Total Pageviews

Thursday, October 15, 2015

శ్రీపురం

తమిళనాడు లోని  వెల్లూరు లోని  '' శ్రీపురం " లో మహాలక్ష్మి అమ్మవారి గోల్డెన్ టెంపుల్ . 





శ్రీపురం  వెళ్ళాలని  ఎప్పటి నించో  అనుకోవడం ,తిరుపతి  మాత్రం వెళ్లి  హడావిడి గా తిరిగి రావడం ,జరుగుతోంది .
ఈసారి అలా  కాకూడదు అనుకుని ముందుగానే పక్కా ప్రణాళికతో  వెళ్ళాము . తిరుమల లో స్వామి దర్శనం చేసుకుని , శ్రీపురం  వెళ్లాము . నక్షత్ర ఆకారం  లో ఉన్న క్యూ లైన్  ద్వారా నడుస్తూ ,మంద్రమైన  మంత్రోచ్చారణ  వింటూ నెమ్మదిగాకదిలే లైనులో వెళ్తూ తెలుగు ,తమిళ్ ,మలయాళీ  భాషల్లో  మైక్ లో దేవాలయం  వారుచేసే సూచనల ప్రకారం  దర్శనం  చేసుకున్నాము . అమ్మవారు పూర్తి గా బంగారం తో చేసిన దేవాలయం  మధ్యలో
ఎత్తైన ప్రదేశం లో కొలువై వున్నారు . దర్శనం  కాగానే , లైనులోనే కుంకుమ వాళ్ళే పెడతారు ,తరువాత ప్రసాదం .
ఇక విశాలమైన  గుడి ప్రాంగణం లో  చక్కగా పెంచిన పూలమొక్కలు , కొలను  ఆహ్లాద భరితమైన వాతావరణం .
చాల బావుంది . ఎప్పటిలాగే కెమెరాలు , బేగ్ లు ,చెప్పులు ,అన్నిటికి లాకర్లే . అందువల్లనే  ఫోటోలు తీసే వీలు
లేకపోయింది ,ఇవన్నీ గూగుల్ లోనివి.  










                                                 ********************************

Thursday, October 8, 2015

మీకు ఎంతమంది ' బాలూ ' లు తెలుసు ? .



నేను పనిలో ఉండి 'కాస్త  ఆ  టైలర్ కి  ఫోన్  చేసి  బట్టలు  తెమ్మని చెప్పండి 'అన్నాను . చాల సేపు వెతికి  ఏమని
ఫీడ్  చేసావు  పేరు,  అనడిగారు , అదా '' బాలు''  అని వుంటుంది  చూడండి ,అన్నాను . అదేమిటి  అతని పేరేదో
వుండాలి గా ?అన్నారు నేను నవ్వేసి  జీవితం లో  అనుకున్నది సాధించ లేక పోయిన  వాళ్ళని  , వైఫల్యం
చెందిన  వాళ్ల ని  నేనలాగే అంటాను ,అందుకే  ఆ పేరుతొ  ఫోన్ లో ఫీడ్ చేశాను ,మీరు 'సాగర సంగమం 'చూడ
లేదా  అని అడిగాను . నిజమండి  చేతిలో మంచి పని ఉంది  , ఒక పెద్ద షాప్ పెట్టుకుంటే  ,పేరు వచ్చేది  కాని ,
అతను  చిన్న షాప్ నడుపుతున్నాడు . మాములుగా  వచ్చే ధర కన్నా సగమే వస్తుంది . అంతెందుకు  నేను
కూడా  బయిటి ధరతో పోలిస్తే సగానికి సగమే ఇస్తాను . ఇతనే కాదు ఇలా చాలా మందే వుంటారు  జీవితం లో
అనుకున్న స్థాయికి  చేరుకోలేక  పో యినవాళ్లు , కొంత మందికి ప్రయత్నలోపం ,మరికొంత మందికి  అలసత్వం
మరికొంత మందికి  అన్నీ  వున్నా 'అదృష్టం కలసి రాక పోవడం ' నిజమండి  అదృష్టం అనేది  ఏదో ఒక మూల
కొంచెమన్నా  లేనిదే చతికిల పడేది  ఖాయం . అచ్చం  సాగర సంగమం  లో''  బాలు '' లాగ [కమలహాసన్ ] .



