Total Pageviews

Thursday, October 1, 2015

దిబ్బరొట్టి .


 

''దిబ్బరొట్టి ''  అంటే  బహుశా చాలా  మందికి తెలియక పోవచ్చు . కాని మా ఇంట్లో మాత్రం ప్రతి  శనివారం రాత్రి కి ,అదే ఫలహారం వుండేది  . వంట కాగానే  నాన్నమ్మ పప్పు నాన బెట్టే వారు ,అదికూడా  పొట్టుతో వుండే మినపప్పు .ఛాయమినపప్పు  అంటూ పోట్టుతీసిన  పూసల మాదిరిగా వుండే పప్పు మాత్రమే ఇప్పుడు  వస్తోంది  కాని ముదురాకు పచ్చరంగులో  పొట్టు తో వుంటుంది .అదే పప్పుకి పెరుగు ,నునె రాసి కొంచెం ఎండలో పెడితే
పొట్టు చెరగడం వల్ల ఎగిరి పోతుంది అదన్నమాట .  బాగా నానిపోయాక ,నీళ్ళపైన  చేతిని  గుండ్రం గా  తిప్పుతూ
పైకి తేలిన పోట్టును  వేరే గిన్నె లో వేస్తూ చాల ఓపికగా  కడుగుతారు ,అప్పుడు పప్పు తెల్లగా వస్తుంది . దానిని
పెద్దరోటిలో వేసి రుబ్బెవాళ్ళు  చాల మెత్తగా  వెన్నలా వచ్చేవరకూ  రుబ్బడమే,  ఆపని  పిల్లలు చేసేది కాదట .
నీళ్ళు ఎక్కువైతే  దోసెలు పోసుకోవాలట  ,ఐనా అది పిల్లలు రుబ్బే రోలా ఏమిటి ? గుండమ్మ కధ  లో సావిత్రి
ఎన్ టి ఆర్  కలిసి మరీ రుబ్బుతారే  అలావుండేది . తాత గారు  మద్రాస్ నించి తెచ్చారట ,ఎలా తెచ్చారో మరి ?!.
అప్పుడు నానమ్మని  అడగాలని తోచలేదు ,ఇప్పుడు అడగి  నేను మళ్లీ వెనక్కి రాలేనంత దూరం లో వుంది .
 మెత్తని మినప పిండిలో  తెల్లగా మల్లెపువ్వులా  కడిగిన రవ్వ ఉప్పుకలిపి ,కొంతసేపు  మూత పెట్టి ఉంచే వారు .
 [మిక్సి  లో వేసిన పిండి తో చేసిన  మన ఇడ్లీ మొగుడూ పెళ్ళాలు కొట్టు కోవడానికి  పనికొస్తుంది . అబ్బెబ్బే
అలాంటి దేమీ  లేదండి ఊరికే మాటవరుసకి చెప్పాను ,అలాంటిదేమైనా  వుంటే మీకు చెప్పకుండా నా ??. ]

సరే మరి  మన రొట్టె ఎంతవరకు వచ్చిందో చూద్దాం ..ఇప్పుడు కుంపటి వెలిగించే పని ,అలా  కంగారు పడతారేం ?
కుంపటి  అంటే ఏమిటో మీకు తెలీదని నాకూ అన్పించింది ,అందుకే బొమ్మ కూడా వేసాను కాని పాపం మీరు
క్షేమం గా  వుండడం కూడా నాకు ముఖ్యమే కదండీ .. అందుకే గూగులమ్మని  అడిగి  ఈ బొమ్మ తెచ్చాను .
ఆఖరికి  గ్యాస్ పొయ్యి  పుణ్యమా  అని'' కుంపటి  బొమ్మ'' గూగుల్  లో వెతుక్కోవాల్సిన పరిస్తితి . హతవిధీ ..





దీనిలో  బొగ్గులు వేసి ,ఒకబొగ్గు మాత్రం కిరోసిన్ తో తడిపి మిగతా  బొగ్గుల మధ్య వుంచి  వెలిగిస్తారు ,అగ్గిపెట్టేతోనే లెండి , ఆ (.. ఏమిటీ  ఏదో అంటున్నారు ? వామ్మో మీతో నేను వేగలేనండి  బాబూ !బొగ్గులు తెలీదా ,మొక్క జొన్నపొత్తులు  తెలుసు గా  ట్యాంక్ బండ్ ,నేక్లెస్ రోడ్  దగ్గర కాల్చి ఇస్తారుగా..ఆ (. అవేమ బొగ్గులు,నిప్పులుకుడా !
ఇప్పుడు మన కుంపటి  పైన  మూకుడు పెట్టి  నూనె పోసి  వేడెక్కగానే , ఆ పిండి  మొత్తం  ఆ మూకుడు అంచుల
వరకూ  వేసేస్తారు . పైన పల్చని మూతవేసి ఉంచుతారు . నిప్పులకారణం గా  సమం గా  ఉడికి పోతుంది  పైన
వైపు కాలడం కోసం  ఆ మూత పైన కూడా కొన్ని నిప్పులు పరుస్తారు . చక్కగా రెండువైపులా  ఉడికి  ఇల్లంతా
కమ్మటి వాసన వ్యాపిస్తుంది ,రెండు పక్కలా కర కర లాడడం మధ్యలో మెత్తగా వుండడం  దీని ప్రత్యేకత .  దానిని
ఒక పళ్లెం లో కుమ్మరించి  [మార్చి ]  ముక్కలుగా కోసి ,కొబ్బరి చట్ని తోకాని ,మిరప్పండు  చట్ని తో కాని
ఇచ్చేవారు , ఉఫ్  ఉఫ్ అని  ఊదు కుంటూ కారం  ఘాటుకు  కళ్ళల్లో నీరు కారుతున్నా , కళ్ళు ముక్కూ తుడుచు   కుంటూ  లాగించడమే  పని .  ఆహా  అదండీ శనివారానికి  వుండే ప్రత్యేకత , అది కూడా   దిబ్బరొట్టి  వల్ల వచ్చినది .

అన్నట్లు  ఇవాళ శనివారమే  కదూ  మా వారు రాగానే  పిల్లలతో సహా  పోయి ,పిజ్జా  తినేసి రావాలి , వుంటానండీ .


                                             ***************************

No comments:

Post a Comment