Total Pageviews

Thursday, October 29, 2015

అట్లతద్ది .
అట్లతద్ది అనగానే అమ్మాయిలంతా  జడగంటలు పెట్టి అల్లుకున్నజడా,  లంగాఓణి  వేసుకుని ,కాళ్ళకి పట్టీలు
జడలో కనకాంబరం పూలు .. స్నేహితురాళ్ళతో  కలిసి కిల కిలలు , వేకువఝామునే  ఉయ్యాలలు .... 
ఇవన్నీ సినిమాలలోనే అనుకుంటున్నారా ! ఐతే పప్పు లో కాలేసినట్టే ! మీరు నమ్ముతారో  నమ్మరో
నిజంగా కూడా మా చిన్న తనం లో ప్రతి అట్లతద్ది ఇలాగే  జరిగింది .
తెల్లవారుఝామున  లేచి స్నానాధికాలు  కానిచ్చి , గోంగూర పచ్చడి, గడ్డపెరుగు ,వేసుకుని అన్నం తినేసేవాళ్ళం . 
చుక్క చూసి  హమ్మయ్య తినేసరికి  వెలుగు వచ్చెయ్య లేదునయం ,అనుకుంటూ అంతా కలిసి రాత్రికి రాత్రే పోరు 
పెట్టి మరీ  మామిడి చెట్టుకు కట్టించిన  ఉయ్యాల ఊగుతూ ,తద్దిపాటలన్నీ పాడుకునే వాళ్ళం . వెలుగు రాగానే 
లేచిన  పెద్దవాళ్ళు కనకాంబరాలు  కోయండి ,గోరింటాకు కోసుకు రండి అంటూ పనులుపురమయించేవారు .
ఎందుకో అప్పుడు తెయలేదు కాని ఇప్పుడన్పిస్తుంది ఆకలినుంచి దృష్టి మరల్చడానికని . పూలు ఎవరివి వాళ్ళే
మాల కట్టుకునే వాళ్ళం ,గోరింటాకు రుబ్బి వరుసలో అందరిని కూర్చో పెట్టి పెట్టేవాళ్ళు ఎవరిచేతులు బాగా పండితే
వాళ్లకి ''మంచి ''మొగుడు వస్తాడని చెప్పేవాళ్ళు . సాయంత్రం అయ్యేకొద్ది  ఎప్పుడు చీకటి పడుతుందా !ఎప్పుడు
చందమామ వస్తాడా అన్పించేది . అంతలోపటే మావాళ్ళకు అర్ధం అయ్యేది ''బాటరీ డౌన్ అవుతోందని ''బీప్ బీప్ ''
మంటూ మొహాలు వేళ్ళాడే సేవాళ్ళం ,దాంతో ముందుగా  గౌరీదేవి కి పూజ చేసుకు రమ్మని వాగు దగ్గరకి పంపించేవాళ్లు ,పసుపు గౌరమ్మ,  పూలు పళ్ళు తీసుకు వెళ్లి  ఏటి ఒడ్డున పూజ చేసుకుని వచ్చేవాళ్ళం ఆసరికి
చీకటి పడేది ,తొమ్మిది అట్లు అమ్మవారికి ,తొమ్మిది వాయనం ఇవ్వడానికి ,తొమ్మిది తినడానికి ,వేసి ఇచ్చేవాళ్ళు .
ఇంట్లోకూడా పూజ ముగించి ,చంద్రుడు ఎప్పుడు వస్తాడా (ఎప్పుడు తిందామా )అని ఎదురు చూసే వాళ్ళము .
చంద్రుణ్ణి చూడకుండా తినకూడదట పూర్వం ఇలాగే ఉపవాసం ఉన్న బాలిక సొమ్మసిల్లి పొతే  అన్నలిద్దరూ గడ్డి
వెలిగించి ఆ మంటనే చంద్రుడు గా ఆ బాలికకు చూపించి  తినిపించేసారట ,ఫలితంగా ముసలివాడు భర్తగా వచ్చాడట,ఆ కధ చెప్పి భయపెట్టేవాళ్ళు . ఐతే ఒకసారి బాగా మబ్బులుపట్టి  విపరీతమైన వర్షం ,వర్షం వెలిసినా
మబ్బులు తేలిపోలేదు ,చందమామ రాలేదు . పూజ ఇంట్లోనే చేసుకుని కూర్చున్నాము ,ఆరైంది ,ఏడైంది ,ఏడీ
చందమామ రాడే !ఫర్వాలేదు తినేయొచ్చు అంటారు ,నేను, నా స్నేహితురాలు మాత్రం పట్టుదలగా కూర్చున్నాం .
ఎనమిది కావస్తుండగా  మాఅన్నయ్య ,వాళ్ళన్నయ్య  కలిసి శుభవార్త తెచ్చారు చందమామ వచ్చాడని , సంతోషంగా  వెళ్లి మబ్బులలోంచి అప్పుడే మెల్లిగా మాకోసమే వస్తోన్న చందమామని చూసి నమస్కారం చేసుకుని అప్పుడు కూర్చున్నాం తినడానికి ,తొమ్మిది అట్లు మీరే తినాలి అంటే తినలేమంటూ గారాలు పోయేవాళ్ళం ప్రతి ఏడు.   తొమ్మిదిఅట్లు  కానిచ్చేసి ,మరో తొమ్మిది సీతాఫలాలు హాంఫట్ చేసేసి ,మరోనాలుగు కమలాలు మాయం
చేసేసాం ,అందరూ ఒకటే నవ్వడం ,ఏమైతేనేం మంచి భర్త, భర్త తో పాటు  మాస్నేహం కూడా అలాగే వుంది ఏళ్ళ
తరబడి ,నాస్నేహితురాలు కూడా ఇక్కడే వుంది .మా పదకొండేళ్ళ వయసులో  మా పెద్దవాళ్ళ ఉద్యోగ రీత్యా అడవిలో మొదలైన స్నేహం.  వాళ్ళ నాన్నగారురేంజర్ (తన శ్రీవారు ఇక్కడ డి  ఎస్  పి గా వున్నారు )అదే నవ్వు
అదేమాటతీరు ,మనసువిప్పి మాట్లాడే పద్దతి, తనను చుస్తే  వాళ్ళ  అమ్మగారు గుర్తుకొస్తారు , వాళ్ళింట్లో బెల్లం
ఆవకాయతో  భోజనం చేసిన రోజులు గుర్తుకొస్తాయి . మా నాన్నగారికి  కూరలు ప్రత్యేకంగా పంపేవారు ,ఎందుకండీ అంటే మీకోసం కాదు ,అన్నయ్యగారికోసం  అనేవారు అభిమానం గా ........