ఇక నాకెంతో నచ్చిన  '' సాగరసంగమం '' సినిమా విషయానికి వస్తే ,బాలు గురించి మీకంతా తెల్సి పోతుంది .
లేదా  మొత్తం గుర్తు కొచ్చేస్తుంది . బహుశా మీరు కూడా విశ్వనాద్  గారి అభిమానే అయ్యుంటారని నా
అభిప్రాయం . ''బాలసుబ్రమణ్యం '' అందులో కమల్ పేరు . భారతీయ నృత్య  సాంప్రదాయాల న్నీ కలిపి
తానొక  కొత్త విధానం  కనిపెట్టాలని  అతని ఆశయం . అన్ని విధాలైన  నృత్యాలు నేర్చు కుంటాడు ,ఒక
దిగువ మధ్య తరగతి వ్యక్తిగా  అతని ప్రయత్నాలేవీ ఒక కొలిక్కి రావు. మాధవి  గా  జయప్రద పరిచయం,
అవుతుంది . తొలి సీన్ లోనే  పసుపు రంగు చీర లో  మన మతులు పోగొడుతుంది . వారిద్దరి  ప్రయాణం
ఒకే పడవలో అని తెలుసుకుని  బాలూ  కి కొండంత అండ గా  నిలబడుతుంది ,చేయందిస్తుంది .  కానీ ..
తల్లి మరణం తో  తొలిమెట్టు దగ్గరే  కూలబడతాడు .  కోలుకుని  మళ్లీ నిలదొక్కుకునే  ప్రయత్నం లో
మాధవిని  పెళ్లి చేసుకోవాలి  అనుకుంటాడు . ఎంతో  గౌరవంగా  ఆమె తండ్రిని సంప్రదిస్తాడు . అప్పుడు
 తెలుస్తుంది ఆమె వివాహిత అని . మరో ఎదురుదెబ్బ ,  బాలు తనని   ప్రేమించాడు కనుక  అతనితోనే
జీవించాలని వెదుక్కుంటూ వస్తుంది . కాని అక్కడ ఆమె భర్త వుంటాడు . అంతే కాదు  వీళ్లిద్దరిని కలప
డానికి వచ్చానంటాడు . కాని సాంప్రదాయ  కళల నే కాదు ,సాంప్రదాయాన్ని  గౌరవించే వ్యక్తీ బాలూ .
భార్యభార్తలిద్దరిని  కలిపి తనుమాత్రం  వంటరిగా మిగిలిపోతాడు బాలు . రైల్వే  స్టేషన్ లో  వాళ్లిద్దరినీ
కలిపి ఫోటో తీస్కుంటాడు . చంచలమైన మనసుతో ,బాలూ ని ఎంచుకో  బోయిన ఆమెకు నచ్చచెప్పడం
వల్ల , సరైన దారిలో జీవితం మలచడం వల్ల  కావచ్చు ,ఆమె బాలూ కి  రెండు చేతులా  నమస్కరిస్తుంది .
ఎన్ని సార్లు చూసినా  కన్నీళ్లు వస్తాయి నాకా సీన్ చుస్తే .....

తను పైకి వస్తే చూడాలనుకున్న  తల్లి చనిపోయింది ,తనని పైకి తెచ్చి చూడాలనుకున్న నెచ్చెలి వెళ్లి
పోయింది . ఒంటరి తనం , శూన్యం లో వ్యసనానికి బానిసవుతాడు . లక్ష్యానికి  దూరం జరుగుతాడు .
అలాగే ఎన్నో ఏళ్ళు  గడిచి పోతాయి . మాధవి కూతురు  పరిచయం , అప్పటికే  అనారోగ్యానికి గురైన
బాలు  ఆమె మాధవి కూతురని తెలియగానే ,  కనీసం  ఆమె నృత్యం లోనైనా   చిరస్మరణీయం  గా
మిగలాలనే  కోరికతో  ఆమెకు నృత్యం నేర్పిస్తాడు ,తను కోరుకున్న   కీర్తికిరీటాన్ని ధరించకుండానే
విగతజీవుడవుతాడు . చూసిన ప్రతి సారి ఒక కొత్త  సంగతి తెలుస్తుంది ఈ సినిమాలో .

