Total Pageviews

Thursday, December 3, 2015

విశాఖతీరం






                                     

గోదావరి  తో ఉన్న అనుబంధం కన్నా మించిన బంధం  సముద్రం తో వుంది . పుట్టింది పెరిగింది అంతా సముద్రతీరం
అందుకే పెద్దగా  ఆలోచించ కుండానే  'సాగరతీరం ' అని బ్లాగ్ పేరుపెట్టు కున్నాను . చిన్నతనంలో అత్తయ్య వాళ్ళు
వచ్చేవారు . సంక్రాంతికి ,వేసవి సెలవులకి  అప్పుడు తప్పనిసరిగా  బీచ్ కి  వెళ్ళేవాళ్ళం . చాలసరదాగా గడిచేది .
నాపెళ్ళి కాగానే  మేము ఆగస్ట్  పదిహేను రోజు  వైజాగ్ లో కాపురం పెట్టాము . పాపం ఆరోజే ఈయనకి స్వతంత్రం
పోయింది ?????!!!!!!!!!!!! , నాకు అదేరోజు  స్వతంత్రం  వచ్చిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను .





                                           

నెలలో  మొదటి ఆదివారం '' రిచ్చి'' గా 'దసపల్లా 'లో భోంచేసే వాళ్ళం {గోల్డెన్ వీక్ }.  అక్కడినించి  రిషికొండ వెళ్లి
 బీచ్ ఒడ్డున  గడిపి   సాయంత్రమెప్పుడో  వచ్చేవాళ్ళం.  రెండో ఆదివారం  జగదాంబ దియేటర్ లో సినిమా చూసి మళ్ళీ బీచ్ {సిల్వర్ వీక్ ] .మూడో ఆదివారం {కాపర్ వీక్ } ఎవరన్నా స్నేహితుల ఇంటికి [కేవలం సాయంత్రాలు]  నాలుగో ఆదివారం {జర్మన్ సిల్వర్ వీక్  } డబ్బులైపోయేవి ?????!!!!!!.''  కేవలం '' బీచ్ కి '' మాత్రమె వెళ్లి  మామిడికాయ ముక్కలు , ఐస్ ప్రూట్ , అలావుండేది . ఇలా లాభం లేదు అని  నేను ఫైనాన్సు మినిస్టర్ అవతారంఎత్తాను . మేమిద్దరం  ఆదర్శాలు  వంకాయలు  అంటూ  పెద్దవాళ్ళ [ఆర్దిక ] సాయం లేకుండా
జీవితం మొదలుపెట్టాము , సంసారం పెద్దదయ్యాక తెలిసింది'' ఆదర్శాలు  వంకాయలని '' ఏమిచేస్తాం
ఒకసారి మాట అనుకున్నాక  కట్టుబడి వున్నాము . ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి
వేసేది మా  గుర్రం , ఇప్పుడు పంచకల్యాణి  అనుకోండి .. కాని  ఎంతైనా  ఎవ్వరి సాయం లేకుండా పైకి
వస్తే ఆ ఆనందమెవేరు .. నేను సింహం లాంటిదాన్ని ,అది జడవేసుకోదు ,నేనువేసుకుంటాను ,అంతే తేడా !
మిగతాదంతా  సే మ్  టూ  సే మ్  ....



                                       



                                           
 ఇదంతా ఒక ఎత్తు అయితే  ప్రతి పౌర్ణమికి  తప్పనిసరిగా బీచ్ కి  వెళ్ళేవాళ్ళం . ఎంత బావుంటుందో తెలుసా !చూడటానికి రెండుకళ్ళు  సరిపోవు . ఒకపక్క సూర్యుడు అస్తమించగానే నీలి రంగు సముద్రం లోనించి చంద్రుడు
పైకి లేస్తాడు  నారింజ రంగు బంతిలా.......   నిముష నిముషానికి  పైకి లేస్తున్న చంద్రుడిని చుస్తే  అలా చూస్తూనే
ఉండిపోవాలనిపిస్తుంది .నీలిరంగు  కెరటాలు  తీరాన్ని డీ కొట్టి  తెల్లని నురగలు గా  విడిపోతూ ,ప్రశాంత మైన వాతావరణం  లో లయబద్దమైన హోరు ..  అదొక అద్భుతం  అంతే  వర్ణించడానికి మాటలే రావు . ఎంత రాత్రి ఐనా ఇంటికి వెళ్ళాలనిఅనిపించనే అనిపించదు . ఇప్పటికీ  వైజాగ్ ప్రయాణం అంటే  దగ్గరలో పౌర్ణమికి  ఉండేలా  ప్లాన్ చేస్తాను .


ఇప్పుడైతే'' హుసేన్ '' సాగర్ ''తీరం '' చేరాము కాని ,అప్పుడు ఆరోజులే వేరు అన్పిస్తుంది , ఒకసారి హైదరాబాద్
వచ్చాము  అత్తయ్య ఇంటికి , నాంపల్లి ఎగ్జిబిషన్ చూడటం ,నడవలేక రైల్ ఎక్కడం  కతలు కతలుగా చెప్పుకునే
వాళ్ళం  స్నేహితులకి ,ఆ టైం లోనే  ''హుసేన్ సాగర్ ''లో పడిపోయిన బుద్దుడిని  వెతికి పట్టుకుని  సాగర్ మధ్యలో
నిలబెట్టారు ,చిన్న చిన్న మెరుగులు కోసం తలచుట్టూ వేదికలా కట్టి  పైవరకు వెళ్లి పనివాళ్ళు పనిచేసే వారు అపుడు
అత్తయ్య అక్కడ సివిల్ ఇంజనీర్ గా  వుండేది పై వరకూ అంటే బుద్దుడి తలవరకూ ఎక్కి పనుల పర్యవేక్షణ చేసేది .
మేము కూడా బోటు లో వెళ్లి, పై వరకు వెళ్లి చూసాం భలే వుంది  , సిటీ మొత్తం కనబడుతుంది . కాని దిగే టప్పుడు
మాత్రం బాగా భయమేసింది , అసలే అరవై అడుగుల ఎత్తు,  ఎక్కేటప్పుడు తెలియలేదు దిగే టప్పుడు మాత్రం అరుస్తూ ,భయంతో ఎంత గోల చేసామో  చెప్పలేను . ఒకోసారలా...   ట్యాంక్ బండ్  వేపు వెళ్ళినప్పుడు నవ్వొస్తుంది .


  *******************************************************************

2 comments: