Total Pageviews
Sunday, January 15, 2017
Sunday, January 8, 2017
సంక్రాంతి సందళ్ళు .
పండుగంటేనే సందడి ,అందులోనూ ఇది పెద్ద పండుగ అనిపిలవబడే సంక్రాంతి ,ఇకచెప్పాలా సందడే సందడి .
అందుకే మా ఇంటి సందళ్ళు కొన్ని మీతో పంచుకోవాలను కుంటున్నాను . పండుగ పనులు వరుసలో మొదలయ్యేవి ,ముందుగా మొదలు పెట్టేది ఇంటికి సున్నం కొట్టించడం , ఇదేంటి వైట్ వాష్ అనాలి లేదా
పెయింట్ అనాలి అనుకుంటున్నారా ! బెడ్ రూమ్ కి ఒకరంగు బాత్రూం కి ఒకరంగు అప్పుడు లేవండి ..
ఇప్పటిలా పి ఓ పి వర్క్ చేయించుకుని మళ్లీ పదేళ్లవరకు రంగుల మాటే ఎత్తని పద్దతి కాదు . ప్రతి ఏడూ
వేయించుదామన్నా పి ఓ పి గీకేసరికే ఇంట్లోని సామాన్లు మనుషులు రంగు మారి పోతారు . అందుకే పెళ్లిళ్లకు తప్ప పెయింట్ మాటే ఎత్తము .కాని అప్పుడు మాత్రం ప్రతి సంక్రాంతి కి ''సున్నంకొట్టాల్సిందే ''.
తెల్లవారుఝామునే మనిషిని పంపి సున్నం రాళ్లు అంటే నత్తగుల్లలు అని తెల్లని షెల్స్ ప్రత్యెక పద్దతిలో బట్టీ లో
కాల్చి ఇస్తారట అవి కొని తెప్పించేవారు . నాలుగు కట్టెల పోయ్యలు పెరటిలో వెలిగించి ,పెద్ద గంగాళాల తో నీళ్ళు మరిగించేవారు ,మేడ మెట్ల కింద వున్న సిమెంట్ తో చేసిన నీళ్ళ తొట్టెలో సున్నంరాళ్ళు వేసి ,వేడి నీళ్ళు పోసి
ఉంచేవారు ,అవి కుత కుతా మని వుడుకుతూ ఉండేవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండేవారు చల్లగా అయినాక
మెత్తని పేస్టు లా అయ్యేది అప్పుడు ,అందులో నీలిమందు తుమ్మజిగురు కలిపి .. ఇవన్ని ఎందుకంటే నీలిమందు
తెల్లదనం కోసం ,తుమ్మజిగురు గోడకి కూర్చుంటే సున్నం మనకే అంటుకుపోకుండా ఉండడానికి అన్నమాట . మనుషులనిమాట్లాడి ,పెద్ద కట్టేకి చీపురు కట్టి దానితో గోడలకు సున్నం కొట్టించేవారు . హమ్మయ్య చెప్పేసాను .