 ''ఫెయిల్యూర్ ''దానికున్నంత బలం  ఇంక దేనికుంటుంది ? మనిషి జీవితాన్నే కాదు ,మానసిక పరిస్తితి
  ని కూడా అతలా కుతలం  చేసేస్తుంది . ఒక వైఫల్యం   తట్టుకోవడానికి ఎంతో  మానసిక బలం నిబ్బరం
కావాలి , మీరు కూడా చూసే వుంటారు , కాళ్ళు చేతులు సరిగా  లేని వాళ్ళు కూడా చక్రాల  కుర్చీ  లో
వెళ్లి మరీ  చిన్న పాన్ షాప్ నడుపుకుంటూ ,ఎవరి మీద ఆధార పడకుండా  గౌరవంగా  బ్రతుకుతుంటారు .
కానీ అన్నీ అవయువాలు సరిగ్గా  వున్న వాళ్ళు కూడా , తొందర  పడి  ఏదోవోకటి  చేసేయకుండా  ఏమి
చేయాలా  అని ఆలోచిస్తూ ... వుంటారు . ఏళ్లు గడిచి పోతాయి  ఈక్రమం లో పెళ్లి జరిగి పోతుంది ,పిల్లలు
 బయల్దేరి  పోతారు , వాళ్ళు ఎదిగి  సంపాదనా పరులవుతారు , ఇకనేం పెద్దగా ఆలోచించ కుండా వాళ్ళ
మీద ఆధారపడి  బ్రతికేస్తుంటారు . అలాంటి వాళ్ళను చుస్తే  వీళ్ళకి ఆత్మాభిమానం  అనే ''వాక్యం ''
ఒకటుందని తెలుసా !అన్పిస్తుంది . బహుశా అన్నిటికి మనసే ముఖ్యం ,మనసెలా  ఆలోచిస్తే ,మనం
అలా ప్రవర్తిస్తాం . కొన్ని నచ్చనివి ,  ఆలోచించడం  మానేస్తాం అందులోని మంచి చెడ్డలు పట్టించుకోం .
ఇలా బానేవుంది కదా!  అని అలవాటు పడతాం , ఒక్కముక్కలో చెప్పాలంటే ''మైండ్ సెట్ '' ఇంతకు
మించి ఆలోచించకు ,ఆలోచించావో కష్టపడవలసి వుంటుంది చూసుకోమరి అంటూ వివేకాన్ని నిద్ర
పుచ్చేస్తాము . హాయిగా రోజులు గడిచిపోతాయి [గడిచి పోయినట్టనిపిస్తాయి ] విలువైన జీవితం
చప్పగా చల్లారి పోతుంది  . ఐతే ఏమిటి ? కష్టపడకుండా , హాయిగా ముగించేసాం కదా అనేది వీళ్ళ వాదన ... ?


                                                  ******************************

Thursday, October 1, 2015

దిబ్బరొట్టి .


 

''దిబ్బరొట్టి ''  అంటే  బహుశా చాలా  మందికి తెలియక పోవచ్చు . కాని మా ఇంట్లో మాత్రం ప్రతి  శనివారం రాత్రి కి ,అదే ఫలహారం వుండేది  . వంట కాగానే  నాన్నమ్మ పప్పు నాన బెట్టే వారు ,అదికూడా  పొట్టుతో వుండే మినపప్పు .ఛాయమినపప్పు  అంటూ పోట్టుతీసిన  పూసల మాదిరిగా వుండే పప్పు మాత్రమే ఇప్పుడు  వస్తోంది  కాని ముదురాకు పచ్చరంగులో  పొట్టు తో వుంటుంది .అదే పప్పుకి పెరుగు ,నునె రాసి కొంచెం ఎండలో పెడితే
పొట్టు చెరగడం వల్ల ఎగిరి పోతుంది అదన్నమాట .  బాగా నానిపోయాక ,నీళ్ళపైన  చేతిని  గుండ్రం గా  తిప్పుతూ
పైకి తేలిన పోట్టును  వేరే గిన్నె లో వేస్తూ చాల ఓపికగా  కడుగుతారు ,అప్పుడు పప్పు తెల్లగా వస్తుంది . దానిని
పెద్దరోటిలో వేసి రుబ్బెవాళ్ళు  చాల మెత్తగా  వెన్నలా వచ్చేవరకూ  రుబ్బడమే,  ఆపని  పిల్లలు చేసేది కాదట .
నీళ్ళు ఎక్కువైతే  దోసెలు పోసుకోవాలట  ,ఐనా అది పిల్లలు రుబ్బే రోలా ఏమిటి ? గుండమ్మ కధ  లో సావిత్రి
ఎన్ టి ఆర్  కలిసి మరీ రుబ్బుతారే  అలావుండేది . తాత గారు  మద్రాస్ నించి తెచ్చారట ,ఎలా తెచ్చారో మరి ?!.
అప్పుడు నానమ్మని  అడగాలని తోచలేదు ,ఇప్పుడు అడగి  నేను మళ్లీ వెనక్కి రాలేనంత దూరం లో వుంది .
 మెత్తని మినప పిండిలో  తెల్లగా మల్లెపువ్వులా  కడిగిన రవ్వ ఉప్పుకలిపి ,కొంతసేపు  మూత పెట్టి ఉంచే వారు .
 [మిక్సి  లో వేసిన పిండి తో చేసిన  మన ఇడ్లీ మొగుడూ పెళ్ళాలు కొట్టు కోవడానికి  పనికొస్తుంది . అబ్బెబ్బే
అలాంటి దేమీ  లేదండి ఊరికే మాటవరుసకి చెప్పాను ,అలాంటిదేమైనా  వుంటే మీకు చెప్పకుండా నా ??. ]

సరే మరి  మన రొట్టె ఎంతవరకు వచ్చిందో చూద్దాం ..ఇప్పుడు కుంపటి వెలిగించే పని ,అలా  కంగారు పడతారేం ?
కుంపటి  అంటే ఏమిటో మీకు తెలీదని నాకూ అన్పించింది ,అందుకే బొమ్మ కూడా వేసాను కాని పాపం మీరు
క్షేమం గా  వుండడం కూడా నాకు ముఖ్యమే కదండీ .. అందుకే గూగులమ్మని  అడిగి  ఈ బొమ్మ తెచ్చాను .
ఆఖరికి  గ్యాస్ పొయ్యి  పుణ్యమా  అని'' కుంపటి  బొమ్మ'' గూగుల్  లో వెతుక్కోవాల్సిన పరిస్తితి . హతవిధీ ..





దీనిలో  బొగ్గులు వేసి ,ఒకబొగ్గు మాత్రం కిరోసిన్ తో తడిపి మిగతా  బొగ్గుల మధ్య వుంచి  వెలిగిస్తారు ,అగ్గిపెట్టేతోనే లెండి , ఆ (.. ఏమిటీ  ఏదో అంటున్నారు ? వామ్మో మీతో నేను వేగలేనండి  బాబూ !బొగ్గులు తెలీదా ,మొక్క జొన్నపొత్తులు  తెలుసు గా  ట్యాంక్ బండ్ ,నేక్లెస్ రోడ్  దగ్గర కాల్చి ఇస్తారుగా..ఆ (. అవేమ బొగ్గులు,నిప్పులుకుడా !
ఇప్పుడు మన కుంపటి  పైన  మూకుడు పెట్టి  నూనె పోసి  వేడెక్కగానే , ఆ పిండి  మొత్తం  ఆ మూకుడు అంచుల
వరకూ  వేసేస్తారు . పైన పల్చని మూతవేసి ఉంచుతారు . నిప్పులకారణం గా  సమం గా  ఉడికి పోతుంది  పైన
వైపు కాలడం కోసం  ఆ మూత పైన కూడా కొన్ని నిప్పులు పరుస్తారు . చక్కగా రెండువైపులా  ఉడికి  ఇల్లంతా
కమ్మటి వాసన వ్యాపిస్తుంది ,రెండు పక్కలా కర కర లాడడం మధ్యలో మెత్తగా వుండడం  దీని ప్రత్యేకత .  దానిని
ఒక పళ్లెం లో కుమ్మరించి  [మార్చి ]  ముక్కలుగా కోసి ,కొబ్బరి చట్ని తోకాని ,మిరప్పండు  చట్ని తో కాని
ఇచ్చేవారు , ఉఫ్  ఉఫ్ అని  ఊదు కుంటూ కారం  ఘాటుకు  కళ్ళల్లో నీరు కారుతున్నా , కళ్ళు ముక్కూ తుడుచు   కుంటూ  లాగించడమే  పని .  ఆహా  అదండీ శనివారానికి  వుండే ప్రత్యేకత , అది కూడా   దిబ్బరొట్టి  వల్ల వచ్చినది .

అన్నట్లు  ఇవాళ శనివారమే  కదూ  మా వారు రాగానే  పిల్లలతో సహా  పోయి ,పిజ్జా  తినేసి రావాలి , వుంటానండీ .


                                             ***************************

Thursday, September 24, 2015

నిమజ్జనం .

