Total Pageviews

Thursday, October 29, 2015

అట్లతద్ది .








అట్లతద్ది అనగానే అమ్మాయిలంతా  జడగంటలు పెట్టి అల్లుకున్నజడా,  లంగాఓణి  వేసుకుని ,కాళ్ళకి పట్టీలు
జడలో కనకాంబరం పూలు .. స్నేహితురాళ్ళతో  కలిసి కిల కిలలు , వేకువఝామునే  ఉయ్యాలలు .... 
ఇవన్నీ సినిమాలలోనే అనుకుంటున్నారా ! ఐతే పప్పు లో కాలేసినట్టే ! మీరు నమ్ముతారో  నమ్మరో
నిజంగా కూడా మా చిన్న తనం లో ప్రతి అట్లతద్ది ఇలాగే  జరిగింది .




తెల్లవారుఝామున  లేచి స్నానాధికాలు  కానిచ్చి , గోంగూర పచ్చడి, గడ్డపెరుగు ,వేసుకుని అన్నం తినేసేవాళ్ళం . 
చుక్క చూసి  హమ్మయ్య తినేసరికి  వెలుగు వచ్చెయ్య లేదునయం ,అనుకుంటూ అంతా కలిసి రాత్రికి రాత్రే పోరు 
పెట్టి మరీ  మామిడి చెట్టుకు కట్టించిన  ఉయ్యాల ఊగుతూ ,తద్దిపాటలన్నీ పాడుకునే వాళ్ళం . వెలుగు రాగానే 
లేచిన  పెద్దవాళ్ళు కనకాంబరాలు  కోయండి ,గోరింటాకు కోసుకు రండి అంటూ పనులుపురమయించేవారు .
ఎందుకో అప్పుడు తెయలేదు కాని ఇప్పుడన్పిస్తుంది ఆకలినుంచి దృష్టి మరల్చడానికని . పూలు ఎవరివి వాళ్ళే
మాల కట్టుకునే వాళ్ళం ,గోరింటాకు రుబ్బి వరుసలో అందరిని కూర్చో పెట్టి పెట్టేవాళ్ళు ఎవరిచేతులు బాగా పండితే
వాళ్లకి ''మంచి ''మొగుడు వస్తాడని చెప్పేవాళ్ళు . సాయంత్రం అయ్యేకొద్ది  ఎప్పుడు చీకటి పడుతుందా !ఎప్పుడు
చందమామ వస్తాడా అన్పించేది . అంతలోపటే మావాళ్ళకు అర్ధం అయ్యేది ''బాటరీ డౌన్ అవుతోందని ''బీప్ బీప్ ''
మంటూ మొహాలు వేళ్ళాడే సేవాళ్ళం ,దాంతో ముందుగా  గౌరీదేవి కి పూజ చేసుకు రమ్మని వాగు దగ్గరకి పంపించేవాళ్లు ,పసుపు గౌరమ్మ,  పూలు పళ్ళు తీసుకు వెళ్లి  ఏటి ఒడ్డున పూజ చేసుకుని వచ్చేవాళ్ళం ఆసరికి
చీకటి పడేది ,తొమ్మిది అట్లు అమ్మవారికి ,తొమ్మిది వాయనం ఇవ్వడానికి ,తొమ్మిది తినడానికి ,వేసి ఇచ్చేవాళ్ళు .
ఇంట్లోకూడా పూజ ముగించి ,చంద్రుడు ఎప్పుడు వస్తాడా (ఎప్పుడు తిందామా )అని ఎదురు చూసే వాళ్ళము .
చంద్రుణ్ణి చూడకుండా తినకూడదట పూర్వం ఇలాగే ఉపవాసం ఉన్న బాలిక సొమ్మసిల్లి పొతే  అన్నలిద్దరూ గడ్డి
వెలిగించి ఆ మంటనే చంద్రుడు గా ఆ బాలికకు చూపించి  తినిపించేసారట ,ఫలితంగా ముసలివాడు భర్తగా వచ్చాడట,ఆ కధ చెప్పి భయపెట్టేవాళ్ళు . ఐతే ఒకసారి బాగా మబ్బులుపట్టి  విపరీతమైన వర్షం ,వర్షం వెలిసినా