తరువాత పిండివంటలు ,నానమ్మా అత్తయ్య కలిసి ,కట్టెల పొయ్య వెలిగించడం ,నానబెట్టిన బియ్యం కడిగి పిండి
కొట్టించేవారు ఆ తడిపొడి పిండితోనే అరిసెలు చెయ్యాలట . పే .. ద్ద గిన్నెపెట్టి దానిలో బెల్లం వేసి పాకం పట్టేవారు
ఒకచిన్ని గిన్నెలో నీళ్ళు తీసుకుని ఆ పాకం అందులో వేసి ఉండ అయిందో లేదో చూసేవారు ,అదే అరిసెలపాకం
అన్నమాట , అప్పుడు తడి పొడి పిండి వేస్తూ కలిపేవారు దానిపేరే చలిమిడి ,దీనితోనే అరిసెలుగా వత్తి నూనె లో
వేయిస్తారు . మిగతా చలిమిడిలో వేయించిన కొబ్బరి ముక్కలు వేసి వుండగా చేసి వేయిస్తే అవి ''పోకుండలు'' ,
ఇప్పుడు ఈ పెరేక్కడా వినపడడం లేదు నేనుకూడా మర్చిపోయేదాన్ని కాని మా చిన్నన్న ''పడిపోకుండా
కూర్చోకుండా '' పోకుండ '' అనేవాడు అందుకే గుర్తుంది . ఇంకా చలిమిడి మిగిలేది దానిని మధ్యలో ఎత్తుగా
చివరలు పలుచగా వుండేవి నూనె మొత్తం తగ్గించేసి అందులో వేయించేవారు దానిపేరేమి టో తెలుసా ''పొంగడం ''
నిజమండి దాని పేరే పొంగడం .ఇంటికి వచ్చే వాళ్ళకి పెట్టడం ,చుట్టుపక్కల వాళ్ళకి పంపించడం , పనివాళ్ళకి
పెట్టడం ,నాన్నమ్మ చేతికి ఎముక లేదు . ఆబ్బె .. అలాగంటే ఆవిడ మనసు మంచిదని ఉదారమైనదని అర్ధం .
అసలు ఆ చలిమిడినే ఆడపిల్లను అత్తారింటికి పంపేటప్పుడు పెడతారు ,అదికూడా వేడిది కాదు నిద్ర చేసినది
అది చలువ అని ఒక నమ్మకం . ఆ చలిమిడి పసుపు కుంకుమలు , స్వీట్లు అందరికీ అక్కడ పంచుకుంటారు ,
కొత్త కోడలు కాపురానికి వచ్చిందని అర్ధం . ఇక వీధంతా ముగ్గులేసేవాళ్ళు.. ఎంత బావుండేవో .. ఒనాల్రోజులు
వుంచచ్చు కదా అబ్బే మళ్లీ మరుసటి రోజు వేరే ముగ్గు , ఇలా పండుగంటే ఇదే అనిపించేది . భోగి రోజు పొద్దున్నే
నలుగు పెట్టుకుని తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని , భోగి పిడకలు దండ తీస్కెళ్ళి భోగి మంటలో వెయ్యడం
ఒక గొప్ప అనుభూతి .భోగి ,సంక్రాంతి ,కనుమ మూడు రోజులకు మూడు జతలు ,అన్నట్లు కనుమ రోజు న
కొత్త బట్టలు కట్టుకుంటే కలకాలం కొత్తవే వేసుకుంటామని ఒక నమ్మకం . (ఎంత అందమైన నమ్మకం ? ).
కోళ్ల పందాలు గోదావరి జిల్లాల్లో ఎంత ఫేమస్ మీకు తెలిసిందే , తెలియంది ఏమిటంటే వాటికి బాదాం ,కాజు
పెట్టి పెంచు తారేమో వాటితో చేసిన కూర రుచే వేరు , చాలా ముఖ్యమైన వారికి మాత్రమే అది కానుకగా
పంపిస్తారు . ఎడ్ల బండ్ల పందాలు కూడా చాల బావుంటాయి (ట ) చాల ఎక్కువగా జరుగుతాయి .
మేము సంక్రాంతికే బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం . ముందు ఇంట్లో వున్నచెక్కలు ఐదు మెట్ల మాదిరిగా చక్కగా
అమర్చేవారు ,వాటిమీద తెల్లని దుప్పటి పరచి , ఏ ఏటికాఏడు కొత్తగా కొన్న బొమ్మలను కలిపి పెద్ద పెట్టెలోని
బొమ్మలను దించి , అన్నిటిని వరుసక్రమం లో అమర్చేవాళ్ళం , ఏటికుప్పాక , కొండపల్లి బొమ్మలు ,కొన్ని
దేవతల మట్టి ప్రతిమలు కలిపి సర్దే వాళ్లము . పెళ్ళికూతురు , పల్లకి , రైతులు ఇలా చాల బొమ్మలు ఉండేవి .