వినాయకుని  పండుగకు  వీధి వీధంతా  సందడే , కాలనీలైతే  గాణేషుని  పాటలతో పూజలతో ,మంత్రాలతో  ఎంతో
పవిత్రమైన వాతావ రణం  నెలకొంది . వీలుని బట్టి  మూడు రోజులకు ,లేదా ఐదు రోజులకు  నిమజ్జనాలు జరిగి
పోతున్నాయి . ఆరోజు  వుండే రద్దీ  తట్టుకోవడం  కష్టం కదా ,చాలావరకు  అపార్ట్ మెంట్ లో  ఉంచిన ,వీధుల్లో
ఉంచిన  గణేశు లన్నీ తరలి పోతున్నాయి . నిమజ్జనం  రోజు  టాంక్ బండ్  మీద రద్దీ  ,  ట్రాఫిక్  నిబధనలు
కారణం గా  ఆరోజు వెళ్ళలేక  మూడోరోజు  జరిగే చిన్న చిన్న  గాణేషుల నిమజ్జనం చూడటం  భలే సారదాగా
వుంటుంది . ప్రతి సారీ  నిమజ్జనానికి  ముందు ఏదోఒక రోజు   అలా  ఒకరౌండ్  కొట్టి రావడం అలవాటు కనుక
ఈసారి కూడా  వెళ్ళాము .







ముందుగా  ''ఖైరతాబాద్  గణపతిని '' దర్శించుకుని , అక్కడ నించి నెక్లెస్ రోడ్ ,టాంక్ బండ్ మీదుగా తిరుగుతూ
ఫోటోలు తీసుకుంటూ , గణ పతికి  వీడ్కోలు  చెప్పాము . బూరలు  వుడుకుంటూ  నుదిటికి రిబ్బన్ కట్టుకుని
చిన్నపిల్లలు  నుండి  పెద్దవాళ్ళవరకు  ఎవరికీ తోచిన వాహనాల్లో వాళ్ళు ,  వాళ్ళవాళ్ళ గణపతులు తెచ్చి
నిమజ్జనం చేస్తున్నారు ,ప్రసాదాలు పంచుతున్నారు . ఎక్కువగా ఆడవాళ్ళు వుండడం  ఒకవిశేషం .









అసలు పండుగ విశేషం ,విధానం గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది . కేవలం  చెరువు దగ్గర దొరికే  మట్టి మాత్రం
తెచ్చి  వినాయకుణ్ణి  చేయ్యాలట . అదికూడా  ముందురోజు , విగ్రహం ఆరాలి కదా మరి ! తర్వాతి రోజు పొద్దున్నే
లేచి స్నానాదికాలు  కానిచ్చి ,పత్రికోసం వెళ్ళా లట , ఇరవై ఒక్క రకాల ఆకులు వాటి కాయలు తేవడంతో పాటు
ఆయా చెట్ల  నించి వచ్చే గాలులు , ఔషద గుణాలు ,మన లోపల వుండే చిన్ని చిన్ని రుగ్మతలు నయం చేస్తాయి.
మూడురోజులు  పత్రిపుష్పాలతో  పూజించడం వల్లవాటి  పేర్లు తెలిసే అవకాశం వుంది . ఈపండుగ  పేరు చెప్పి
చిన్న చిన్నమనస్ఫర్దలు ,బందువులతో కాని ఇరుగు పొరుగు వారితో కాని   వుంటే తొలగిపోయి ఐక్యం గా
ఉంటాము  . ఇంతే కాదు  విగ్రహాన్ని, దానితోపాటు ప్రత్తిని  చెరువు లో  నిమజ్జనం  చెయ్యడం వల్ల నీళ్ళలోని
కాలుష్యం కూడా కూడా కరిగిపోతుంది . పూర్వం  చెరువు నీళ్ళేగా అన్నిటికి ఆధారం . ఆవిధంగా ఈపండుగతో
ఎన్నో ఉపయోగాలు పొందేవారు .అలాంటి పండుగ కాస్తా  కాల క్రమేణా  మార్పులు చెందుతూ ,ప్లాస్టర్ ఆఫ్ పారిస్  విగ్రహాలు ,మార్కెట్లోని గడ్డి గా మారింది ,  విగ్రహాలు వాటికి వేసే రంగుల వల్ల కూడా ఊపిరి తిత్తుల
వ్యాధులు ,కిడ్ని సమస్యలు ,నిమజ్జనం వల్ల  విషతుల్యం అవుతున్న చెరువులు ?! . చదువుకున్న వాళ్ళు
ఎక్కువమంది  ఉన్న ప్రస్తుత కాలం కన్నా పాతవాళ్ళకే  పర్యావరణం గురించి ఎక్కువ తెలుసన్నమాట ?!!!!!.


