Total Pageviews

Thursday, November 26, 2015

గోదావరితీరం .





అందాల అడవిలో  అన్నీ విశేషాలే , అక్కడవుండేది  కేవలం అటవీశాఖ  ఉద్యోగులు ,గిరిజనులే ,ఇప్పుడు అక్కడకూడా  చాలమార్పులు జరిగాయనుకోండి  అదివేరేవిషయం . మేమున్నప్పుడు మాత్రం  చాల  చాల 
సరదా గా  గడిపేవాళ్ళం . అందరం కార్తీకవనభోజనాలకి వెళ్లి ఎంత సరదాగా  గడిపేవాళ్ళ మో గతంలో రాసాను. కొన్ని సార్లు ఆడవాళ్ళు మాత్రం పిల్లల్ని తీసుకు బయల్దేరేవాళ్ళు ,అందులో కూడా చాల ఉత్సాహ
వంతులు  వున్నారు ,కాస్త బద్దకించి ,లేదా తెలియనిచోటు ఎందుకులే  అనుకుని ఊరుకునే వాళ్ళని ,
ఉత్సాహపరిచి పిల్లలతో సహా  ప్రయాణం కట్టించేవారు . మగవాళ్ళు కూడా వద్దనకుండా , ఎవరో ఒకరిని తోడిచ్చి పంపేవారు . రంప చోడవరం లో'' రంపలో  '''శివుని ఆలయం వుంది,అక్కడికి  ఒకసారి ,పాములేరు  బ్రిడ్జ్ మరోసారి ఆచుట్టుపక్కల  మరికొన్ని మంచి ప్రదేసాలువున్నాయి  అవీ  , ఒకసారి                                        




సీలేరు పవేర్ ప్రాజెక్ట్ చూసి వస్తే ,మరోసారి భద్రాచలం (లాంచిలో ) వెళ్ళేవాళ్ళం . ఒక్కరోజులో  వెళ్లి రావచ్చు .
సినిమాలో లాగా రోజుల తరబడి వెళ్లి రానక్కరలేదు . ఇంకోసారి మారేడుమిల్లి  వెళ్తే (ఎన్నిసార్లు వెళ్ళామో లెక్కే
లేదు ) ఒకసారి దేవీపట్నం  వెళ్ళే వాళ్ళం ,కాని నాకు మాత్రం  మారేడుమిల్లి లో ట్రావెల్స్ బంగ్లా ,దేవీపట్నం లో
గుడి  చాల నచ్చేసాయి . గోదారి వడ్డున చాల పెద్ద చెట్టు వుంటుంది ,ఎడమ పక్క పోలిస్ స్టేషన్  వుంటే, కుడి
పక్క గుడి వుంటుంది ,మెట్లు అన్నీ పరుగులు పెడుతూ ఎక్కుతుంటే మెట్లకిరువైపులా  పొగడపూలు చెట్లు
విరగపూసిన పూలతో స్వాగతం పలికేవి ,రాలిన పూలన్నీ ఏరుకుంటూ  వెళ్ళేవాళ్ళం . పైన పెద్ద ఆంజనేయ
స్వామి విగ్రహం వుండేది . అది అందాలరాముడు  సినిమా షూటింగ్ కోసం పెట్టారని ,ఈగుడినే భద్రాచలం లా
చూపించారని చెప్తారు . దర్శనం  తర్వాత దిగివచ్చేవాళ్ళం ,అప్పుడు  కేరేజ్ విప్పి అందరం  టిఫిన్లుతినేవాళ్ళం
ఆవ పెట్టిన పులిహోర , గడ్డపెరుగు .అరటికాయ బజ్జీలో  చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వుంచి నిమ్మకాయ పిండి
ఇచ్చేవారు . అందరం ఆచేట్టుచుట్టు ఉన్న గట్టు మీదకుర్చుని లాగించేవాళ్ళం . మెల్లిగా కిందకి జారుతున్నట్లుగా ఉన్న గోదారి లోకిదిగేవాళ్ళం ,కాళ్ళు కడుక్కుంటు న్నట్లుచేస్తూ, సగానికిపైనేతడిసే వాళ్ళం ,ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ,ఆ చెట్టుమీరు చాల సినిమాల్లో చూసేవుంటారు .

ఈమధ్య వెళ్ళినపుడు  మా కజిన్  ,అక్కడి పోలవరం ప్రాజెక్ట్ వస్తే చూడలేక పోవచ్చు ,ఇప్పుడే  చూద్దాంఅని
తను  తీసుకువెళ్ళింది . భార్యాభర్తలు  ఇద్దరూ  అక్కడ మంచి ఉద్యోగాలలో వున్నారు. అందరం కలిసివెళ్ళడం
 ఒక ఆనందం ఐతే  వెళ్ళాక ,గండిపోచమ్మ గుడిలోదర్శనం చేసుకుని ,కిందికి గోదావరి దగ్గరకి వెళ్ళాము . వెళ్ళాక మనసాగక స్నానాలు చేసేసాము అన్నయ్య వాళ్ళు ఎంతచెప్పినా వినలేదు ,సమయం ఎలాగడిచిందో తెలియలేదు . చీకటి పడుతోందని  అప్పుడుబయటికి వచ్చాము . బట్టలవి తెచ్చుకోలేదు కాబట్టి ,కారుల్లోసీట్స్ మీద  వున్న టర్కీ టవేల్స్ తెచ్చి ఇచ్చారు . పిల్లలు కూడా మాతో పాటే  ఎంత అల్లరి చేసారో ......

గోదావరి తో ఉన్న  అనుబంధం ఎంతో గొప్పది . ఆ గలగలలు వినని చెవులేందుకు  ,ఆ అలలలో తడవని తనువెందుకు ,గోదావరిఅందాన్ని ఆస్వాదించని  మనసెందుకు , గోదావరి చూడని మనమెందుకు అనిపించక
మానదు . (కొంచెం ఎక్కువైందా ? అయినా ఫర్లేదు  గోదావరి గురించి కనుక ఆ మాత్రం వుండాలి ).

పుట్టింది పెరిగింది అంతా  ''సాగరతీరం '' కనుక సముద్రం అంటే  నాకు మరీ ఇష్టం . పెళ్లికాగానే వెళ్లి వున్నది
 వైజాగ్ కనుక  వైజాగ్ తో ,అక్కడి సముద్రంతో మరింత అనుబంధం వుంది .

''కార్తీకమాస వనభోజనాలు '' ఈ లింక్ ద్వారా చదవండి ..

                              http://anjalitanuja.blogspot.in/2014/11/blog-post.html                           




            ****************************************************************









2 comments:

  1. బాగున్నాయి మీ గోదావరి జ్ఞాపకాలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి .

    ReplyDelete