Total Pageviews

Thursday, July 30, 2015

నా ప్రావీణ్యం


నేను  మూడు నెలలు  కష్టపడి నేర్చుకున్నాను .  ఈ  పెయింట్ చెయ్యడం ఇష్టపడి  శారీస్ కి  వేసు కుంటున్నాను .
అంతటి తో  ఆగితే బాగుండేది . కొత్త కదా !సరదా కొద్దీ  ఎదీ  వదలకుండా పెయింట్ చేసేస్తున్నాను . చివరికి  వారి
టీ  షర్ట్  కూడా ! నేను అస్సలు ఖాళీగా వుండలేనండి ,ఏదో ఒక  పని వుండాలి  ఊరికే కుర్చోవాలంటే  ఏమి బావోదు
ఇదే కాదండి , బయటకెళ్ళి వస్తే  ఎవరో ఒకరిని అభినయిస్తాను . విశాఖ జిల్లా  , తూర్పుగోదావరి  , తెలంగాణా  యాసలతో ఇల్లు ఒక కొలిక్కి తెస్తూ వుంటాను . మీరు అనుకున్నది కరెక్టే   ''పాపం  మా వారు ''.................
                                         


Thursday, July 23, 2015

ఏ కార్ కొనాలని ???
కార్ మార్చి  కొత్తది  కొనాలని  నిర్ణయించాక ,ఒకరిద్దరు  వచ్చి చూసి వెళ్లారు . వారడిగే ధర నచ్చక ,ఆ స్తాన విద్వాంసుడు  లాంటి  మెకానిక్ దగ్గర సలహా అడిగాము . olx  లో పెట్టి అమ్మేయండి  అని చెప్పాడు  ఓహో
కమిషన్ ఆశించకుండా ,ఇంత మంచి ఐడియా  ఇచ్చాడేమో  ఇంకేంటి అని  రెచ్చిపోయి ,కార్ చుట్టూ నిలబడి
కూర్చుని బోల్డన్ని  ఫోటోలు తీసి [ మావి కాదు  కార్ వే  ] olx లో పెట్టేశాం . ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల ,ఫోన్ లు
మొదలయ్యాయి . ఎందుకమ్మేస్తున్నారు , ఎన్ని కిలోమీటర్లు  తిరిగారు , ప్రోబ్లం  ఏమైనా వుందా [వుంటే మాత్రం
చెప్తా మటండీ !!] కొందరైతే ఒకడుగు ముందుకేసి ,ఎక్కడ పన్చేస్తారు ?అంటూ అనుమనించేవారు . దొంగ  కార్ లు
కొని అమ్మేవాళ్ళ  లాగ  చూసేవారు ,ఫోన్లోనే లెండి . ఎంత చెప్తున్నారు ? ఇంతకైతే ఇస్తారా అని కొందరు ,అదేంటి
వచ్చి చూడరా  ,చూడకుండా  బేరమెలా  అడుగుతారు అంటూ  ఒహటే  హాచ్చెర్యం .... ఇంకో వెబ్ సైట్  వాళ్ళైతే
మేం ఇంట్రస్ట్ గా  వున్నాం అంటూ మెస్సేజ్  చేస్తారు . మనమే వాళ్ళని సంప్రదించాలి . ఒకొక్కరు ఒక్కో మూడ్ లో
వుండేవారు . మనసు మార్చుకున్నాం అని వొకరు ,టైం  కావాలని ఒకరు ,ఏమిప్రోబ్లెం వల్ల  అమ్మేస్తున్నారు అని
ఒకరు ,ఎంతైనా మనమే ఫోన్ చేస్తే లోకువే కదా !మొట్ట మొదట కార్ చూసి [olx లో ] ఫోన్ చేసిన వ్యక్తి మాత్రం
నేను వచ్చేయనా ? క్యాష్ తెచ్చి కార్ తీసుకు పోతాను  అంటూతెగ కాలు తొక్కేసే వాడు   నీ రేట్ మాకు నచ్చలేదు రా బాబోయ్  .. అంటే వినడు . మొత్తానికి మేము అనుకున్న ధరకి అమ్ముడైంది .  హమ్మయ్య అనుకుంటున్నారా ?
అప్పుడే ఎక్కడైంది ? ముందు వుంది క్రొకోడైల్ ఫెస్టివల్ ..........

ఇక మరో పర్వం  మొదలు . ఇప్పుడు కార్ కొత్తది కొనాలా ,పాతదా అని . పాతది కొనడం పిల్లలనించి ఎవ్వరికి
ఇష్టం లేదు . 2సం  లో పెద్ద ది కొందాము  అని నచ్చ చెప్పి ,ప్రయత్నాలు మొదలు పెట్టేము . ఒక స్నేహితుడు
నేను బెంగళూర్  వెళ్ళిపోతున్నాను కనుక ,నా కార్ తీస్కోండి  అన్నాడు ఒక సంత్సరం అయ్యింది ,10 వేలు
తిరిగింది ,పిక్ అప్ బావుంది ,రిజిస్ట్రే షన్ ,టాక్సకి టైం వుంది , సీట్ కవెర్స్  కొనక్కర్లేదు , ఫుట్ మాట్స్ వున్నాయి ,
బావుంది  కాని ...  కాని ... మైలేజ్ 13 కిలోమీటర్లు  ఒక లీటరు కిస్తోంది . ఇప్పుడోచ్చేవన్ని పదహారు ,కొండొకచో
23 కూడా ఇస్తున్నాయి . అలాంటప్పుడు ఈ ''బున్ దాయ్  -1  20'' కోనడమెందుకు అని మనసు పీకుతోంది .
స్విఫ్ట్ డిసెర్  కొత్తది చుసోచ్చేము . మోడల్ మార్చి చాల పెద్దదిగా చేసారు. అమేజ్ కి  పోటీ అట  ఈ మెగా సిటీ లో
మెగా ట్రాఫిక్ లో  కనీసం టర్నింగ్ కూడా తిప్పలేము . పొఇన చోటే వెతుక్కుందాం అని అదే వెబ్సైట్ లో వెతక
బట్టేము . కార్ నచ్చితే కలర్ నచ్చదు ,కలర్ నచ్చితే కార్ మైలేజ్ నచ్చదు .అంతా బావుంటే  తెగ తిరిగేసినవే
ఉంటున్నాయి . ఇక్కడొక తమాషా చెప్పనా !మా కార్ కొనే వాళ్ళు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకి  నవ్వుకొనే వాళ్ళం .
ఎందుకమ్మే స్తున్నారు  అంటున్నారు . చిన్న గీత కూడా లేని అందమైన మంచి కార్  కొనుక్కోవడానికి నెప్పా ?
అనుకునే వాళ్ళం . కాని చిత్రం గా ,అవే ప్రశ్నలు మేము అడుగుతుండే  వాళ్ళం .. తనదాకా వస్తే కానీ ......
ఎన్ని లక్షలు పెట్టి కొన్నా  కొంత మంది 'దయగల బాబులు' నడిపే పద్దతి మీద ఆధార పడివుంటుంది  మన కార్
అందం చందం , రాత గీత ,చొట్ట గిట్టా ను  . ఏమిచేస్తాం  స్వతంత్ర భారతదేశం  కదా  తప్పదు మరి ,భరించాలి .
ఒకవ్యక్తి తన కార్ ఆరు నెలలకే నెట్ లో పెట్టేసాడు . కలర్, కార్  నాకు తెగ నచ్చేసింది . వారికి ఫోన్ చేసాం వేరే
''దుమ్ము ధూళి ''అనే కార్ వుందట ,అందుకే అమ్మేస్తున్నాడట . సరే చుస్తామన్నాము ,ఇప్పుడు నేను సికింద్రాబాద్ లో వున్నా నన్నాడు ,మాకు దగ్గర అక్కడే చుస్తామన్నాము . వెళ్ళాము చూసాము .. సీట్ కవెర్స్ కూడా తీయలేదు
మాకు అతనికి ధరలో  20 వేలు మించి తేడా లేదు . సర్విసింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనడిగా !అతను
తడబడి  ఇంకా చేయించలేదు  అన్నాడు .  మైలేజ్ గురించి అడిగితె  ,అబ్జర్వే చెయ్యలేదన్నాడు . నాకేదో డౌట్
కొట్టింది . వస్తూ మళ్ళీ ఆస్తాన విద్వాంసుడి [మెకానిక్ ]  దగ్గరికి వెళ్లి   విషయం చెప్పాం . ఆ కారా వద్దండి
''ఆ  లూర్డ్  లిగో ''కొంటే  సర్వీసింగ్ కె ఆస్తులు అమ్ముకోవాలి ?పెట్రోల్  మంచినీళ్ళ  లాగా తాగుతుంది అన్నాడు . మాకు బుద్ధి వచ్చింది .

లెట్స్ గో  అంటూ వెళ్లి ముందు వాడిన  మోడల్ కార్  మళ్లీ ' కొత్తది' కొనుక్కొచ్చాము .పెట్రోల్ తప్ప మధ్యలో ఒక
నట్టుకుడా  అడగదు ఆ కార్ ఐతే ...  ఎందు కంటే  గత ఎనిమిదేళ్ళు గా  అదేగా వాడుతున్నాము .అన్నట్లు
మార్చే పోయాను ,ఇప్పుడు సర్విసింగ్ అంటూ పొద్దున్న  తీస్కెళ్ళి ఇచ్చి  సాయంత్రం మళ్లీ  ఆటో లో  వెళ్లి లేదా
ఉదయం నుంచి అక్కడే కూర్చునే పనిలేకుండా ,ఇంటికొచ్చి 2గంటల్లో ఇంటి వద్దే సర్విసింగ్ చేసి ఇచ్చి వెళ్తున్నారు
అదే ధరలో ,  ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరన్నా  వుంటే వెంటనే మీ కార్ కొన్న షో రూం  లో సంప్రదించండి .

మీకేమన్నా  ఉపయోగ పడుతుందేమో  అని మాత్రమె ..............

                *********************************************************

Thursday, July 16, 2015

గుర్తుండి పోతాయి ........
నేను  చాల  రోజుల  క్రితం  ఒక  సినిమా  చూసాను . ఆ  హీరోయిన్ పేరు  బ్రూక్  షీల్డ్  అనుకుంటా !! హబ్బా ...
భలేవుంది . హీరో  పేరు తెలీదు . సినిమా  మాత్రం  '' బ్లూ  లాగున్ '' ఏమి ఫోటోగ్రఫీ .. ఆ అమ్మాయినే  కాదు ,
ప్రకృతిని  కూడా  కళ్ళకు  కట్టినట్లు చూపించాడు . ఇప్పటికి  మర్చిపోలేను . అంతబావుంది . మళ్లీ చాలాసార్లు 
ఆ ఛానల్  పెట్టాను ,కాని ఎప్పుడూ  రాలేదు . ఇద్దరు  చిన్న పిల్లలు గా  వున్నప్పుడుపరిస్తితుల కారణం గా  ఒక దీవిలో  చిక్కుకు పోతారు అక్కడే  పెద్దవాళ్ళు అవుతారు . అందమైన  ప్రకృతి  నడుమ  ,ప్రకృతి సహజమైన  ఆహరం తీసుకుంటూ ,ఎంతో  సహజం గా  ఒక్కటవుతారు  భార్య భర్తలుగా  సహజీవనం సాగిస్తారు . ఒక సంఘటన  అంత 
చక్కగా  సినిమాగా  మలచగలగడం ,నిజంగా అద్భుతం . ఒక్కసారన్నా తప్పకుండ   చూడండి . 