  1.                    *****************************************

Thursday, September 17, 2015

వినాయకచవితి శుభాకాంక్షలు ......

 అందరికి  గణేష్ చతుర్ధి  శుభాకాంక్షలు  .... 



























Thursday, September 10, 2015

చిన్ని చిన్ని ''ఛీ '' టింగులు ....





1. ఉన్నట్టుండి  మనకి మెయిల్ వస్తుంది ,మూడు వందల కి ఫోన్ అని . ఓపెన్ చేసి చూస్తాం . మనసులో ఏమూలో  ఉంటుంది సందేహం ,ఫోనా ,ఫోన్ కవరా  అని ? ఫోన్ మూడు వందలు కానీ డెలివరీ ఛార్జ్ తొమ్మిది
 వేలు ఉంటుంది .  లేదా ఫేక్  [తప్పుడు ] వెబ్ సైట్  అయి ఉంటుంది .లేదా ఆ మెయిల్ ఓపన్ చెయ్యడం
 వల్ల వైరెస్  అన్నా  వచ్చి వుంటుంది .


2. బుధవారం నాడు సస్తా బజార్ అని పెడతారు . మనం పరుగు లు పెడతాం . కిలో చక్కరకి మూడు రూపాయిలు
 తగ్గింపు ,చటాక్  పంచదార  మాయం .దగ్గర దగ్గర 50 గ్రాములు  తక్కువుంటుంది తూకానికి .  దీనికోసంపోయి
బండి దొర్లించుకుంటూ  అక్కర  లేని వన్నికొనుక్కొ స్తాము .   కావాలంటే మీరే చెక్  చేసి చూడండి  . మన లిస్టు  మించి పది  వస్తువులన్నా  ఎక్కువుంటాయి .



3. ఇంతోటి మొహానికి వీసీ  యాబలం పసుపు అని సామెత , వాళ్ళ షాపు పేరు ముద్రించి వున్న కవర్  మనం
        డబ్బులు ఇచ్చి కొనడం? . బాస్మతి అయితే ముక్క వాసన ....!!  మన  పెట్టుబడి  అంతా వృధా ....



4. మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది . వందకి రీఛార్జి చేయండి ,నూటపది రూపాయిలు పొందండి . ముందు వంద వస్తుంది   తరువాత పది రూపాయిలు మెల్లగా వస్తుంది  అని . నా బొంద వస్తుంది . ఆ పది కోసం పది సార్లు కాల్ చేసి ఇరవై     రూపాయిలు వదల కోట్టుకునేవారు ఉన్నారు .



5. ఎవరో ఫోన్ చేసి నాకు క్లబ్ లో మెంబెర్షిప్ కార్డు ఫ్రీ అని , మరెవరో చేసి స్థలం అతి తక్కువలో ఎలాట్ అయిందని మిగతా డబ్బులు తెచ్చేసి  రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు . నాకు వొళ్ళు మండి , నా బ్రదర్  ఫలాన  ఛానల్ లో పని చేస్తున్నాడని , తనతో మాట్లాడి ఇద్దరం కలిసి వస్తామని చెప్పాను  . అంతే చుప్ .మళ్లీ ఫోన్  రాలా ...


6.  ఒక పూజారి మీకు ఇ ప్పుడు కష్టకాలం నడుస్తుంది , మీరు ఒక పని చేయండి , గుడిలో ఒక యజ్ఞం చేస్తాను  పలానా కర్రల తో పందిరి వేస్తారు . నాలుగు పక్కల నలుగురు కూర్చొని దిక్కులకి పూజ చేస్తాము . మన శని వదిలివెళ్లి పోతుందిఅంటాడు . సరే ఎంతయ్యా  ఖర్చు అంటే పాతిక వేలు మాత్రమే అంటాడు . అసలే గడ్డుకాలం అంటే  అంత డబ్బు ఎలా  తెస్తారు? . దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు .


7. పలానా టకటకా బ్యాంకు నించి  మాట్లాడుతున్నాం  అంటూ మధ్యాన్నం  పూట ఫోన్ చేసి మీ డబ్బు మా బ్యాంకు లో నే దాచాలి వడ్డీ  ఎక్కువ  అంటూ విసిగిస్తారు . కొన్ని  సార్లు చూసి మీ బ్యాంకు లో నే ఉంది మా ఎకౌంటు అని చెప్పి వదిలించుకున్నా...............[ఏదో మతలబు లేనిదే ఫోన్ చేసి మరీ అడుక్కుంటారంటారా ]


8. కూరగాయల ధరలు పేపరు లో ఒక ధరలు వేస్తారు , రైతు బజార్ లో ఒక ధర ఉంటుంది .ఎవరిని  అడగాలి ?


