Total Pageviews

Sunday, December 18, 2016

''సవితి పోరు ''



ఉదయం  లేవగానే ఈయన  కోసం చూసా , పక్క ఖాళీగా వుంది . ఎప్పుడు లేచేసారో మరి ,నిద్ర లేవగానే వుండే
ప్రశాంతత పోయింది , ఈ మానవుడు  అచ్చిక  బుచ్చిక  లాడుట మానివేసి  ఎచటకు బోయినాడు  అని చూసితి
మానవా నువు మారవా ! రూమ్ లోనించి  బయటకు రాగానే  అనుకున్నదే జరిగింది . ''దాన్ని '' ఒడిలో కూచో
బెట్టుకుని తెగ సముదాయిస్తున్నారు , నేనెంత  మహా పతివ్రతనో  కదా  ఎంత సహనం తో వున్నాను ,నాలాగా
ఎంతమంది  తరుణీ మణులు  ఇలా సహనం తో  భరిస్తున్నారో  ఈ ''సవతి ని '' .  వారందరికీ  మనస్సులోనే
వందనాలు  అర్పించుకుని ,నా  పనిలో  పడ్డాను  కాఫి కూడా'' దాని'' తోనే  ముచ్చట్లు  పెట్టుకుని తాగారు .
ఆఫీస్  లో  ఉండవలసిన  ''దాన్ని '' ఇంటివరకు  తెచ్చి  నాకింత మనోవ్యధ  కలుగ చేస్తున్నారని  కడిగి
పారేయాలనుకున్నాను ,కానీ నోరు రాలేదు . ఒక సిగరెట్  అలవాటు లేదు , ఒక మందు అలవాటు లేదు ,
వక్కపొడి  కూడా వేసుకోని  వాడిని  ఏమని తిడతాం ? ప్చ్ ఇలాంటివి ఎవరికి  చెప్పుకుంటాం  చెప్పు కుంటే
ఇంటి పరువు  పోదూ ! ఎప్పుడూ''  దాన్నే '' వళ్ళో పెట్టుకు కూచోవడమే  మౌనంగా భరించ వలసిందే ,ఏమిటో  పెళ్ళైన కొత్తలో  నేను కూచునే చోటది.   తర్వాతనాపిల్లలది , ఇదిగోఇప్పుడిది   కార్ లో  నేను కూచోవలసిన చోట  అది , నేను .. నేను కూచో వలసిన .. చోట . అవమానం దిగ మింగుకొని ,'' దాన్ని ''  కార్ లో  అయ్యగారి పక్కన నేను   కూచో పెట్టాను . రాణి గారిలా ఆయనగారి పక్కన కూచొని ,నా  కళ్ళముందే  ఊరేగుతూ
వెళ్ళిందది .  రాత్రి వచ్చాక  అదే  తీరు , బట్టలు  మార్చు కుని స్నానం చేసే వరకే  కుర్చీ లో ఉంటుంది .
మళ్ళీ  రాగానే వడిలోకి  ఎక్కి కూచుంటుంది . తినగానే మళ్లీ ... ఇక నాకు స్థానమేలేదా ... !?.



ఈరోజు ఎలాగన్నా''  దీన్ని'' చంపేయాలి ,భరిస్తుంటే నెత్తికి ఎక్కుతోంది , ఇక లాభం లేదు  ఆయన  నన్ను
ఎమన్నా సరే .. '' దాన్ని ''  చంపేస్తాను . ఒకనిర్ణయానికి  వచ్చాను . రేపు ఆదివారమేగా  వదిలేసి రావచ్చుగా
వెంట బెట్టుకొచ్చారు . ఇక నా వల్లకాదు ,ఏది ఏమైనా  రేపు ఆదివారం గనుక తను  ఆలస్యంగా లేస్తారు .
ఆ సమయం లో నేనే ముందుగా లేచి '' దీని''  పీక పిసికేస్తాను . దానితో  ''దీని '' పీడ  వదిలి పోతుంది .

ఒక నిర్ణయానికి  రాగానే  మనసు తేలిక పడింది . రేపంతా నాదే , వాడు నా వాడే  అనుకుంటూ  పాడుకుని
నిద్ర పోయా , నేనొకటి తలిస్తే దైవమొకటి  తలచాడు ,నాకు మెలకువ వచ్చే సరికి  ఆలస్యమైంది . తనే
ముందు లేచారు . యధా ప్రకారం  వడిలో ''అదే ''. అయినా  సరే నా నిర్ణయం లో  మార్పు లేదు .
ఈరోజు  కమ్మగా వండి పెడతాను .  భోంచేస్తే నిద్దరొచ్చేయాలి  ఆలా వండేస్తాను . మధ్యాహ్నం ఆయన
నిద్దరోగానే  దీన్ని చంపేస్తాను . అనుకున్నట్లే  ఆయన భోంచేసి  పడుకున్నారు ,ఆసమయం  కోసమే
చూస్తున్న నేను  ''దాని '' దగ్గరకు  వెళ్ళేను , ఆ సమయంలో  తెలుగు సీరియల్ లో  లావాటి లేడీ  విలన్ లా వున్నాను  కళ్ళలో ఎరుపు మోహంలో రంగులు  బ్యాక్ గ్రౌండ్లో  మ్యూజిక్ ..  కొంచెముంటే  అన్నంత  పని చేసి ఉందును . కానీ  ఒక్క సెకను  ఒకే ఒక్క సెకను  ఆలోచించేను .. పోన్లే పాపం''  దీని '' వల్లనే గా  మనకి
కూసింత  గుర్తింపు  నలుగురు స్నేహితులు ,కలిగేరు  మనల్ని కూడా గుర్తించి కామెంట్లు పెడుతున్నారు .
దీన్ని నాశనం చేస్తే మనకేమి వస్తుంది . మెల్లగా  ఆయనలో మార్పు తెస్తాను .. మార్పు తెచ్చుకుంటాను ..
అని  డిసైడయ్యాను . వెంటనే నాచేతుల్లో వున్నా  '' లాప్ టాప్ '' పక్కన పెట్టేసి  ఆయన కోసం లోపలి
నడిచేను .

                        భరించే  భార్యలందరికి  అంకితం  .   

******************************************************        

4 comments:

  1. పోరు నష్టం - పొందు లాభం - కదా! :)

    ReplyDelete
    Replies
    1. లలిత గారూ ! అంతే కదండి మరీ

      Delete
  2. వామ్మో .. ఇంతేనా ..! నేనింకా .. ఆఫీస్ ఫైల్స్ కట్ట అనుకొన్నాను ... బాగా వ్రాసారు. అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ , ఫణింద్రగారు

      Delete