Total Pageviews

Thursday, September 27, 2018

సాంప్రదాయం
నాకెప్పుడూ అన్పిస్తూ  ఉంటుంది ,మన సాంప్రదాయం ఎంత గొప్పదో కదా  అని . ఈమధ్య
వచ్చిన ఒక సినిమాలో ''ఒక టీ తాగినంత సేపట్లో వరుడ్ని నిర్ణయించుకోవాలా '' అంటుంది .
జీవితాంతం కలిసి ఉండాల్సిన వాడిని  టీ తగినంత సేపట్లో అంటే...  కష్టమే మరి . కానీ
ఒక విషయం మాత్రం భేషరతు గా  ఒప్పుకోవాలి , పెద్దవాళ్లన్నా ,సాంప్రదాయాలన్నా ఎంత
గౌరవం లేక పోతే ఇంత  మంది కట్టుబడి వుంటారు ? పెళ్లి చీరలకోసం రోజంతా సరిపోదు
ఎంపిక చెయ్యడానికి ,ఏ ఫంక్షన్ హాల్ ,ఎలాంటి భోజనం ,ఎన్ని ఐటమ్స్ ,ఎంత ఖర్చు అంటూ
గంటలతరబడి  చర్చించే  పెద్దవాళ్ళు కూడా  అబ్బాయి గురించి  నిముషం లో నిర్ణయం
తీసేసు కుంటారు ,ఆశ్చర్యం కదా (కాదు  నమ్మకం ) కాబట్టే ఇన్ని కుటుంబాలు ఇంత
సర్దుకు పోతు సంతోషం గా ఉంటున్నాయి . అంతే  కదా మరి  ఒకే ఇంట్లో ఉంటే తల్లీ ,
కూతురూ  కూడా ఎదో ఒక సందర్భం లో అరుచు కోకుండా వుండరు . అలాంటిది ముక్కూ
మొఖము తెలీనియని వ్యక్తి తో  జీవితాంతం .... . అన్ని బావుండి సంసారం సక్రమంగా
సాగి పోతే ఒకే ,లేకపోతే...   అయినా కూడా మనసులో లోటు మొహం లో కనబడ కుండా
బండి లాగించేస్తూ  వుంటారు . ఈడూ జోడూ  కూడా లేని జంటలుంటారు ,లావుగా వున్న
అమ్మాయికి సన్నగా పొడుగ్గా వుండే  భర్త ,పొడవాటి అమ్మాయికి పొట్టి గ వున్న భర్త , అసలు
ఆవిషయమే  పట్టించుకోకుండా  హాయి గా  చేతులో చెయ్యేసుకుని కబుర్లు చెప్పుకుంటూ
వెళ్లిపోతుంటారు ,అది మనసులు కలవడం వాల్ల కావచ్చు . అన్ని చక్కగా వున్న వాళ్ళు
అరుచుకుంటూ పోట్లాడుకుంటూ  ఇరుగు పొరుగు ను కూడా మనశ్శాన్తి గా బ్రతకనివ్వరు .
మా నాన్న  ఒక ఇంగ్లిష్  సామెత చెబుతుంటారు ,హ్యాపీ గా వున్న కుటుంబాలన్నీ ఒకే రకంగా
ఉంటాయట , బాధలో  వున్న కుటుంబాలు మాత్రం రక రకాలుగా ఉంటాయట .