9. అమ్మ సెంటిమెంట్ తో మనల్ని సబ్సిడీ సిలిండర్ వదులు కోమంటారు , సెలబ్రిటీస్  కి కూడా సబ్సిడీ సిలిండర్          సప్లై చేస్తారు . పాపం వాళ్ళు   మనకన్నా బీదవాళ్ళు కదా  మరి ...........


10. సిగిరెట్ నిషేధించారని  ఆరు బయట కాలిస్తే  జరిమానా అన్నారు ,ఎవరు వేస్తున్నారు ? ఎవరికీ వేస్తున్నారు .
   జరిమానా ? యధా ప్రకారం  స్వేచ్చగా ఊదుతూ  వెళ్తున్నారు .

11.  ఒక షాంపూ  ప్రకటన లో  ఎనిమిది  వారాలు  నాకివ్వు ,ఎనిమిది  సెంటిమీటర్లు జుట్టు నీకిస్తా  అంటారు .
   నాకు తెలిసి  బ్రతికున్న వాళ్ళ కెవరికన్నా ,ఏమి వాడినా వాడకున్నా ,ఎనిమిది సెంటిమీటర్లు  జుత్తు
   పెరుగుతుంది . వాళ్ళిచ్చేదేమిటో ...........

12.   మరొక  తలనూనె  ప్రకటనలో నూనె  రాసుకున్నాక  చేతులు శుభ్ర పరచుకోండి లేకపోతే  చేతులకు
     జుట్టు వచ్చే   ప్రమాద ముంది అనివేస్తారు  నాకు నవ్వాలో ఏడవాలో  అర్ధం కాదు .

13. మరొక  షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు వత్తు గా పెరుగుతుందట ,మహావుంటే షాంపూ మన తల మీద
     రెండు నిముషాలు వుంటుంది . అంతదానికే ఎలా పెరుగుతుందబ్బా ??????????????

14. ఇక అందరికీ తెలిసిన దే  పిల్లలున్నా కాలేజ్ఏజ్  లా  కనపడే సబ్బు  , రాస్తే పెళ్లి కుదిరి పోయే క్రీము,
      ఆ ట్యూబ్ లో వచ్చే క్రీమ్ రాసుకుంటే  తెల్లగా  మారిపోవడం ,నాఫ్రెండ్ చెప్తుంది  ఒక లారి ట్యూబ్స్ వాడి                      వుంటాను ఏ మార్పు లేదు అని ??!!!!!

    ఇవన్నీ మచ్చుకి  కొన్ని మాత్రమే , ఇంకా  మన దృష్టికి  రాని వెన్నో , వచ్చినా ''' రాయలేనివెన్నో ...''.


                          **********************************


Thursday, September 3, 2015

పేరంటం





పేరంటం  లో  పాటించవలసినవి  కొన్ని పద్దతులు ఉంటాయని  నేను  అనుకుంటున్నాను . పూజలు ,వ్రతాలూ
లాంటివి  నాకుచాలా ఇష్టం . చక్కగా ఆచరిస్తుంటాను . ఆ అనుభవం తో కొన్ని విషయాలు  ప్రస్తావించవచ్చు
అనుకుంటున్నాను . ముఖ్యం గా ఇలాంటివి వ్రతాలు చేస్తున్నపుడు ముందురోజే అందరిని   పిలుచు కోవడం మంచిది . అంతేకాదు ఇంటి పనులు కూడా ముందురోజు ముగించి  , విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం .
పూజ  ముగిసిన తర్వాత ,మధ్యానమే వచ్చిన  వారికి  ఇవ్వ వలసిన తాంబూలం [పసుపు బొట్టు ]సిద్దం
చేసుకోవాలి   అంతే కాని వచ్చిన వాళ్ళని  కూర్చో బెట్టి ,ఆ గదిలో  తమల పాకులు  ఈ గదిలో వక్కపొడి ,
పసుపు కుంకుమ  పేకేట్స్ ,అంటూ తిరుగుతూ  వచ్చిన వాళ్ళ సమయం వృధా  చేయడం సరికాదు ,ముందే
అన్నీ సిద్దం చేసి పెట్టుకోవాలి . అన్నీ సిద్దం గా వుంటే  చక చకా  అందించేయొచ్చు . పేరంటం అనేది కేవలం
వాయనాలు ఇచ్చి పుచ్చు కోవడాని కే తప్ప , వేరేఅనవసర  విషయాలు చెప్పుకునే సందర్భం కాదని గుర్తించాలి .
వాళ్ళూ  కొంతమంది ని  పిలుచుకొని వుంటారు . త్వరగా వెళ్ళవలసి వుంటుంది . లేదా మనం  కొందరిని పిలిచిన
విషయం మర్చి పోయి , వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి  అక్కడే కబుర్లాడుతూ  కూచోడం సరికాదు . ఇంటికి వచ్చిన వాళ్ళు , ఎంతసేపు ఎదురు చూస్తుంటారు ?  ''నేను వేరే వాళ్ళ ఇంట్లో వున్నానండి టైం పడుతుంది  మా అమ్మాయి ఇస్తుంది ,
లేదా పనమ్మాయి  ఇస్తుంది , అని సెల్ పోన్ లో చెప్పడం మర్యాద కాదు . అంతగా తరగని కబుర్లు వుంటే తీరికగా
మరోసారి వెళ్ళాలి . కొంత మంది సమయం చెప్పరు , ఉదయమా , సాయంత్రమా , అన్నది వివరంగా  చెప్పాలి .


