Total Pageviews

Tuesday, June 12, 2018

మహానటి .

                                    

సినిమా  వచ్చిన రెండోరోజే  చూసాము  కానీ ,అందరికి నచ్చింది  మూవీ బావుందంటున్నారు .
ఎవరి అభిప్రాయాలూ వారికుంటాయి ,కొందరికి నచ్చినవి  అందరికి నచ్చాలని లేదు కదా .
నేను పాత సినిమాలు  ఇష్టపడతాను ,ఇప్పటికి పాతవి టీవీ లో వస్తే చూస్తుంటాము . అందులో
సావిత్రి ఉందంటే ఇంట్లో అందరం చూస్తాము . సినిమా ఏక్టర్స్ నాకు పెద్దగా నచ్చరు స్క్రీన్
మీద చూసి బాగా చేశారనుకుంటా ,సినిమా అయిపోగానే మర్చిపోడమే .. మరోసినిమా చుస్తే
మరో హీరోయిన్ ,అంతే  అలాంటి  నాకే సావిత్రి గారంటే  చాలాఇష్టం , డాక్టర్ చక్రవర్తి లో
జగ్గయ్య  సావిత్రిని తిడుతుంటే చూడలేక ,ఎప్పుడు మూవీ సగమే చూస్తాను . ఆవిడ
జీవితం గురించి చూచాయగా తెలుసు ,మూవీ వస్తుందంటే  ఎందుకు టచ్ చేస్తున్నారు అని
అనుకున్నాను ,ఎక్కడ మొదలు పెడతారు ,ఎక్కడ ఆపుతారు ,ఎంతమంది  సహ నటుల్ని
చూపిస్తారు ,అని తెగ మదన పడి పోయాను ,మొత్తానికి ఫస్ట్ లుక్ వచ్చాక చాలా నచ్చేసింది .


                                 

మూవీ చూసి ,బావుంది అనుకోలేక పోయాను ,''బానే'' వుంది అనుకున్నా , నా బాధ ఏమిటంటే
ఆమె జీవితం రెండు గంటల్లో  ఏమి చూపిస్తారు , ఎలాచూపిస్తారు అని అనుకుంటూ వెళ్తే
వెళ్ళాక పంటికింద రాయిలా  మధురవాణి ఎపిసోడ్ ఒకటి , ఆవిడ జీవితాన్ని ఒక కధలా
చూడాలని  ఆశ పడితే జర్నలిస్టు  ప్రేమ కథ , పిట్టకథ లా మారి సమయాన్ని వృధా చేసింది .
రెండు కాదు మూడు గంటలైనా  చూడొచ్చు కానీ , మధ్యలో ముందు వెనుకలతో  కధ  పక్క
దారి పట్టడం  నాకెందుకో నచ్చలేదు . దానికి తోడు మధురవాణి పాత్ర  బట్టలతోను ,
డబ్బింగ్ తోనూ  తెగ బాధ పెట్టేసింది ,  సావిత్రి పాత్ర ఎప్పుడు వస్తుందా అనిఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది . సంగీతం ఏమిటో నీరసంగా వుంది .ధ్యాసంతా  సావిత్రి గారి ఆహార్యం
ఎలావున్నది  ఆలా చూపించాలనే  దిశగా సాగింది , ఎక్కువ శాతం  శ్రద్ద అటువైపుగా ఉండడం
వల్ల అనుకుంటా  మిగతా విషయాల  శ్రద్ధ తగ్గింది . ఇంకా ఒకింత శ్రద్ద పెట్టి ఉంటే ఇంకా
బావుండేది  అనిపించింది ( నాకు ).


చివరికి వాళ్ళు ఏ పాత్ర కోసం వెతుకుతున్నట్లు  కధ  మొదలు పెట్టారో అది చూపెట్టనే లేదు .
ఒక జగ్గయ్య లేరు ,ఒక జమునలేరు అలనాటి మేటి నటీనటులు ఎవరు లేరు అదో అసంతృప్తి
ఏ వివరం చెప్పకుండానే సినిమా ముగించారు ,నాకేమిటో విందు భోజనం అని పిలిచి ,
తినకుండా వాసనపీల్చి  బయలుదేర మన్నట్లు ఉందని పించింది . సినిమా అంటూ బుర్ర
తిన్నావు ఎలావుందో  చెప్పకుండా మౌనం గ కుర్చున్నావేంటి ,అని మావారు అడిగితె నా దగ్గర
ఎలాంటి సమాధానం లేకపోయింది .