నాలుగురోజుల ముందే ఒక ట్రే లాంటిదానిలో మట్టినింపి నానబెట్టిన గింజలు వేసి మొలకెత్తించే వారు మా నాన్న . వాటిమధ్యలో కావిడితో వున్న రైతు , చిన్న గుడిసెలు , ఎడ్ల బండి ,పల్లెటూరు లాగా చేసేవాళ్ళు . సాయంత్రం
పేరంటం చేసి బొమ్మలకొలువుకు హారతిచ్చి ఎంతో పెద్దదాని లాగా ఫీలైపోయేదాన్ని . పండుగ అవగానే మళ్లీ
బొమ్మలు పెట్లోకి , పిల్లలం బళ్లోకి ... ... ... ...
********************************************************************************
Thursday, December 29, 2016
అందమైన చలిమంట .
డిసెంబరు నెల చివరికి వచ్చేసాం ,అందరి మనసుల్లో భోగి మంటలు మెదులుతూ ఉన్నాయేమో పండుగ ఎన్ని రోజులుందని చూస్తున్నారా ! నాకైతే భోగిమంట కాదుగాని చలిమంట అదేనండి నెగడు గుర్తొస్తోందిఆవిషయాలన్నీ
మీతో పంచుకోవాలని వుంది . !. ఇంతకు ముందే చెప్పాను ,మా నాన్నది అటవీశాఖ లో ఉద్యోగం అని ,అక్కడ చలి చాలా బావుంటుంది ,చలి బాగోడమేమిటి అని ఆశ్చర్య పోకండి చలికాలం అక్కడ గడిపే రోజులు బాగుంటాయని నా మాటలకుఅర్ధం .
చలికాలం అందంగా ఉండడం ఏమిటో ఇప్పుడు చెప్పనా ! ఆకాశాన్నంటుతూ పచ్చని చెట్లూ , జరీపువ్వులు
కుట్టిన నీలం చీర లాగా ఆకాశం ,దానిమీద వెండి కంచం బోర్లించినట్లుండే చందమామ ,చీకట్లో మిణుగురు
పురుగుల వెలుగు , ఎంతోదూరం లేని ఏటి నించి గలగలలు ... కుంకుడు ,షీకాయ, కరక్కాయ చెట్ల మీదుగా
వచ్చే చేదు వాసన గుండెల నిండా పీల్చుకుంటే వుంటుందీ .. హబ్బా ఆ ఆనందమే వేరు .
రాత్రయ్యే సరికి అందరంభోజనాలు ముగించి ,ఇంటివెనుక వేసే పెద్ద చలిమంట దగ్గర చేరేవాళ్ళం . చలి అక్కడ
చాల ఎక్కువ ఉండేది . అందరూ శాలువాలు ,మఫ్లర్ ,స్వేట్టర్లు వేసుకుని చలిమంట చుట్టూ కూర్చునే వాళ్ళం .
మంచి కాలక్షేపం ,బోలెడన్ని విషయాలు అక్కడ చెప్పుకునే వాళ్ళం . దొంగలు ,దెయ్యాలు, చేతబడులు అవి
అప్పుడక్కడ అంతమందిలో భయం వేయదుగాని ఒక్కరు వున్నపుడు గుర్తు వస్తే భయమేసేది . ఒకరితో
ఒకరు మాట్లాడుతున్నప్పుడు చలికి నోటివెంట ఆవిర్లు వచ్చేవి ,అదిబాగా తమాషాగా ఉండేది . కొంతమంది
నిద్ర వచ్చి వెళ్లి పడుకున్నా ,నిద్ర రాని వాళ్ళు కబుర్లు కొనసాగుతూనే ఉండేవి . అక్కడ నిప్పుల మీద కెటిల్
తో వేడినీళ్లు మరుగుతూనే ఉండేవి ,వీలుని బట్టి కాఫి పొడి కానీ ,టీ పొడికాని వేసి ఉంచేవారు ,చాలా తక్కువ
పంచదారతో , అదే బ్లాక్ కాఫీ అంత చలిలో అలా వేడిగా పోసుకు తాగడం అదో ఆనందం . కాఫి గింజలు ,
మిరియాలు ,పచ్చి పసుపు కొమ్ములు (మెత్తగా అల్లం లాగ ఉంటాయి )కుంకుమ రాళ్లు , తేనె ఎవరో ఒకరు ఇచ్చేవారు .వాటిని ఉపయోగించాము అనే కన్నా వృధా పుచ్చాము అంటే బావుంటుందేమో !.