పిలవాడనికని  ఒకరింటికి వెళ్తే ,వాచిన కళ్ళతో లేచివచ్చింది . ఏమైంది  అంటే  వ్రతం చేసుకోవడానికి  భర్త
బంగారం కొనివ్వలేదట . చేసేదే  వాళ్లక్షేమం కోసం . కొనివ్వకుండా ఉంటారా ! భార్య నగలేసుకుని  పక్కన
నించుంటే వాళ్ళకే గా  గౌరవం ? అలాంటప్పుడు ఏమాత్రం వీలు కుదిరినా  కొనిస్తారు . దానికోసం ఏడ్వాల్సిన
పనిలేదు .   సంతోషం గా భర్త ఆరోగ్యం , సౌభాగ్యం  కోసం చేసే పూజ ఇది . ఎవరిని పీడించకుండా ,ఉన్న దాంట్లో తృప్తిగాచేసుకుంటే చాలు . చెయ్యకపోయినా ఫర్వాలేదు కాని ,శ్రావణ శుక్రవారం  మంచానికి అడ్డం పడి
 ఏడవకుండావుంటే చాలు , మగవాళ్లకి అదే పదివేలు .




కావలసిన  వాటికంటే ఐదు  ఆరు  వాయనాలు  ఎక్కువే తాయారు చేసుకోవాలి . పిలవకున్నా పక్కవారి తో
వచ్చే వాళ్ళుంటారు . కాదనకుండా  సంతోషం గా  ఇచ్చే అలవాటు చేసుకోవాలి . ఇవన్నీ ఎవరికీ తెలియనివి
 కాదు కాని ,  మరోసారి  మాట్లాడుకోవడం  లో తప్పు లేదుగా ! పైగా కొత్తగా చేసే వారికి ఉపయోగం .పూర్వం
 నోము నోచుకుని  వాయనాలు ఒక బుట్టలో సర్దుకుని  సాయంత్ర ఇంటికి వెళ్లి మరీ ఇచ్చి వచ్చే వారట,  అదీ
వారి శాఖ లోనే  అయ్యి వుండాలి ,నోము తీర్చుకున్న వాళ్ళు అయి వుండాలి . అంటే పెళ్ళైన కొత్తలోనే
నోము పట్టి ఐదు సంత్సరాలు ఏ ఆటంకము లేకుండా తీర్చుకున్న వాళ్లకు ఇవ్వాలట అలాంటి వారికోసం
వెదికి  మరీ ఇచ్చి వచ్చే వారు . ఇప్పుడు ప్రేమ వివాహాల పుణ్యమా అని  లోకమంతా వసుధైక కుటుంబం
అయింది . ఇక  నోములకి , వాయనాలకి  ఓపిక  తీరిక ఎవరికీ  లేదు . గట్టిగా అడిగితె ఆరోజుల్లో  స్త్రీలకి
ఇదే కాలక్షేపం  కనుక '' కమ్యునికేషన్ ''కోసం  చేసేవారు అంటున్నారు . ఇప్పటి వారికి ఆ అవసరం లేదట ?!

                                        *****************************