు ...
కాని  అదెవరూ  లెక్క చేసే  వాళ్ళు కాదు . ఆనందో  బ్రహ్మ  అన్నమాట .


వంటలంటే  మా  నాన్న గారికి  నాన్వెజ్  మాత్రమె . వెజ్ తో  ఆయనికి పెద్దగా  పరిచయం లేదు . కాని
వెజ్ లో ఆయనికి తెలిసిన వంట ఒకటే ఒకటి . అది  బీట్ రూట్ ,కేరట్ చిన్న చిన్న  ముక్కలుగా కోసి
పోపులో వేయించి ,కొబ్బరి చల్లేది . అదొక్కటే  ఆయనకు  తెలిసిన  వంటకం .వన భోజనాలకు  వెళ్తూ
చేపలపులుసు  తీసుకు పోలేముగా ! తప్పనిసరిగా కూరగాయలు వండిస్తూ ,ఆకూర  చెయ్యమనే
వారు . అంత మందికి  ఆ  వేపుడు  చెయ్యాలంటే  ఎన్ని కిలోలు ,ఎంతసేపు , ఎంతమంది , అంత
చిన్నగా తరగాలి ? కాని ఆయన వినే వారు కాదు ,నలుగురు మనుష్యులని  ఎక్కువ పెట్టి మరీ
అదే వేపుడు చేయించేవారు .  వనభోజనాలికి  సరే నా పెళ్ళికి కూడా  అదే కూర  చెయ్యాలంటారు .
మా  అమ్మ గొడవే  సుకుంది , 'థాట్  వీల్లేదు  టైమంతా వేస్టు ,వంటవాళ్లు తిట్టుకుంటారు ' అని
ఆయన వినలేదు .  మా నవ్వుల మధ్య ,అదే ఖాయం చేసారు . ఇంకా విచిత్రం ఏమిటంటే  ఆయనకీ
ఇష్టమైన  స్వీట్ సొంపాపిడి [సొంపట్ట ]. వంటవాడిని పిలిచి ,ఇంట్లో చేయించే వారు . అది ఎయిర్ టై ట్
ప్యాక్ లో ఉంటేనే  అలా వుంటుంది . బయటికి తీసి తినలేద ను కొండి  ,మళ్లీ  సెనగ పిండి అవుతుంది .
నన్ను అత్తారింటికి పంపే  టప్పుడు  సారే కావిళ్ళు అని పెడతారు . ఏ స్వీట్ ఐన రెండు బిందెలచొప్పున
పెడతారన్న మాట , ఈనేమో  సొంపాపిడి  పెడదామంటారు . మా అమ్మ  ఆవూరు  వెళ్ళే టప్పు డికి
అదికాస్తా  అడుక్కి పోతుంది ,వచ్చిన సారేలో  రెండు బిందెలు  ఖాళి గా వుంటే చూసి మీ  అక్క
మిమ్మలిని  పిచ్చి తిట్లు తిడుతుంది  అంటే అప్పుడాగేరు .
                 


 వెళ్ళిన చోట  భోజనాలు  చేసే వాళ్ళం . ఐదారు ఐటమ్స్ వున్నందుకో ,మరెందుకో కాదు ,అందర
కల్సి తిన్నందుకు ,వాటి రుచి అమోఘంగా  వుండేది . తిన్నాక  అలా తిరిగి చూసి వద్దామని అంతా
బయల్దేరే వాళ్ళు ,కాస్త స్త్రీ లమీద శ్రద్ద వున్నా వాళ్ళు  తోడుగా వచ్చే వారు ,ఎక్కడ తప్పి పోతారో
అని .  మిగతా వాళ్ళు  చతుర్ముఖ పారాయణం మొదలు పెట్టే  వాళ్ళు . అక్కదేదన్న 'ఏ రు 'వుంటే
మగవాళ్ళని పంపేసి  స్నానాలు చేసే వారు . అందులో ఒకామె పేరు గుర్తు లేదు కాని
 చాల బాగా ఈత కొట్టేది ,పిల్లలిని పంపమన్న వాళ్ళు కూడా ఆమెని చూసి  మమ్మల్ని
కూడా  దించేవారు నీళ్ళ లోకి . మధ్యానం  స్నాక్స్ ,వేడిగా టీ  అక్కడే చేసిచ్చేవారు . వీలయి నన్ని
కమలాలు తిని , కొన్ని  వెంటతీసుకుని  ,తిరుగు ప్రయాణం అయ్యే వాళ్ళం . శీతాకాలం  కాబట్టి
త్వరగా చీకటి పడేది .  అదేంటో వెళ్ళేప్పుడు  చేసిన అల్లరి , గోల వచ్చేప్పుడు  వుండేది కాదు .
అందరూ  నిద్రకోరిగే వారు . ప్రతి లారి ముందు జీప్ తో మగవాళ్ళు  వెంబడించే వారు . చాల
జాగ్రత్త గా  ఇంటికి  చేర్చే వాళ్ళు.  అందరి మనసులో  ఒకటే మెదిలేది  మళ్ళీ  'కార్తీకం ''ఎప్పుడని ....

                                 ******************************************

3 comments:

  1. Post chaduvutunata sepu mi enjoyment ohinchukuna. Abba naku ila enjoy cheyalani undi.

    ReplyDelete
  2. ముందుగా మీ ఇద్దరికీ స్వాగతం ,మీభావాలు నాతొ పంచుకున్న స్వప్న గారికి ,
    మా వూరి వారైన కిషోర్ వర్మ గారికి [మీబ్లాగ్ చూస్తున్నా ] ధన్యవాదాలు .

    ReplyDelete