అదేమిటో చలికాలం లోనే చల్లని పళ్ళు వస్థాయి , చెక్ పోస్ట్ దగ్గర లారీ చెక్ అయ్యేలోగా ఎవరో ఒకరు ఒక
బుట్టతో కమల ఫలాలో ,బుట్టెడు సీతాఫలాలో తెచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్లే వాళ్ళు ,వాళ్ళ పేరు చెప్పడం కానీ
వివరాలు చెప్పడం కానీ చేసే వారు కాదు , మా పెద్దన్నయ్యకి అంత శ్రద్ద లేదు కానీ నేను మా చిన్నన్నయ్య
పళ్ళబుట్ట మధ్యలో పెట్టుకుని కూర్చునే వాళ్ళం ,బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ అవే లాగించే వాళ్ళం ,నేను అంత
కాదు కానీ అన్నయ మాత్రం ,ఎలా తినేవాడంటే నల్లనయ్య కాస్తా సీజన్లో కలర్ వచ్చేసే వాడు . పైగా అనే వాడు
''ఈ గింజలొకటి అడ్డు ,అవి లేకపోతే ఇంకా తినచ్చు '' తన సరస సంభాణ గురించి గతంలో కూడా రాసాను .
ఒకేలాంటి చీర జాకెట్ వేసుకుంటే ,''కళ్ళు తిరిగేస్తున్నాయి చీరన్నా మార్చు జాకెట్టన్నా మార్చు ''అంటాడు .
పిట్టలున్న చీర కట్టుకుంటే తేరిపారా చూసి తలాడించి '' బావుంది . ఈచీర రోజూ ఉతకాలా ''అక్కర్లా డ్రై వాష్
అన్నాను గొప్పగా .. ''ఓ మారేలా పిట్టలు ఖరాబు చేస్తేనో ..'' అని అడిగాడు . ఇంక నేను ఒకటే నవ్వు , అలా
ఉంటుంది తన సంభాషణ . అన్నట్లు అన్నదమ్ము లిద్దరూ ఒకసారి వేటకెళ్ళేరు ,రాయొచ్చో లేదో నాకు
తెలీదు కానీ ,ఏది రాయకూడదంటే ఎలాగండీ చాలా పోస్టులు అలాగే ఉండి పోయాయి . ఇది మాత్రం
చెప్పే తీరతాను .
అసలేమైందంటే .. వీళ్లిద్దరికీ టీనేజ్ లోనే పెద్దవాళ్ళతో స్నేహాలుండేవి ,ఐతే అలాంటి వాళ్లలో ఒక ముదురు
వుండే వాడు పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి ,వాడు పిట్టల దొర లాగా కధలు చెప్పేవాడు ,నాకు వేట తెలుసు
ఇక్కడికి ఎవరు వచ్చినా ,నేను దగ్గరుండి వేటకు తీసికెళ్తాను ,ఆలా వేటకు వెళ్ళినపుడు వాళ్ళిలా ,వీళ్ళలా
అంటూ వీళ్లని ఆకట్టు కున్నాడు . అప్పట్లో అక్కడ షూటింగ్ లు జరుగుతుండేవి , మావాళ్లకి డైరెక్టర్స్
పరిచయముంది . వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూసేవారు . ఆలా ఆ ముదురు కబుర్లు నిజమనుకున్నారువీళ్లు .
అవకాశం దొరికింది ,మా నాన్న గారు ఊర్లో లేనప్పుడు ముదురుతో కల్సి వేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు .
నాన్నది లాంగ్ కోట్ ,పది బ్యాటరీస్ పట్టే పెద్ద టార్చ్ లైటు ,లాంగ్ షూస్ అంతా పగడ్బందీగా బయల్దేరి
వెళ్లారు . వాడు చెప్పిన ప్రకారం ఒకరి వెనుక ఒకరు నడవడం ,మాట్లాడు కోకుండా నిశ్శబ్దం గా వెళ్లడం ,
అన్ని బానేవున్నాయి , వెళ్లి మాటు వేసుకుని కూర్చున్నారు . అనుకున్న ప్రకారం గన్ పేల్చే వాడు
ముందు కూర్చున్నాడు . (మా పెద్దన్నయ్య గన్ వాడి చేతికి ఇవ్వడానికి ఇష్ట పడలేదు క్రెడిట్ తనకే
దక్కాలని డిసైడయ్యాడు ) వెనుక ఆ ముదురు ,ఆ వెనుక మా చిన్నన్నయ్య , నిశ్శబ్దం ,చీకటి, జంతువుల
అరుపులు లోపల నూట నాలుగు .. అయినా గన్ ఉందని బోడి ధైర్యం ,ఇంతలో దగ్గరలో అలికిడి
వాళ్ళు అనుకున్న ప్రకారం ముదురు టార్చ్ వేసి వెంటనే ఆపేస్తాడు ,వెంటనే అన్నయ్య గన్ పేల్చాలి .
టార్చ్ వేసాడు ,పది అడుగుల దూరం లో ఎదో జంతువు కళ్ళు మెరుస్తూ కనపడ్డాయి ,వెంటనే టార్చ్
ఆపేసాడు ..మనవాడు అత్యుత్సాహం తో కరెక్ట్ టైమింగ్ లో ఢమాల్ ని గన్ పేల్చాడు ,వీళ్ళ టైమింగ్
వీల్లకున్నట్లే దాని టైమింగ్ దానికుందిప్రమాదాన్ని పసిగట్టిన ఆ జంతువు పారిపోవడానికి అప్పటికే
వెనుదిరిగింది . అది అటు తిరగ్గానేబులెట్ వెళ్లి వెనుక తొడలో దిగబడింది . ఇంక చుడండి దాని అరుపులతో
అడవి దద్దరిల్లింది .ఉన్నచోటే గుండ్రాలు తిరుగుతూ మట్టి తొలిచేస్తూ ఘీంకారాలు చేస్తూ నానాహడావిడి చేసింది
దాని అరుపులకి ఆ గోలకి వీళ్లు అది పులి అని భ్రమ పడ్డారు ,అంతే వీళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి ఏమి
జరిగినా నిశ్శబ్దం గా ఉండాలన్న నిర్ణయాన్ని గాలికొదిలేసారు ,దాని కన్నా పెద్దగా అరుస్తూ ,తీసి కెళ్లిన వన్నీ
అక్కడే పడేసి , ఎగురుతూ దుంకుతూ ,పడుతూ లేస్తూ పలాయనం చిత్తగించారు . కానీ ఒకటి మాత్రం మెచ్చు
కోవాలి ,అంత భయం లోను ముగ్గురూ ఒక వైపే పరుగెడుతూ విడిపోకుండా వూళ్ళో కొచ్చి పడ్డారు . నేనో
తింగరి దాన్ని , నేను చెప్పినట్టు పెంచు కోవడానికి బ్రతికి వున్న చెవుల పిల్లిని (కుందేలు) ''పట్టు' కొస్తారని
అమ్మకి వేట మాంసం ''కొట్టు ''కొస్తారని ఎదురు చూస్తున్నాను . ఎలాగో ఇంట్లో కొచ్చి పడ్డారు . ఇద్దరికీ
జ్వరాలు ''ఆతర్వాతవి '' కూడా ... ఇద్దరికీ ఒక్కసారే ఎందుకు జ్వరం వచ్చిందో తెలియక మా అమ్మేమో
కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు ,దిష్టి తీసింది . అదో దండగ మళ్ళీ నాకు తెలిసినా నేను చెప్పనాయే ..