ఆడ పిల్ల  గురించి  తప్పుగా  అనుకునే కొంత  మంది   మగవాళ్ళకు  , పెళ్ళికి  ముందు  వయసు  ప్రభావం 
వల్ల  కన్ను చెదిరినా ,మనసు చెదిరినా , అది కేవలం  క్షణికమే  అని . ఆమెకి  తాళి కట్టినవాడినే  ప్రేమిస్తుంది ,
ఆరాధిస్తుంది ,గౌరవిస్తుంది ,అని  చాల  సులభం గా అర్ధ మయ్యేట్టు గా తెలియచెప్పే  టట్లు  తీసిన  సినిమా !!!!
''హమ్  దిల్  దేచుకే  సనమ్ '' ఐశ్వర్య  అభినయం , అందం  చూసి తీరాలి . అంతే  కాదు  ప్రేమించిన  వాడిని 
తండ్రి కిచ్చిన మాట కోసం  దూరం  చేసుకుని ,పెళ్లి జరిగాక  భర్త తో సర్దుకోలేక భాద పడుతుంది . విషయం 
తెల్సుకున్న  భర్త ,ఆమెని  ప్రియుని చెంతకి  చేర్చలనుకోవడం . ఆప్రయాణం  లో కొన్ని సంఘటనలు  వారిని 
దగ్గరచేయ్యడం .. ప్రియుని  దగ్గర అతను  వదిలేసి  నప్పుడు , భర్తే సర్వస్వమని  నమ్మి  ఆమె , ప్రియునికి       [సల్మాన్  ఖాన్ ]వీడ్కోలు పలికి  ,భర్త తో కల్సి [అజయ్ దేవగన్ ]తిరుగు ముఖం పడుతుంది . 

నాకు  చాలా  నచ్చిన సినిమాలలో  ఇదీ ఒకటి ,ఏదీ రెండో సారి  చూడటం అలవాటు లేని  నేను  ఈ సినిమా 
మాత్రం చాలా  సార్లు  చూసాను . మొదటి భాగం  అంతా  సల్మాన్  తో సరదాలు , ఆటపాటలతో  గడిచి పోతుంది . 
రెండోభాగం  అజయ్  కోపతాపాలు ,ప్రయాణంలో  పదనిసలు .. వీలుంటే  తప్పకచూడండి .

''గ్రావిటీ '' చూసారా  చూసే వుంటారు . ఎంతో  బావుంది ,ఆ  సినిమాకి పెట్టిన ఖర్చులో  సగభాగం  తో మన
దేశం లో , అంతరిక్షం  లోకి  ఒక నౌక నే  పంపించారట . అంత ఖర్చు చేసి  తీసిన సినిమా ,ఒక రోజంతా మన
ఆలోచన  వదిలి పోదు . మంచి ఎక్కడున్నా మెచ్చు కు  తీరాల్సిందే కదా !!!!!! తప్పకుండ  చూడండి ,
మెచ్చు కొండి .

 బాహుబలి  బహుశా  చరిత్రలో  మిగిలిపోతున్దనుకుంటా ! అసలు  నీరే  లేనిచోట  అతిపెద్ద జలపాతమున్నట్లు ,
నీటి హోరు తో సహా  అతిచక్కని  అద్బుతమైన  సృష్టి ,చందమామ  కథలు చదివి  ఊహకందని  రాజ ప్రాసాదాలు
రాక్షసులు ,అడవులు జంతువులూ ,జలపాతాలు ఊహించడానికి  ప్రయత్నించేవాళ్ళం  కదా ! అవన్నీ  మన
కళ్ళముందు ఆవిష్కరించి  మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి పోతాయి . ప్రతి నిముషం  ప్రతి సీన్  రాజ మౌళి
కష్టం  కన్పిస్తుంది . ఎంత ప్రణాళికతో  అందర్నీ  నడిపించాడో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది . అన్ని భాషల్లో
నిర్మిస్తున్న చిత్ర మైనప్పటికీ  తెలుగు నటీ నటులకు మాత్రమె  అవకాసమివ్వడం అభినందనీయం . దర్శకుడి
ఆత్మవిశ్వాసానికి  తార్కాణం .
                             

                             బాహుబలి  ఒక  అద్భుతం . 