''అట్లతద్ది '' నోము నాతోనే ఆగిపోయింది  , పాపతో నోముపట్టించాలన్న  నాకోరిక తీరలేదు . సెలవు'లేని' రోజున
నోము ఎలాచేయిస్తావు ,ఒక్కతీ ఎలావుంటుంది ,మరుసటి రోజు నీరసంతో  బండెడు  నోట్స్ ఎలారాస్తుంది అంటూ
నా కోరికకు అడ్డు కట్ట వేసారు . కాని  పండుగ జ్ఞాపకాలతో  గతం లోకి పరుగులు తీసే  నామనసునేవరాపగలరు ?

(అక్కడున్నప్పుడు ,నగరజీవితం గురించి మాట్లాడు కొనేవాళ్ళం . ఇక్కడికి వచ్చాక ఆ రోజులు  తలచుకుంటాం .
నాకన్పిస్తుంది .. గతంలోనూ , భవిష్యత్లోనూ  కాకుండా  ప్రస్తుతాన్ని ప్రేమిస్తే .. అని, నేనిప్పుడదే చేస్తున్నా !!                                  *************************************

Thursday, October 22, 2015

పెద్దమ్మ తల్లి గుడి (జుబ్లీ హిల్స్ )


                              ''దసరా శుభాకాంక్షలు ''

          చెడు మీద మంచి ఎప్పుడూ  విజయం సాధించాలని ,  

  మనందరికీ మంచి జరగాలని  ఆ అమ్మవారిని   కోరుకుంటున్నాను . 

************************

Thursday, October 15, 2015

శ్రీపురం

తమిళనాడు లోని  వెల్లూరు లోని  '' శ్రీపురం " లో మహాలక్ష్మి అమ్మవారి గోల్డెన్ టెంపుల్ . 