ఒక సామెత కూడా వుంది ,''ఈడూ  జోడూ చూసి ఏట్లో తొయ్యమని '' కానీ ఇప్పుడు మాత్రం
చక్కగా అటు  ఇటూ పెద్దలు పిల్లల్ని మాట్లాడుకుని అభిప్రాయాలు కలిస్తేనే  సరే అని
చెప్పమంటున్నారు ఇది బావుంది . వాళ్ళు మాట్లాడుకొనిసరే అంటే ముందుకు వెళ్తున్నారు
ఇలాంటి వన్నీ  పెద్దవాళ్ళు చూసే టప్పుడే  మళ్ళి  వాళ్ళు ప్రేమించినపెళ్ళైతే రూపు రేఖలు
ఎలావున్నా పట్టించుకోరు ,నాకు ఇది చాలా ఆశ్చర్యం గా ఉంటుంది . ప్రేమ గుడ్డిదట కదా ,
నాకు  అలాంటి  ప్రేమ తో పెద్దగా పరిచయం లేదు లెండి . నాకు  జీవితంలో చాలా
క్లారిటీ  కావలి , ఎలాంటి వారు , నాతో  ఎలావుంటున్నారు ,ఎంతవరకు  నమ్మచ్చు
దాంతో  క్వాలిటీ  పీపుల్  మిగులుతారు .
పెళ్లి కాంగానే  ముక్కూ మొహం తెలీని వాడి చెయ్యి పట్టుకుని  జీవితాంతపు జైలుకు
తరలి వెళ్లిపోవడం (సాంప్రదాయమే  కదా మరి ) నా అన్న వాళ్ళకి దూరమై పోవడం
''ఆడపిల్ల ''అన్నారుగా  ఆడనే ఉండనియ్యమని  పుట్టింటి వాళ్ళు తలచక పోవడం ,
కాళ్ళు కడిగిన నాడే  చేతులు కడిగేసుకునే వాళ్ళను  బొచ్చెడు మందిని చూసేను .
పసుపు కుంకుమలు పెట్టాల్సిన అన్నదమ్ములే  ఎందుకులే చీర ఖర్చు అనుకునే
రోజులు వచ్చాయి . లాటరీ లాంటి పెళ్లి లో లాటరీ తగిలితే  ఒక ఎత్తు లేకుంటే మరో
ఎత్తు . వెళ్లిన చోట భర్తే ప్రియుడై ,స్నేహితుడై  అండగా ,జీవితాంతం తోడుగా ఉంటే
ఆ అదృష్టమే వేరు . కానీ ఎవరి చెయ్యి పట్టుకుంటే  ధైర్యంగా వుంది, ఇతను జీవితం
అంతా పక్కనుంటే చాలు అనుకుంటుందో ,అతనే పిరికి వాడని  ప్రతి నిముషం
ఆమె ఆసరాకు చూసుకుంటాడని తెలిస్తే ,మొదలు నరికిన చెట్టులా కూలడం ఖాయం .
కానీ దైవికంగా  కాలం గడిచే కొద్దీ .. కొద్దీ కొద్దిగా అర్ధమౌతూ పొతూ ఉంటే మనసు ఒప్పుకోని
నిజం చేదు మందులా ,మందులేని వ్యాధిలా  శరీరము  మనసూ  వ్యాపిస్తే అందమైన
జీవితం  బొట్టు లేని సుమంగళి లా మిగిలి పోతే .. దాంపత్య మంటే ఆవేశమో ,అవసరమో
కాదు ,ఒక చల్లని స్నేహం. ఆడవాళ్ళకైనా ,మగవాళ్ళకైనా  తోడుఅవసరం ,పీడకాదు .


అతి మధురం గా  పాట పాడే అమ్మాయికి  చెవిటి వాడు భర్తయితే ,ఆ గానం ఎప్పటికి
చేరుతుంది  అతనికి ,అద్భుత మైన  కధలు  కవితలు రాసే వ్యక్తికి ,చదువు రానిది
భార్యైతే ,చదివి విని పించేలోగా  వడియాలు తియ్యాలని భార్య మణి సెలవిస్తే ...
పేద్ద పోలీసాఫీసరు ,నిజాయితీ పరుడు మంచి పేరు వున్న వ్యక్తికి ఇంటికొచ్చేసరికి
''పోలీసుద్యోగం నాకు భయం మానెయ్యకూడదూ అనే  భార్యదొరికితే , పూజలు వ్రతాలూ
చేసే  భార్యకి ''చాదస్తం '' అనే భర్త దొరికితే ,అద్భుతంగా నాట్యం చేసే నాట్య మయూరికి
అంధుడు భర్తైతే ... అందమైన భార్య వుండి  కూడా  మొహం 'మాత్రం' చుడనివాడైతే ..
చక్కగా వండి వారిస్తే , తిని త్రేన్చే వాడే కానీ మెచ్చుకునే  అలవాటే లేకుంటే ఆ
నరకం  ఎలా ఉంటుందీ .. పగ వాడికి కూడా వద్దని పిస్తుంది కదా !అలాంటి వారూ
లేక పోలేదు . ఒకరికి ఒకరుగా వుండే వాళ్ళు పది శాతం  ఉంటే ,ఇలాంటి వాళ్ళు
తొంభై శాతం వున్నారు . వారి ఓపికను ఏ విధం గా మెచ్చుకోవాలి ,సాంప్రదాయాన్నీ
పెద్దవాళ్ళని గౌరవిస్తూ ,అందని ద్రాక్ష పుల్లన ,అందిన దాంతో సర్దుకు పోవాలీ...
 అనుకుంటూ జీవించేస్తున్నవాళ్ళు మన మధ్య ఎంతమంది లేరు ? వాళ్ళ మొహాల్లో
నవ్వు తగ్గదు జీవితాల్లో లోటు జరగదు ,అందరూ మహా నటులను కోవాలా ,వారికది
అలవాటనుకోవాలా . ఏమో వంశ పారం పర్యం గా వచ్చిన పరంపర కావచ్చు మరి .

నేను మాత్రం అందరూ బావుండాలని ,అందులో నేనూ  ఉండాలని కోరుకుంటున్నా .

*************************************************************************