                 ********************************************************

Thursday, July 9, 2015

సరదాలసంసారం


1]    ఈ  మధ్య  మీసా లేమిటి  కిందికి పెంచుతున్నారు ?!        
       ఏం  బాలేవా ! కమల్ హసన్  లా  లేను ?
      ఉన్నారు ,ఉన్నారు ,గుణ లో  కమలహాసన్  లా  వున్నారు .
      మొత్తానికి ఒప్పుకున్నావు  కమలహాసన్  నని .
      [గుణ  సి డి  చుస్తే కదా , అందులో  కమల్  కురూపి ,హ్హ హ్హా ].
      [చూస్తె  వీపు విమానం మోతే ,మనం చూడనిస్తామా ,ఏంటి ] :)  :)

2]    బయటికి  వెళ్తున్నా ఎమన్నా  కావాలా ?                
       ఆ (  .. ఒక ' డై మెండ్'  నెక్లెస్  తెండి  చాలు .
         ఓకే  ఓకే  త్వరగా  వచ్చేస్తాలే  ....... [డై మెండ్  నెక్లెస్  ఎలాగూ  తేలేము ,
         త్వరగా వస్తే  సంతోషి స్తుంది  కదా ].
        [అంత  మాత్రానికే గొడవెందుకు ? ఇచ్చేటట్లు ఇవ్వాలంతే  ]

3]    ఏమిటి  ఆఫీసు  నించి  రావడానికి ఇంత  లేటా ??????
       అంటే  అదీ ,పంపాల్సిన  మెయిల్స్ ఎక్కువున్నయన్న  మాట .. ట్రాఫిక్  కూడా
       చాల  ఎక్కువుందన్నమాట  హ్హి  హ్హి ........
       సరే ఐతే  మీ  ఫ్రెండ్  మోహన్ రావు  గారికి  పోన్  చెయ్యండి  అతను  లాయర్  కదా !
       మన విడకులకోసమన్నమాట ,హ్హి హ్హి .........
        అబ్బే  ఎందుకు రేపట్నించి  త్వరగా  బయల్దేర తనాన్నమాట ....
        [అంత  సున్నితం  గా  చెప్పే వాళ్ళని  ఎవరు  వదులు కుంటారు ]

4]      అల్లం ముక్క కింద పడింది  చూడు ..
         అవునా  తీసిద్దురు  కాస్త ..  వంగగానే ' అయ్యో తప్పులు  అందరూ చేస్తారు  అంతమాత్రాన
         కాళ్ళ  మీద పడతారా !! [ఒక మొట్టికాయ  బహుమతి ]. :)  :)


5]       నా  ఫోన్ లో ' యాంగ్రీ  బర్డ్స్'  ఎవరు  డిలీట్  చేసారు ?[  చిందులు ]
         నేనే , అస్తమాను  అదే ఆడి తే  'సైటు 'వస్తుందని  .. [ అలక పాన్పు  మౌన వ్రతం ]
        సాయంత్రం  స్వీట్స్ తో  ప్రత్యక్షం . నేను పులిని  స్వీట్స్ తో  నన్నెవరు  కొనలేరు .
        సుపుత్రుడు  మధ్యలో  వచ్చి ''నన్నుకొనగలరు '' అంటూ స్వీట్స్ తో  పలాయనం :)

6]       ఈ  చీర బావుంది  బ్లూ  నీకు  బావుంటుంది ,తీసుకో ..
          వద్దులెండి  అది మరీ రే 'టెక్కు 'వుంది .
          ఎం కాదు ,తీసుకో  దానితోపాటు  నీకు నచ్చింది ఇంకోటి తీసుకో .
          [అదేమరి  టెక్నిక్ ] :)

7]      అస్తమాను బంగారం  కొనడమేనా ! ఎక్కడ  పెట్టుకుంటావు ?
          నేను కాదు  మీరే  పెట్టుకుంటారు  , అవసరం వచ్చినపుడు తాకట్టు .
          [రిటార్డ్ ] అస్సలు  తగ్గేది లేదు . :)


8]      బ్యాంకు లో ].. ఇంకో చెక్  బుక్  అప్లయ్  చేస్తున్నావా ,నీకు ఇంకోటి  కావాలా
          నాకంటా  రెంటి ,  మీకేగా  కావాలి  నా సంతకం తో  చెక్కులు :)
           ఓకే ,ఓకే ..... కెరీ ఆన్ ........ [ సొమ్ము  వారిదే ,సోకు  వారిదే ,కేవలం  గడ్డి వాము
          దగ్గర  కుక్క  మాదిరి .. తనుతినదు  మేకను తిననివ్వదు . అదన్నమాట విషయం . ]