ఒక విషయం  ఒప్పుకోవాలి  ఆమాత్రం కధ తో  ఈమధ్య కాలంలో నీట్ గ పిల్లల తో వెళ్లి
చూసే   సినిమా లు  రావడం లేదు ,అందులోను సావిత్రి మూవీ అనేసరికి పెద్ద వయసు
వాళ్ళుకూడా  ఇల్లు వదిలి సినిమాకి బయలుదేరారు ,ఇది కాక వేసవి సెలవులు కూడా కలిసి వచ్చాయి . మొత్తానికి బాగానే రన్ అవుతోంది కాబట్టి  నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని
లేటుగా నా అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను .


*******************************************************************************

Thursday, March 22, 2018

సమ్మర్ ట్రిప్


వివరాలు చివర్లో ............................................

                      

                     


                       

                       

                          


                           

                                       


                                        

                            

                            

                          

                                           

                        

                         


                        

                       

                               

                        

                                               


                         

                            

                                                          


బెంగుళూర్ ,వెళ్లి ముందుగా చూసింది ఇస్కాన్ టెంపుల్ , తర్వాత  విస్వేస్వరయ్య మ్యూజియం చూసాం .
టిప్పుసుల్తాన్ ప్యాలస్ ,లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ ,చూసి రెండురోజుల తర్వాత  మైసూర్ వెళ్ళాము
మైసూర్ లో కూడా గార్డెన్ ,ప్యాలస్  చూసేము . చాముండేశ్వరి టెంపుల్  చూసి ,దగ్గరలో డ్యామ్ చూసి
షాపింగ్ చేసి ,మైసూర్ నించి  బయల్దేరి ఫారెస్ట్ మీదుగా ఊటీ చేరాము . దారిలో కేరళ ,తమిళనాడు
కర్ణాటక గవెర్నమెంట్  సరిహద్దు బోర్డులు ఉండడం తమాషాగా  అన్పించింది .చాలా జంతువులూ
కన్పించాయి . మైసూర్ ,బెంగళూర్ లో మాకు జూ కి వెళ్ళడానికి కుదరలేదు . కానీ చాలాబావుంటాయిట .
నేను ఈ రెండు ఊర్లు గురించి త్వరగా ముగించింది ఎందుకంటే ,ఊటీ చాలా నచ్చేసింది ,ఎంత బావుందో
చిటపట చినుకులు వాతావరణం ,మబ్బులైతే తెల్లని హంసల్లా కొండల పై వాలుతూ చెయ్యి చాపి అందుకోవాలన్పించేలా  చాలా దగ్గరగా ,రోజ్ గార్డెన్ , చాల రకాల పువ్వులు  విరిసినవి విరిసినట్టే
వున్నాయి అందంగా , ఎందుకంటే  చల్లని వాతావరణం కదా ఫ్రిజ్ లో పెట్టినట్లే అన్నమాట . బోట్ షికారు,
అసలు మనకు కొత్తగా వెళ్లమనే ఆలోచనే రాదు ,ఎందుకంటే ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాము కనుక .

అసలు అక్కడ హోటల్ రూమ్స్ లో  ఫైర్ ప్లేస్ అన్నా ఉందికాని ,ఫ్యాన్ కోసం హుక్ కూడా లేదు . ఉదయం
తొమ్మిది కి కానీ తెల్లవారడం లేదు ,డ్రైవర్ కూడా చెప్పేస్తున్నాడు తొమ్మిదికి వెళ్లాలని . చాకోలెట్స్ ట్రే లో
పెట్టి స్వీట్స్ మాదిరిగా అమ్మేస్తున్నారు ,ఫ్రిజ్ అవసరం లేదు కదా ! టీపొడి  తయారు చేసే ఫ్యాక్టరీ వుంది .
గ్రీన్ టీ తో సహా చాల ఫ్లేవర్లు దొరుకుతున్నాయి ,  మసాలాలు ఐతే ఫ్రెష్ చవకకూడా ,అన్నీ తీసుకున్నాము .
ఇంకా స్వెట్టర్లు ,హ్యాండ్ బాగ్స్ తీసుకున్నా ,బహుశా చెన్నై నించి వస్తాయనుకుంటా ,కాళ్ళ నొప్పులకోసం
నీలగిరి తైలం కూడాకొన్నాను .హైద్రాబాద్  మండే ఎండల నుండి ఊటీ కి  వెళ్లి అక్కడ స్వెట్టర్ కొనుక్కోవడం
నాకు  మర్చి పోలేని  ఒక అనుభూతి .

దొడ్డబెట్ట వెళ్ళినప్పుడైతే త్రిల్లై పోతాము ఆఘాట్ రోడ్ లో  వర్షం లో అంతపైకి ,అన్ని వేల కిలోమీటర్ల ఎత్తుకి
వెళ్తుంటే హబ్బా .. నేను వర్ణించ లేను  ఆ ప్రయాణం లోని అనుభూతి  ఒకసారన్నా అనుభవించి తీరవలసిందే
కింద లోయలోకి చూస్తుంటే .. కోయంబత్తూర్ కన్పిస్తుందన్నారు ,కానీ బాగా మబ్బులు ఉండడం తో కన్పించలేదు
దొడ్డబెట్ట లో  ఆ రైలింగ్ అలాగే ఉంటుందని  కమల హాసన్ ,జయప్రద  డాన్స్ చేసిన చోట ఫొటోస్ తీసుకోవాలని
అనుకున్నాను . చాలా మార్పులు చేసారు దాంతో నాకు నిరాశ తప్పలేదు .

ఊటీ నించి కూనూర్  వెళ్ళాము ,అక్కడినించి  ఊటీకి ట్రైన్ లో వచ్చాము చాలా నచ్చేసింది ,నాకెందుకో
అరకు ట్రైన్ జర్నీ గుర్తుకువచ్చింది (ప్రాంతీయ అభిమానం ) ట్రైన్లో అక్కడే వుండే ఒకాయన పరిచయం
అయ్యారు ,ఆయన చెప్పిన ప్రకారం బాలీవుడ్ నటి నూర్జహాన్ అనే నటికీ కొన్ని వేల ఎకరాలు వున్నాయట
ఆమె లేరు కానీ వారసులు అవన్నీ చూసుకుంటున్నారని  చెప్పారు . తమిళనాడు ముఖ్యమంత్రి ,నటి
జయలలితకు 900 ఎకరాలు  టీ తోటలు  వున్నాయట ,కానీ ఆమె మరణించాక  వాటికి ఆమె డబ్బు
చెల్లించలేదని , టీ తోట స్వంత దారులు కోర్ట్ కి వెళ్లారని చెప్పారు . కొండల మీదికి వెళ్లే కొద్దీ భవంతులు ,
టీ తోటలు  ఆ నిర్మాణానికి నిజంగా హేట్సాఫ్ .......

ఊటీ లో సైనిక్ స్కూల్ ఉందని తెలిసి ఆశ్చర్యమేసింది , ఒక ఏడాది కి 220 మంది ట్రైనింగ్ పూర్తి చేసి బోర్డర్ కి
వెళ్తారట  . ఆఫీసర్స్ ఐతే 20 మంది వస్తారట ,వాళ్ళకి క్లాసులు చెప్పటానికి . వారి అవసరాలకోసం హెలిపాడ్
కూడా ఉందట . బొటానికల్ గార్డెన్  లో ఫొటోస్ వీడియోస్  తీసుకున్నాము . మొత్తం తిరిగి చూసే ఓపిక
అయిపోయింది . ఈసారి తిన్నగా ఊటీ వెళ్లిపోవాలని  నిర్ణయించు కుని ,ఎన్నో ఆనందాల్ని అనుభూతుల్ని
మనసులో నింపుకుని  తిరుగు ప్రయాణం అయ్యాము .

********************************************************************************

Saturday, March 10, 2018

వేసవికి స్వాగతం
ఇప్పుడిప్పుడే  వేడిమి పెరుగుతోంది , మొన్ననే గా  శివరాత్రికి  శివశివా అంటూ చలి పరుగెత్తి పోయింది .
అప్పుడే మావి చిగురు  ముదురు రంగులో కోయిల గొంతు శృతి చేసేందుకు వేసవికి ఆహ్వానం పలుకుతోంది .
ఆకు రాల్చిన వేప చెట్లు  చిగురిస్తున్నాయి ,అక్కడక్కడా కొన్ని చెట్లకు  పూతకూడా మొదలై నట్లుంది ,అందుకే
మధురమైన వాసన ,ఎవరైనా ఊహిస్తామా  తియ్యని వాసన వేసే వేపపువ్వు చేదుగా ఉంటుందని .... కొంత
మంది మనుషుల్లాగే , చక్కని చిరునవ్వుతో పరిచయమౌతారు  నచ్చక పొతే   విషం చిందిస్తారు . సహాయం
చేస్తున్నట్లు నటిస్తూ ,చేయందిస్తూ తియ్యని నవ్వులు చిందిస్తూ గోతిలోకి తోస్తారు . మనుషుల నైజం
భగవంతుని సృష్టి   కాదు ,స్వయం కృతాపరాధం . హేవిళంబి  నామ సంవత్సరం  వీడ్కోలు తీసుకుని ,విళంబినామ సంవత్సరం రాబోతోంది . తెలుగు వారి
పండుగ ''ఉగాది ''. తైలాభ్యంగ స్నానం , నూతన పంచాంగ శ్రవణం ,నింబకుసుమ భక్షణం ,ఇష్ట దైవ దర్శనం
పండితుల ఆశీస్సులు పొందడం ,పంచాంగంలో రాసిన ప్రకారం  చేస్తారుగా !


చల్లని గాలి  చెవి పక్కాగా వెళ్తూ  కొంత జుట్టు  మొహాన వేసి పోయింది ,అది సర్దుకుందామని  తలపైకెత్తాను
పైన దుండిగల్  ట్రైనీ ప్లైట్ ఝుమ్మంటూ దూసుకుపోయింది . రోజూ నాకలవాటే  వేసవి సాయంత్రాలు మేడపైన
గడుపుతుంటాను . విమానాలు  లెక్కపెడుతూ ఆనందిస్తుంటాను .
అన్నట్లు ఐస్ వాటర్ కోసం ఫ్రిజ్  లో  బాటిల్స్ నింపి పెట్టాలి . ఈసారన్నా  ఒక పక్కాగా ఇసుక పోసి ఇమ్లి కుండ
పెట్టుకుంటే బావుండును . చల్లదనం ఎక్కువ తక్కువ లేకుండా తియ్యని నీరు త్రాగచ్చు . అసలు రాత్రి పూట
మంచం దగ్గర ఫ్రిజ్ లోని మంచినీళ్ల బాటిల్ కన్నా  మట్టి కూజా తో నీళ్లు పెట్టుకుంటే ఎంత బావుంటుంది .
మట్టి మూతతో సహా కూజా కొనుక్కురావాలి . అలాగే ''తివోలి ''వైపు వెళ్తే వెదురుబుట్టలు కొనాలి .
మామిడి పండ్లు పెట్టుకోవాలికదా ! మల్లెపూలు  తెచ్చే అతను  ఈసారి వస్తాడో రాడో , బార్లీ గింజలు ,
సబ్జా గింజలు  తీసుకు రావాలి ,పోయిన సారి  టీవీ ల పుణ్యమాని  ఫలుడా చేస్తే ఎంత బాగా వచ్చిందని ,
ఈసారికూడా చెయ్యాలి .

ఊరెళ్తే పచ్చి జీడీ పప్పు తో  రొయ్యల కూర ,కోడి కూర చేసి పెడతారు హబ్బా .. ఎంతబావుంటుందని ..
వేసవిలో  వచ్చే వర్షం ఎంతబావుంటుందని .. మట్టివాసన గుమ్మెత్తి పోతుంది ,గుండెలనిండా తడిసిన
మట్టివాసన ఎంత పీల్చినా తనివితీరదు . ఒక పక్క ఎండ ఉండగానే  జల్లులు పడి హరివిల్లు వస్తే
ఆ  ఆనందమే వేరు ......

(నాకు ఎప్పుడూ  వర్షాకాలం ,శీతాకాలం  మాత్రమే  నచ్చుతాయి  వేసవిని కూడా ఆస్వాదించాలని
'తప్పదని ' తెలిసికొని  వేసవికి  ఆహ్వానం పలుకుతున్నాను )

***************************************************************************

Sunday, January 7, 2018

భోగి గణపతి.

తూర్పు గోదావరిజిల్లా  కాకినాడలో ,టూ టౌన్  పోలీస్టేషన్ పరిధిలో ,దూసర్లపూడి వారి వీధిలో , భోగి పండుగకి  భోగిమంట  వేస్తే , కాలిన కర్రలు కాలంగా  మిగతాది వినాయకుని రూపంలో
మిగిలిందట . భక్తులంతా  ఆ రూపానికి పసుపుకుంకుమ  అద్ది ''భోగి గణపతి గా '  గుడి కట్టి
పూజలు చేస్తున్నారు ,అన్ని గణపతి ఆలయాల  లా, వినాయక చవితికి  కాకుండా ,భోగి కి  పూజలందుకునే  ఈ  ''భోగి గణపతిని'' ని మీరూ   దర్శించుకోవాలని ఇక్కడుంచుతున్నాను .

 *********************************************************************************