Total Pageviews

Saturday, March 10, 2018

వేసవికి స్వాగతం




ఇప్పుడిప్పుడే  వేడిమి పెరుగుతోంది , మొన్ననే గా  శివరాత్రికి  శివశివా అంటూ చలి పరుగెత్తి పోయింది .
అప్పుడే మావి చిగురు  ముదురు రంగులో కోయిల గొంతు శృతి చేసేందుకు వేసవికి ఆహ్వానం పలుకుతోంది .
ఆకు రాల్చిన వేప చెట్లు  చిగురిస్తున్నాయి ,అక్కడక్కడా కొన్ని చెట్లకు  పూతకూడా మొదలై నట్లుంది ,అందుకే
మధురమైన వాసన ,ఎవరైనా ఊహిస్తామా  తియ్యని వాసన వేసే వేపపువ్వు చేదుగా ఉంటుందని .... కొంత
మంది మనుషుల్లాగే , చక్కని చిరునవ్వుతో పరిచయమౌతారు  నచ్చక పొతే   విషం చిందిస్తారు . సహాయం
చేస్తున్నట్లు నటిస్తూ ,చేయందిస్తూ తియ్యని నవ్వులు చిందిస్తూ గోతిలోకి తోస్తారు . మనుషుల నైజం
భగవంతుని సృష్టి   కాదు ,స్వయం కృతాపరాధం .



 హేవిళంబి  నామ సంవత్సరం  వీడ్కోలు తీసుకుని ,విళంబినామ సంవత్సరం రాబోతోంది . తెలుగు వారి
పండుగ ''ఉగాది ''. తైలాభ్యంగ స్నానం , నూతన పంచాంగ శ్రవణం ,నింబకుసుమ భక్షణం ,ఇష్ట దైవ దర్శనం
పండితుల ఆశీస్సులు పొందడం ,పంచాంగంలో రాసిన ప్రకారం  చేస్తారుగా !


చల్లని గాలి  చెవి పక్కాగా వెళ్తూ  కొంత జుట్టు  మొహాన వేసి పోయింది ,అది సర్దుకుందామని  తలపైకెత్తాను
పైన దుండిగల్  ట్రైనీ ప్లైట్ ఝుమ్మంటూ దూసుకుపోయింది . రోజూ నాకలవాటే  వేసవి సాయంత్రాలు మేడపైన
గడుపుతుంటాను . విమానాలు  లెక్కపెడుతూ ఆనందిస్తుంటాను .




అన్నట్లు ఐస్ వాటర్ కోసం ఫ్రిజ్  లో  బాటిల్స్ నింపి పెట్టాలి . ఈసారన్నా  ఒక పక్కాగా ఇసుక పోసి ఇమ్లి కుండ
పెట్టుకుంటే బావుండును . చల్లదనం ఎక్కువ తక్కువ లేకుండా తియ్యని నీరు త్రాగచ్చు . అసలు రాత్రి పూట
మంచం దగ్గర ఫ్రిజ్ లోని మంచినీళ్ల బాటిల్ కన్నా  మట్టి కూజా తో నీళ్లు పెట్టుకుంటే ఎంత బావుంటుంది .
మట్టి మూతతో సహా కూజా కొనుక్కురావాలి . అలాగే ''తివోలి ''వైపు వెళ్తే వెదురుబుట్టలు కొనాలి .
మామిడి పండ్లు పెట్టుకోవాలికదా ! మల్లెపూలు  తెచ్చే అతను  ఈసారి వస్తాడో రాడో , బార్లీ గింజలు ,
సబ్జా గింజలు  తీసుకు రావాలి ,పోయిన సారి  టీవీ ల పుణ్యమాని  ఫలుడా చేస్తే ఎంత బాగా వచ్చిందని ,
ఈసారికూడా చెయ్యాలి .

ఊరెళ్తే పచ్చి జీడీ పప్పు తో  రొయ్యల కూర ,కోడి కూర చేసి పెడతారు హబ్బా .. ఎంతబావుంటుందని ..
వేసవిలో  వచ్చే వర్షం ఎంతబావుంటుందని .. మట్టివాసన గుమ్మెత్తి పోతుంది ,గుండెలనిండా తడిసిన
మట్టివాసన ఎంత పీల్చినా తనివితీరదు . ఒక పక్క ఎండ ఉండగానే  జల్లులు పడి హరివిల్లు వస్తే
ఆ  ఆనందమే వేరు ......

(నాకు ఎప్పుడూ  వర్షాకాలం ,శీతాకాలం  మాత్రమే  నచ్చుతాయి  వేసవిని కూడా ఆస్వాదించాలని
'తప్పదని ' తెలిసికొని  వేసవికి  ఆహ్వానం పలుకుతున్నాను )

***************************************************************************

No comments:

Post a Comment