Total Pageviews

Thursday, August 30, 2018

పెళ్లిచూపులు .


(పెళ్లికూతురి నిర్వాకం )

పిల్లలకు ఫ్రీడమ్  ఇవ్వాలి  నిజమే కానీ ఎంతవరకు  దేనికైనా  హద్దుంటుంది . వాళ్ళు అడిగిందల్లా చిన్నతనం లో
అమర్చి పెడతాము . ఎదిగే కొద్దీ కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలి  లేక పొతే మొండికెత్తి  వాళ్ళు చెప్పిందే వేదమంటూ మనమే వాళ్ళ మాట వినేట్టు చేసుకుంటారు . థాంక్ గాడ్ .. నాకా పరిస్థితి లేదు  నేను (చాలా )
జాగ్రత్తలు తీసుకున్నాను . కానీ కొన్ని ఇళ్లల్లో  జరిగేవి చుస్తే భయమేస్తోంది . పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉంటే
సినిమా తీయొచ్చు  అన్ని విచిత్రాలు  జరుగుతున్నాయి .

ఐటీ ఉద్యోగం వెలగబెడుతున్న  పాతికేళ్ల కొడుకుని  సెలవు పెట్టమని ,పెళ్ళిచూపులకి  వెళదామని  తల్లి
చెప్పగానే , ముందుగా  వాళ్ళుచేసే పని 'తాతకి' వంట్లో  బాగాలేదని ఊరు వెళ్తున్నామని  చెప్పి సెలవు
తీసుకుంటారు .  తల్లికి బాధ కలిగి అదేంట్రా శుభమా అని పెళ్లి చూపులకి  వెళదామంటే ,ఆరోగ్యం
బాగాలేదని  అబద్దం చెప్పి సెలవు పెట్టావు  అదికూడా  తాతగారికి అంటే 'అబ్బా ..లైట్ మా, లేకపొతే
మా మేనేజర్  లీవ్ ఇవ్వడు '. ఇది వాళ్ళ వాదన . (తాతగారు బ్రతికే వున్నా ఆరేళ్లక్రితం మరణించినా
సరే ) ప్రస్తుతానికి ఇది మన కాన్సెప్ట్ కాదు కనుక  వాళ్ళు వెళ్లిన చోట ఏంజరిగిందో  చెప్తాను . అంతాకలిసి
ఐదుగురు  వెళ్లారు  వచ్చారు . వూరినించి  రాగానే మేమంతా  అమ్మాయి ఎలావుందీ ,పెళ్లి కుదిరి పోయిందా
అంటూ  ప్రశ్నల వర్షం  కురిపించాము . శాంతి గారు (అబ్బాయి తల్లి )చెప్పింది  విని  మేం నోళ్లు వెళ్ళబెట్టాము .
వెళ్లినవాళ్ళకి  మర్యాదలు అవి బాగానే  చేశారట  అమ్మాయిని చూపించారట బావుందట ,అబ్బాయి మొహం
చుస్తే  తనకి కూడా నచ్చినట్టు అనిపించిందట ,శాంతి గారు కొడుకుని చూసి కళ్ళెగరేస్తే  బావుందన్నట్టు తలాడించాడట ,సరే మీరిద్దరూ  కాసేపు మాట్లాడు కోండి  అని మేడ  మీదికి  పంపించారట . పైకి వెళ్ళగానే
సిగెరెట్  అలవాటుందా  అని అడిగింది  ఎంత అలవాటున్నవాడన్నా  పెళ్ళిచూపుల్లో సిగెరెట్  కలుస్తానని
ఒప్పుకోడానికి  ఆలోచిస్తుంటే , అక్కడే ఉన్న రూమ్ నించి సిగెరెట్ తెచ్చి  ఇవ్వడమే కాకుండా తాను కూడా
వెలిగించింది ,అదికూడా కాదు అబ్బాయిని బాధించింది లంగాఓణిలో  పొగ ఊది పారేసింది  అది నచ్చలా
మనోడికి . అంతే  కాదండోయ్  మీకు లవ్  స్టోరీ  ఎమన్నా వుందా ,అని అడిగిందట  అబ్బే అలాంటిదేమన్న
ఉంటే పెళ్లి చూపులకి  ఎందుకొస్తాను  అంటే '' నాకు లవ్ స్టోరీ వుంది మరి  ,వాడు మా డాడీ తో మాట్లాడాడు
డాడీ' నో ' అన్నాడు  మావాళ్లు కులం పిచ్చోళ్ళు ,వాడు యూ ఎస్ వెళ్లి పోయాడు  మీకు ఏమాత్రం యూ ఎస్
వెళ్లే ఆలోచన వున్నా నాకు ఈ పెళ్లి ఇష్టమే !!?? అందట . మనోడు పరుగో పరుగు . అన్నీ అమ్మకు చెప్పుకుని
ఏడ్చినంత పనిచేసాడు . తల్లి మనసు బాధతో  తల్లడిల్లి పోయింది ఈసారి బాగా వివరాలు తెలుసుకుని
వెళ్లాలండి  అని శాంతిగారు చెప్తుంటే  నాకు కాళ్ళు వణికాయి . ఇంతకీ  యూ ఎస్  వెళ్లి 
మనోడికి హ్యాండిచ్చే ఆలోచనలో ఉందని  శాంతిగారు  విడమర్చి చెప్పితేగాని తెలియలేదు మరి . 