శ్రీపురం  వెళ్ళాలని  ఎప్పటి నించో  అనుకోవడం ,తిరుపతి  మాత్రం వెళ్లి  హడావిడి గా తిరిగి రావడం ,జరుగుతోంది .
ఈసారి అలా  కాకూడదు అనుకుని ముందుగానే పక్కా ప్రణాళికతో  వెళ్ళాము . తిరుమల లో స్వామి దర్శనం చేసుకుని , శ్రీపురం  వెళ్లాము . నక్షత్ర ఆకారం  లో ఉన్న క్యూ లైన్  ద్వారా నడుస్తూ ,మంద్రమైన  మంత్రోచ్చారణ  వింటూ నెమ్మదిగాకదిలే లైనులో వెళ్తూ తెలుగు ,తమిళ్ ,మలయాళీ  భాషల్లో  మైక్ లో దేవాలయం  వారుచేసే సూచనల ప్రకారం  దర్శనం  చేసుకున్నాము . అమ్మవారు పూర్తి గా బంగారం తో చేసిన దేవాలయం  మధ్యలో
ఎత్తైన ప్రదేశం లో కొలువై వున్నారు . దర్శనం  కాగానే , లైనులోనే కుంకుమ వాళ్ళే పెడతారు ,తరువాత ప్రసాదం .
ఇక విశాలమైన  గుడి ప్రాంగణం లో  చక్కగా పెంచిన పూలమొక్కలు , కొలను  ఆహ్లాద భరితమైన వాతావరణం .
చాల బావుంది . ఎప్పటిలాగే కెమెరాలు , బేగ్ లు ,చెప్పులు ,అన్నిటికి లాకర్లే . అందువల్లనే  ఫోటోలు తీసే వీలు
లేకపోయింది ,ఇవన్నీ గూగుల్ లోనివి.  


                                                 ********************************

Thursday, October 8, 2015

మీకు ఎంతమంది ' బాలూ ' లు తెలుసు ? .నేను పనిలో ఉండి 'కాస్త  ఆ  టైలర్ కి  ఫోన్  చేసి  బట్టలు  తెమ్మని చెప్పండి 'అన్నాను . చాల సేపు వెతికి  ఏమని
ఫీడ్  చేసావు  పేరు,  అనడిగారు , అదా '' బాలు''  అని వుంటుంది  చూడండి ,అన్నాను . అదేమిటి  అతని పేరేదో
వుండాలి గా ?అన్నారు నేను నవ్వేసి  జీవితం లో  అనుకున్నది సాధించ లేక పోయిన  వాళ్ళని  , వైఫల్యం
చెందిన  వాళ్ల ని  నేనలాగే అంటాను ,అందుకే  ఆ పేరుతొ  ఫోన్ లో ఫీడ్ చేశాను ,మీరు 'సాగర సంగమం 'చూడ
లేదా  అని అడిగాను . నిజమండి  చేతిలో మంచి పని ఉంది  , ఒక పెద్ద షాప్ పెట్టుకుంటే  ,పేరు వచ్చేది  కాని ,
అతను  చిన్న షాప్ నడుపుతున్నాడు . మాములుగా  వచ్చే ధర కన్నా సగమే వస్తుంది . అంతెందుకు  నేను
కూడా  బయిటి ధరతో పోలిస్తే సగానికి సగమే ఇస్తాను . ఇతనే కాదు ఇలా చాలా మందే వుంటారు  జీవితం లో
అనుకున్న స్థాయికి  చేరుకోలేక  పో యినవాళ్లు , కొంత మందికి ప్రయత్నలోపం ,మరికొంత మందికి  అలసత్వం
మరికొంత మందికి  అన్నీ  వున్నా 'అదృష్టం కలసి రాక పోవడం ' నిజమండి  అదృష్టం అనేది  ఏదో ఒక మూల
కొంచెమన్నా  లేనిదే చతికిల పడేది  ఖాయం . అచ్చం  సాగర సంగమం  లో''  బాలు '' లాగ [కమలహాసన్ ] .ఇక నాకెంతో నచ్చిన  '' సాగరసంగమం '' సినిమా విషయానికి వస్తే ,బాలు గురించి మీకంతా తెల్సి పోతుంది .
లేదా  మొత్తం గుర్తు కొచ్చేస్తుంది . బహుశా మీరు కూడా విశ్వనాద్  గారి అభిమానే అయ్యుంటారని నా
అభిప్రాయం . ''బాలసుబ్రమణ్యం '' అందులో కమల్ పేరు . భారతీయ నృత్య  సాంప్రదాయాల న్నీ కలిపి
తానొక  కొత్త విధానం  కనిపెట్టాలని  అతని ఆశయం . అన్ని విధాలైన  నృత్యాలు నేర్చు కుంటాడు ,ఒక
దిగువ మధ్య తరగతి వ్యక్తిగా  అతని ప్రయత్నాలేవీ ఒక కొలిక్కి రావు. మాధవి  గా  జయప్రద పరిచయం,
అవుతుంది . తొలి సీన్ లోనే  పసుపు రంగు చీర లో  మన మతులు పోగొడుతుంది . వారిద్దరి  ప్రయాణం
ఒకే పడవలో అని తెలుసుకుని  బాలూ  కి కొండంత అండ గా  నిలబడుతుంది ,చేయందిస్తుంది .  కానీ ..
తల్లి మరణం తో  తొలిమెట్టు దగ్గరే  కూలబడతాడు .  కోలుకుని  మళ్లీ నిలదొక్కుకునే  ప్రయత్నం లో
మాధవిని  పెళ్లి చేసుకోవాలి  అనుకుంటాడు . ఎంతో  గౌరవంగా  ఆమె తండ్రిని సంప్రదిస్తాడు . అప్పుడు
 తెలుస్తుంది ఆమె వివాహిత అని . మరో ఎదురుదెబ్బ ,  బాలు తనని   ప్రేమించాడు కనుక  అతనితోనే
జీవించాలని వెదుక్కుంటూ వస్తుంది . కాని అక్కడ ఆమె భర్త వుంటాడు . అంతే కాదు  వీళ్లిద్దరిని కలప
డానికి వచ్చానంటాడు . కాని సాంప్రదాయ  కళల నే కాదు ,సాంప్రదాయాన్ని  గౌరవించే వ్యక్తీ బాలూ .
భార్యభార్తలిద్దరిని  కలిపి తనుమాత్రం  వంటరిగా మిగిలిపోతాడు బాలు . రైల్వే  స్టేషన్ లో  వాళ్లిద్దరినీ
కలిపి ఫోటో తీస్కుంటాడు . చంచలమైన మనసుతో ,బాలూ ని ఎంచుకో  బోయిన ఆమెకు నచ్చచెప్పడం
వల్ల , సరైన దారిలో జీవితం మలచడం వల్ల  కావచ్చు ,ఆమె బాలూ కి  రెండు చేతులా  నమస్కరిస్తుంది .
ఎన్ని సార్లు చూసినా  కన్నీళ్లు వస్తాయి నాకా సీన్ చుస్తే .....

తను పైకి వస్తే చూడాలనుకున్న  తల్లి చనిపోయింది ,తనని పైకి తెచ్చి చూడాలనుకున్న నెచ్చెలి వెళ్లి
పోయింది . ఒంటరి తనం , శూన్యం లో వ్యసనానికి బానిసవుతాడు . లక్ష్యానికి  దూరం జరుగుతాడు .
అలాగే ఎన్నో ఏళ్ళు  గడిచి పోతాయి . మాధవి కూతురు  పరిచయం , అప్పటికే  అనారోగ్యానికి గురైన
బాలు  ఆమె మాధవి కూతురని తెలియగానే ,  కనీసం  ఆమె నృత్యం లోనైనా   చిరస్మరణీయం  గా
మిగలాలనే  కోరికతో  ఆమెకు నృత్యం నేర్పిస్తాడు ,తను కోరుకున్న   కీర్తికిరీటాన్ని ధరించకుండానే
విగతజీవుడవుతాడు . చూసిన ప్రతి సారి ఒక కొత్త  సంగతి తెలుస్తుంది ఈ సినిమాలో .