మబ్బులు తేలిపోలేదు ,చందమామ రాలేదు . పూజ ఇంట్లోనే చేసుకుని కూర్చున్నాము ,ఆరైంది ,ఏడైంది ,ఏడీ
చందమామ రాడే !ఫర్వాలేదు తినేయొచ్చు అంటారు ,నేను, నా స్నేహితురాలు మాత్రం పట్టుదలగా కూర్చున్నాం .
ఎనమిది కావస్తుండగా  మాఅన్నయ్య ,వాళ్ళన్నయ్య  కలిసి శుభవార్త తెచ్చారు చందమామ వచ్చాడని , సంతోషంగా  వెళ్లి మబ్బులలోంచి అప్పుడే మెల్లిగా మాకోసమే వస్తోన్న చందమామని చూసి నమస్కారం చేసుకుని అప్పుడు కూర్చున్నాం తినడానికి ,తొమ్మిది అట్లు మీరే తినాలి అంటే తినలేమంటూ గారాలు పోయేవాళ్ళం ప్రతి ఏడు.   తొమ్మిదిఅట్లు  కానిచ్చేసి ,మరో తొమ్మిది సీతాఫలాలు హాంఫట్ చేసేసి ,మరోనాలుగు కమలాలు మాయం
చేసేసాం ,అందరూ ఒకటే నవ్వడం ,ఏమైతేనేం మంచి భర్త, భర్త తో పాటు  మాస్నేహం కూడా అలాగే వుంది ఏళ్ళ
తరబడి ,నాస్నేహితురాలు కూడా ఇక్కడే వుంది .మా పదకొండేళ్ళ వయసులో  మా పెద్దవాళ్ళ ఉద్యోగ రీత్యా అడవిలో మొదలైన స్నేహం.  వాళ్ళ నాన్నగారురేంజర్ (తన శ్రీవారు ఇక్కడ డి  ఎస్  పి గా వున్నారు )అదే నవ్వు
అదేమాటతీరు ,మనసువిప్పి మాట్లాడే పద్దతి, తనను చుస్తే  వాళ్ళ  అమ్మగారు గుర్తుకొస్తారు , వాళ్ళింట్లో బెల్లం
ఆవకాయతో  భోజనం చేసిన రోజులు గుర్తుకొస్తాయి . మా నాన్నగారికి  కూరలు ప్రత్యేకంగా పంపేవారు ,ఎందుకండీ అంటే మీకోసం కాదు ,అన్నయ్యగారికోసం  అనేవారు అభిమానం గా ........

''అట్లతద్ది '' నోము నాతోనే ఆగిపోయింది  , పాపతో నోముపట్టించాలన్న  నాకోరిక తీరలేదు . సెలవు'లేని' రోజున
నోము ఎలాచేయిస్తావు ,ఒక్కతీ ఎలావుంటుంది ,మరుసటి రోజు నీరసంతో  బండెడు  నోట్స్ ఎలారాస్తుంది అంటూ
నా కోరికకు అడ్డు కట్ట వేసారు . కాని  పండుగ జ్ఞాపకాలతో  గతం లోకి పరుగులు తీసే  నామనసునేవరాపగలరు ?

(అక్కడున్నప్పుడు ,నగరజీవితం గురించి మాట్లాడు కొనేవాళ్ళం . ఇక్కడికి వచ్చాక ఆ రోజులు  తలచుకుంటాం .
నాకన్పిస్తుంది .. గతంలోనూ , భవిష్యత్లోనూ  కాకుండా  ప్రస్తుతాన్ని ప్రేమిస్తే .. అని, నేనిప్పుడదే చేస్తున్నా !!



                                  *************************************

No comments:

Post a Comment