(పెళ్ళికొడుకు నిర్వాకం )

ఆ మధ్య  ఒక సంఘటన  నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది . అదేమిటంటే ,ఎవరు, ఏమిటీ
అని మీరు అడక్కూడదు మరి :) ఒకబ్బాయికి  అమ్మాయికి పెళ్లిచూపులు జరిగాయి . అబ్బాయికి
అమ్మాయి నచ్చింది ,అలాగే అమ్మాయికి కూడా  అబ్బాయి నచ్చాడు . పెద్దవాళ్ళకు పెట్టు
పోతలు  నచ్చాయి ,అంటే ఇచ్చి పుచ్చు కోడాలు అన్నమాట . కధ సుఖాంత మైందా ,
ముహుర్తాలు  పెట్టు కున్నారు ,నెల రోజుల్లో పెళ్లి , ఇక్కడే పెద్ద మలుపు  ,కుదుపు నూ
అమ్మాయి వాళ్ళ ఇల్లు రోడ్డుకి  ఇవతల వుంది . అవతలికి వెళ్ళాలి అంటే  కాలువ మీదుగా
వెళ్ళాలి ,అటు వైపు వెళ్ళడానికి  ఒక తాటి దుంగ వేసి ఉంచారు ,కాలి  నడకను వెళ్లే వాళ్ళు
ఆ దుంగ మీదుగా నడిచి వెళ్తారు . ఎన్నో ఏళ్లుగా ఆదుంగ అలాగేవుంది  వాహనాలువున్నవాళ్ళు
చుట్టూ తిరిగి వెళ్తే లేని వాళ్ళు  దగ్గర కదా అని  దుంగ మీదుగానడిచి వెళ్తారుచిన్నప్పటి నించి
అలవాటున్న ఆ అమ్మాయి  ఆరోజు ఖర్మ కాలి , కాలు జారి  కాలువ లో పడిపోయింది . చుట్టూ
వున్నవాళ్లు  వెంటనే  బయటకు తీశారు . చిన్నపాటి  గాయాలతో  బ్రతికి బయట పడింది .
విషయం పెళ్లి వాళ్లకి తెలిసింది  అత్తగారు  పలకరింపుకు వచ్చింది . (అని వీళ్ళనుకున్నారు )
వచ్చినావిడ  చల్లగా ఒక కబురు చెప్పింది  ఏమిటో తెలుసా ''నాలా లో పడిపోయిన అమ్మాయిని
మా అబ్బాయి పెళ్లి చేసుకో నంటున్నాడు '' ఇదీ విషయం . ఎవరెంత నచ్చ చెప్పినా  వినలేదు
పెళ్లి క్యాన్సిల్  చేసుకున్నారు . నాలాలో (కాలువ )పడిపోతేనే  పెళ్ళికి పనికి రాదనుకుంటే
విధి వంచితులను ఉద్ధరించే వాళ్ళున్నారు  వాళ్లేమై పోవాలి ?? అమ్మాయి త్వరగా ఆ పీడకల
నించి కోలుకుని పెద్దవాళ్ళు చూసిన  మరో కొత్త జీవితం ఎంచుకుంది . కానీ నాకు మాత్రం
ఆ అబ్బాయి  ఇప్పటికి గుర్తు కొస్తూనే ఉంటాడు , ఏమి వ్యక్తిత్వం ?ఏమి పెంపకం ?ఎలా
బ్రతుకుతున్నాడో  తెలుసు కోవాలని ఉంటుంది .
 
********************************************************************************