9]      ఏంటి నాచిట్టి తల్లి  ఏడుస్తోంది ,ఏమన్నావు ? నేనేమనలా  వద్దన్నా వినకుండా  ఆ టుయ్
         జోకుల ప్రోగ్రాం పెట్టింది ,బల్లిలా నోరాడిస్తూ ,మొహం లో  భావాలకి  చేసే డాన్సు కి సంబంధం
          లేకుండా  ఆ యాంకరమ్మ ఏదో డాన్సు లాంటిది  చేస్తే చూసి ఝడుసుకుని ఏడుస్తోంది .
         రేపు సికింద్రాబాద్  తీస్కెళ్ళి  తాయెత్తు కట్టించాలి ఇదొకటి మళ్లీ ....


10]     ఇన్ని కుర్తీలు దేనికి కొన్నావు'' , నాకోసమే  మీరుచూసే   ప్రోగ్రాం లో మగాళ్ళు
          చీరలు కట్టి  ఎత్తి కట్టి ,మడతబెట్టి  కట్టి, నాకు చీరంటే  అసహ్యమేసేలా చేసేరు ,అందుకే
         నేను  ఈ ప్రోగ్రాం  ఎప్పుడు పూర్తవుతుందో  అప్పటి దాక చీరజోలికి పోను ఇవే వేసుకుంటా ,
         '' ఇదంతాదేనికి  టి  వి  అమ్మేయమని చెప్పొచ్చుగా'' ............... ధన్యోస్మి  ...........
        
     
                                     *********************************

Thursday, July 2, 2015

ఒంటరిగా .. భయంగా .... !!!!!


ట్రైన్ పట్టాలమీద పరుగులు  పెడుతోంది ,భోగి ఏ  సి  ,కావడంతో చప్పుడు అంతగా  లేదు . వంటరిగా  ప్రయాణం
చెయ్యడం  కష్ట మన్పించింది . ప్రతిసారి  పిల్లలూ  ఆయన  కూడా వుంటారు . ఇప్పుడు  కొత్తగా ఏ మిటోగా వుంది .
ప్రొద్దుటే  జన్మభూమి  లో ప్రయాణం . రెండు రోజుల ముందే తను వెళ్తూ  వెంట రమ్మన్నారు . నేనే  ఈరోజు వస్తా
అని చెప్పేను . సాయంత్రం  అన్నవరం లో  నేను దిగే సరికి వైజాగ్  నుంచి  తను అన్నవరం   వచ్చేస్తారు. రేపు
ఉదయమే  దర్శ నం ,వ్రతం ,సాయంత్రం  తిరుగు ప్రయాణం . చిరుజల్లు కాస్తా  పెద్ద దయింది . అదే ఇంట్లో వుంటే
పోర్టికో లో  ఉయ్యాల ఊగుతూ వర్షం ఎంజాయ్  చేస్తాను . బయిటికొస్తే  వర్షం  చికాకే ! ప్రతి చిన్నవిషయాన్ని ఎంతో
ఆస్వాదించే  నాకు ,ఈరోజు  ఎందుకో అంత గా  మనసు బాలేదు . కేవలం  పిల్లలు వెంట  లేకపోవడం వల్ల వచ్చిన
చిరాకనుకుని  పెద్దగా  పట్టించుకోలేదు . కాని ఈరోజు  నేను  చూడ బోయే  ప్రత్యక్ష  నరకానికి , సూచన అని నాకు
అప్పుడు  తెలీదు . సాధారణం గా మూడ్ బాగోక పొతే ,దాని మూల కారణం  వెతికే నేను ,ఒంటరి ప్రయాణం అలవాటు  లేక అయ్యుంటుంది  లే అని సర్దేసాను .