 ''ఫెయిల్యూర్ ''దానికున్నంత బలం  ఇంక దేనికుంటుంది ? మనిషి జీవితాన్నే కాదు ,మానసిక పరిస్తితి
  ని కూడా అతలా కుతలం  చేసేస్తుంది . ఒక వైఫల్యం   తట్టుకోవడానికి ఎంతో  మానసిక బలం నిబ్బరం
కావాలి , మీరు కూడా చూసే వుంటారు , కాళ్ళు చేతులు సరిగా  లేని వాళ్ళు కూడా చక్రాల  కుర్చీ  లో
వెళ్లి మరీ  చిన్న పాన్ షాప్ నడుపుకుంటూ ,ఎవరి మీద ఆధార పడకుండా  గౌరవంగా  బ్రతుకుతుంటారు .
కానీ అన్నీ అవయువాలు సరిగ్గా  వున్న వాళ్ళు కూడా , తొందర  పడి  ఏదోవోకటి  చేసేయకుండా  ఏమి
చేయాలా  అని ఆలోచిస్తూ ... వుంటారు . ఏళ్లు గడిచి పోతాయి  ఈక్రమం లో పెళ్లి జరిగి పోతుంది ,పిల్లలు
 బయల్దేరి  పోతారు , వాళ్ళు ఎదిగి  సంపాదనా పరులవుతారు , ఇకనేం పెద్దగా ఆలోచించ కుండా వాళ్ళ
మీద ఆధారపడి  బ్రతికేస్తుంటారు . అలాంటి వాళ్ళను చుస్తే  వీళ్ళకి ఆత్మాభిమానం  అనే ''వాక్యం ''
ఒకటుందని తెలుసా !అన్పిస్తుంది . బహుశా అన్నిటికి మనసే ముఖ్యం ,మనసెలా  ఆలోచిస్తే ,మనం
అలా ప్రవర్తిస్తాం . కొన్ని నచ్చనివి ,  ఆలోచించడం  మానేస్తాం అందులోని మంచి చెడ్డలు పట్టించుకోం .
ఇలా బానేవుంది కదా!  అని అలవాటు పడతాం , ఒక్కముక్కలో చెప్పాలంటే ''మైండ్ సెట్ '' ఇంతకు
మించి ఆలోచించకు ,ఆలోచించావో కష్టపడవలసి వుంటుంది చూసుకోమరి అంటూ వివేకాన్ని నిద్ర
పుచ్చేస్తాము . హాయిగా రోజులు గడిచిపోతాయి [గడిచి పోయినట్టనిపిస్తాయి ] విలువైన జీవితం
చప్పగా చల్లారి పోతుంది  . ఐతే ఏమిటి ? కష్టపడకుండా , హాయిగా ముగించేసాం కదా అనేది వీళ్ళ వాదన ... ?


                                                  ******************************

Thursday, October 1, 2015

దిబ్బరొట్టి .


 

''దిబ్బరొట్టి ''  అంటే  బహుశా చాలా  మందికి తెలియక పోవచ్చు . కాని మా ఇంట్లో మాత్రం ప్రతి  శనివారం రాత్రి కి ,అదే ఫలహారం వుండేది  . వంట కాగానే  నాన్నమ్మ పప్పు నాన బెట్టే వారు ,అదికూడా  పొట్టుతో వుండే మినపప్పు .ఛాయమినపప్పు  అంటూ పోట్టుతీసిన  పూసల మాదిరిగా వుండే పప్పు మాత్రమే ఇప్పుడు  వస్తోంది  కాని ముదురాకు పచ్చరంగులో  పొట్టు తో వుంటుంది .అదే పప్పుకి పెరుగు ,నునె రాసి కొంచెం ఎండలో పెడితే
పొట్టు చెరగడం వల్ల ఎగిరి పోతుంది అదన్నమాట .  బాగా నానిపోయాక ,నీళ్ళపైన  చేతిని  గుండ్రం గా  తిప్పుతూ
పైకి తేలిన పోట్టును  వేరే గిన్నె లో వేస్తూ చాల ఓపికగా  కడుగుతారు ,అప్పుడు పప్పు తెల్లగా వస్తుంది . దానిని
పెద్దరోటిలో వేసి రుబ్బెవాళ్ళు  చాల మెత్తగా  వెన్నలా వచ్చేవరకూ  రుబ్బడమే,  ఆపని  పిల్లలు చేసేది కాదట .
నీళ్ళు ఎక్కువైతే  దోసెలు పోసుకోవాలట  ,ఐనా అది పిల్లలు రుబ్బే రోలా ఏమిటి ? గుండమ్మ కధ  లో సావిత్రి
ఎన్ టి ఆర్  కలిసి మరీ రుబ్బుతారే  అలావుండేది . తాత గారు  మద్రాస్ నించి తెచ్చారట ,ఎలా తెచ్చారో మరి ?!.
అప్పుడు నానమ్మని  అడగాలని తోచలేదు ,ఇప్పుడు అడగి  నేను మళ్లీ వెనక్కి రాలేనంత దూరం లో వుంది .
 మెత్తని మినప పిండిలో  తెల్లగా మల్లెపువ్వులా  కడిగిన రవ్వ ఉప్పుకలిపి ,కొంతసేపు  మూత పెట్టి ఉంచే వారు .
 [మిక్సి  లో వేసిన పిండి తో చేసిన  మన ఇడ్లీ మొగుడూ పెళ్ళాలు కొట్టు కోవడానికి  పనికొస్తుంది . అబ్బెబ్బే
అలాంటి దేమీ  లేదండి ఊరికే మాటవరుసకి చెప్పాను ,అలాంటిదేమైనా  వుంటే మీకు చెప్పకుండా నా ??. ]