పక్క సీట్  లో దంపతులు  వారి బాబుకు  తల తుడిచి ,కేప్  సాక్స్ వేసారు . కొంచెం నీళ్ళు తాగించారు ,వాడితో
ఆడుతున్నారు . ముద్దు లోలికే  ఆబాబును  చుస్తే మావాడు గుర్తు వచ్చాడు . చిన్నపిల్లలు రాజభోగం  జరిపించు
కుంటారు . కాని  పదేళ్ళు  వయసప్పుడు సేవకుల్లా ,ఇరవై  లోస్నేహితుల్లా,మసలుకోవాలట .తల్లితండ్రు  లి ఇద్దరికీ
ఉద్యోగాలు  కనుక పిల్లల్ని మొదట కేర్  సెంటర్ , తర్వాత ప్లే స్కూల్ ,హాస్టల్ అంటూ ,మన పిల్లల్ని  మనమే దూరం చేసుకుంటున్నాము . వయసైనాక  వాళ్ళు మనల్ని పట్టించు కోవడం లేదు''  ఇంతచేసాము  '' అని తిట్టుకుంటాం .
ఎక్కడో  ఎవరిదగ్గరొ పెరిగిన వారికి తల్లితడ్రుల మీద ప్రేమ ఎలావుంటుంది. కుటుంబ విలువలూ ,నైతిక విలువలూ
ఎలా తెలుస్తాయి .

వర్షం అంతకంతకు పెరుగు తూ  చికాకు పరుస్తోంది . ఇంటి నించి ఫోన్ వస్తే మాట్లాడేను . తెనాలి  వచ్చినట్లుంది ,
బాబు ,వాళ్ళు దిగిపోయారు . నేను బాగ్ లోంచి  లంచ్ తీసి తిన్నాను . ఏదో ఘాబరాగా అన్పిస్తోంది . కొంచెం సేపు
నిద్రపోయాను . కాఫీ కూడా రాలేదు సామర్లకోట దాటింది కాని ట్రైన్ లేట్  అను కుంట , వాతావరణం వల్ల  కూడా
అయ్యుంటుంది  , బయట బాగా చీకటి గా వుంది . మావారు ఫోన్ చేసారు తను  అన్నవరం వచ్చానని ,స్టేషన్ లో
వున్నానని ,సరిగా సిగ్నల్ లేక ఏమి విన్పించడం లేదు . ఆ కాస్త మాట్లాడే లోగా  రెండు సార్లు కట్ అయింది .
ఫోన్ పక్కనుంచి, లంచ్ తిన్న బాక్స్  బాగ్ లో వుంచాను ,టికెట్ చూసుకున్నాను ,అన్ని ఒకసారి చూసుకుని ,
అన్నవరం రాగానే దిగిపోయాను . ఎటుచూసినా ఆ చీకట్లో  ఈయన నాకు ఎక్కడ కనపడలేదు . నాతొ పాటు
దిగిన వాళ్ళు దేవస్తానం  బస్  వచ్చిందంటూ అటు వెళ్ళడం చూసి చీకట్లో ఇక్కడ వుండే కన్నా వారితో వెళ్ళడం
నాయమనిపించి  బస్  ఎక్కేసాను . బస్ ఫ్రీ అట  బస్ బయల్దేరగానే  ఫోన్ కోసం బాగ్ మొత్తం వెతికాను ,ఎక్కడా
లేదు . హ్యాండ్ బాగ్ , బట్టల బాగ్ ఎందులోనూ లేదు . ఒక్కసారి నా గుండాగినంత పనయ్యింది . పెద్దఖరీదై న
ఫోన్ అని కాదు  ఈమధ్య ఫోన్ నంబర్లు  గుర్తు పెట్టు కోవడం మానేసాను  బద్ధకం ఎక్కువై . కాని బుక్ లో
రాసి  హ్యాండ్ బాగ్ లో పెట్టుకునే అలవాటుంది . ఆబుక్  చూసి అక్కడ దిగినాక చెయ్యలి  . అందరూ కొండ పైకి
వెళ్తుంటే నేను మాత్రం  క్రింద దిగేసాను .బస్   కొండంపైకి వెళ్ళే మార్గం దగ్గర వేసున్న కుర్చిలల్లో కూర్చున్నా .
అంతే  కరెంట్ పోయింది . హతవిధీ ఏ మిటీ పరీక్ష అనుకుంటూ కూర్చున్నాను . ఫోన్ లేదు ,కరెంట్ లేదు .
టెన్షన్ లో  ఫోన్ నంబర్ గుర్తు రావట్లేదు ,వర్షం చిమ్మచీకటి . వంటరి తనం ,గుండెల్లో గుబులు .