సరే మరి  మన రొట్టె ఎంతవరకు వచ్చిందో చూద్దాం ..ఇప్పుడు కుంపటి వెలిగించే పని ,అలా  కంగారు పడతారేం ?
కుంపటి  అంటే ఏమిటో మీకు తెలీదని నాకూ అన్పించింది ,అందుకే బొమ్మ కూడా వేసాను కాని పాపం మీరు
క్షేమం గా  వుండడం కూడా నాకు ముఖ్యమే కదండీ .. అందుకే గూగులమ్మని  అడిగి  ఈ బొమ్మ తెచ్చాను .
ఆఖరికి  గ్యాస్ పొయ్యి  పుణ్యమా  అని'' కుంపటి  బొమ్మ'' గూగుల్  లో వెతుక్కోవాల్సిన పరిస్తితి . హతవిధీ ..

దీనిలో  బొగ్గులు వేసి ,ఒకబొగ్గు మాత్రం కిరోసిన్ తో తడిపి మిగతా  బొగ్గుల మధ్య వుంచి  వెలిగిస్తారు ,అగ్గిపెట్టేతోనే లెండి , ఆ (.. ఏమిటీ  ఏదో అంటున్నారు ? వామ్మో మీతో నేను వేగలేనండి  బాబూ !బొగ్గులు తెలీదా ,మొక్క జొన్నపొత్తులు  తెలుసు గా  ట్యాంక్ బండ్ ,నేక్లెస్ రోడ్  దగ్గర కాల్చి ఇస్తారుగా..ఆ (. అవేమ బొగ్గులు,నిప్పులుకుడా !
ఇప్పుడు మన కుంపటి  పైన  మూకుడు పెట్టి  నూనె పోసి  వేడెక్కగానే , ఆ పిండి  మొత్తం  ఆ మూకుడు అంచుల
వరకూ  వేసేస్తారు . పైన పల్చని మూతవేసి ఉంచుతారు . నిప్పులకారణం గా  సమం గా  ఉడికి పోతుంది  పైన
వైపు కాలడం కోసం  ఆ మూత పైన కూడా కొన్ని నిప్పులు పరుస్తారు . చక్కగా రెండువైపులా  ఉడికి  ఇల్లంతా
కమ్మటి వాసన వ్యాపిస్తుంది ,రెండు పక్కలా కర కర లాడడం మధ్యలో మెత్తగా వుండడం  దీని ప్రత్యేకత .  దానిని
ఒక పళ్లెం లో కుమ్మరించి  [మార్చి ]  ముక్కలుగా కోసి ,కొబ్బరి చట్ని తోకాని ,మిరప్పండు  చట్ని తో కాని
ఇచ్చేవారు , ఉఫ్  ఉఫ్ అని  ఊదు కుంటూ కారం  ఘాటుకు  కళ్ళల్లో నీరు కారుతున్నా , కళ్ళు ముక్కూ తుడుచు   కుంటూ  లాగించడమే  పని .  ఆహా  అదండీ శనివారానికి  వుండే ప్రత్యేకత , అది కూడా   దిబ్బరొట్టి  వల్ల వచ్చినది .

అన్నట్లు  ఇవాళ శనివారమే  కదూ  మా వారు రాగానే  పిల్లలతో సహా  పోయి ,పిజ్జా  తినేసి రావాలి , వుంటానండీ .


                                             ***************************