ఇంటికి ఫోన్ చేస్తే పిల్లలు  కంగారు పడతారేమో , మా అన్నయ్యకు చేస్తే నలభై నిముషాల్లో వస్తాడు ,కాని
నా పరిస్తితి చూసి  మావారిని ఏదోకటి అనేస్తాడు . ఎలామరి బస్సు మరో సారి పైకి వెళ్లి వచ్చింది . కాస్త
నల్లగా వున్నవ్యక్తి  బస్ లోంచి నన్ను పరీక్షగా చూసాడు . నాకు చాల భయం వేసింది . మళ్ళీ బస్ వచ్చింది .
అతను  నావేపు వస్తూ 'కొండమీదకు రారా అ ని అడిగాడు నీకెందుకు నువ్వెళ్ళు అనా లన్పించింది . కాని
నేనున్నపరిస్తి తి లో  ఎవరితో గొడవ పడాలని  లేదు ఫోన్ వుంటే ఇవ్వండి  మావాళ్ళు రావాలి ఒక ఫోన్
చేసుకుంటా  అన్నాను . వెంటనే తీసిచ్చాడు ,బుక్ కోసం చుస్తే లేదు . ఆయన నంబర్ గుర్తురావట్లేదు .
వేరే హ్యాండ్ బాగ్ లో  నంబర్లు వున్న బుక్  వుం డి పో యింది . ఇంటికి చేశా ,పిల్లలు వాళ్ళ డాడి నంబర్
చెప్పారు . చిత్రం అది నాకు బాగా తెలిసిన నంబరే , నోట్లో నానుతుంది ఇంతసేపు  గుర్తు రాలేదు . వెంటనే
ఆయనకు చేశాను . ''నిన్ను పోలిస్ స్టేషన్ దగ్గర వుండమన్నాను కదా  అన్నారు . నాకేమో  స్టేషన్లో మీరు
వుంటాను  అన్నట్లు  వినిపించింది అని చెప్పాను . ఈవర్షం లో అక్కడి వరకు ఎందుకని  అలాచేప్పెను .
అన్నారు . సరే ఇప్పుడు ఎక్కడవున్నావు అన్నారు చెప్పెను ఐదు నిముషాల్లో వచ్చారు . నాకు సెల్
ఫోన్ విలువేంటో  తెలిసొచ్చింది . ఆనల్లని వ్యక్తి'' చాలసేపట్నుంచి ఇక్కడే కూర్చున్నారు . పాపం బాగా
భయ పడ్డారు '' అన్నాడు . అదే బస్ లో కొండమీదికి బయల్దేరాం . రూమ్ తీసుకున్నాం . తను స్నానానికి
వెళ్ళారు . నాకు వొక్కసారిగా  చాల ఎడుపోచ్చేసింది . ఒక నాలుగు గంటలు  ఇంటికి దూరంగా ,ఒంటరిగా
నరకంలో ,ఎంత హింస పడ్డానో  ఆలోచిస్తే చాల భయం వేసింది . అంతే  కాదు  బ్రతకడానికి ఎంత ధైర్యం
కావాలో అర్ధం అయ్యింది .జీవితం అంటే  ఇంట్లో కుర్చుని కదలు రాసుకోడం  కాదని  ఏ టికి  ఎదురీదడం
అని  తెలిసొచ్చింది . పాపం సెల్ పోయిన్దని ఏమీ అనలేదు  కూడా ..........

తను స్నానం చేసొచ్చి  ఎందుకేడుస్తున్నావు  అంటూ సారీరా సరిగా వినపడలేదు  అన్నారు .చాలవుడుకు
మొత్తనం  వచ్చింది ,ఏడ్చే సేను  గడ్డం పట్టి పైకి లేపి  ఇక్కడ పోలీసులు లేరు చూసావా అన్నారు . మాభాష
లో  పోలీసులు అంటే మా పిల్లలు ,అనుమానాస్పదం గా చూస్తూ అక్కడక్కడే  తిరుగుతుంటారని  వాళ్ళకి
ఆపేరు పెట్టేము . నాకు బోల్డంత నవ్వొచ్చింది ,గంపెడంత సిగ్గేసింది .

                    ************************************