వాళ్ళ తో పాటే నా వీపు కూడా చీరి పోతుంది , నాన్న ఏమనరు ,కానీ అమ్మ మాత్రం బడిత పూజే ...
అన్నీ తగ్గేక , టార్చ్ లైటు ,కోటు ఇత్యాది వస్తువుల కోసం మళ్లీ అదే చోటుకు వెళ్ళి చూస్తే ఏముందీ ?
అక్కడేమీ లేవు . అన్నీ ఆ ముదురుగాడు వచ్చి ఎప్పుడో సేకరించుకు పోయాడు . వాడేనని వాడి పనేనని
తెలిసినా ఏమీ చేయలేక ఊరుకోవాల్సి వచ్చింది .
అన్నట్లు రెండు రోజుల ముందు ఆ ముదురు వేట మాంసం చాల ఖరీదుకు కొందరికి అమ్మేడని తర్వాత తెలిసింది .
ఈ కధలోని సంఘటనలు ,సన్నివేశాలు '' కల్పితం'' మాత్రమే ,ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు అని మనవి .
*******************************************
Sunday, December 18, 2016
''సవితి పోరు ''
ఉదయం లేవగానే ఈయన కోసం చూసా , పక్క ఖాళీగా వుంది . ఎప్పుడు లేచేసారో మరి ,నిద్ర లేవగానే వుండే
ప్రశాంతత పోయింది , ఈ మానవుడు అచ్చిక బుచ్చిక లాడుట మానివేసి ఎచటకు బోయినాడు అని చూసితి
మానవా నువు మారవా ! రూమ్ లోనించి బయటకు రాగానే అనుకున్నదే జరిగింది . ''దాన్ని '' ఒడిలో కూచో
బెట్టుకుని తెగ సముదాయిస్తున్నారు , నేనెంత మహా పతివ్రతనో కదా ఎంత సహనం తో వున్నాను ,నాలాగా
ఎంతమంది తరుణీ మణులు ఇలా సహనం తో భరిస్తున్నారో ఈ ''సవతి ని '' . వారందరికీ మనస్సులోనే
వందనాలు అర్పించుకుని ,నా పనిలో పడ్డాను కాఫి కూడా'' దాని'' తోనే ముచ్చట్లు పెట్టుకుని తాగారు .
ఆఫీస్ లో ఉండవలసిన ''దాన్ని '' ఇంటివరకు తెచ్చి నాకింత మనోవ్యధ కలుగ చేస్తున్నారని కడిగి
పారేయాలనుకున్నాను ,కానీ నోరు రాలేదు . ఒక సిగరెట్ అలవాటు లేదు , ఒక మందు అలవాటు లేదు ,
వక్కపొడి కూడా వేసుకోని వాడిని ఏమని తిడతాం ? ప్చ్ ఇలాంటివి ఎవరికి చెప్పుకుంటాం చెప్పు కుంటే
ఇంటి పరువు పోదూ ! ఎప్పుడూ'' దాన్నే '' వళ్ళో పెట్టుకు కూచోవడమే మౌనంగా భరించ వలసిందే ,ఏమిటో పెళ్ళైన కొత్తలో నేను కూచునే చోటది. తర్వాతనాపిల్లలది , ఇదిగోఇప్పుడిది కార్ లో నేను కూచోవలసిన చోట అది , నేను .. నేను కూచో వలసిన .. చోట . అవమానం దిగ మింగుకొని ,'' దాన్ని '' కార్ లో అయ్యగారి పక్కన నేను కూచో పెట్టాను . రాణి గారిలా ఆయనగారి పక్కన కూచొని ,నా కళ్ళముందే ఊరేగుతూ
వెళ్ళిందది . రాత్రి వచ్చాక అదే తీరు , బట్టలు మార్చు కుని స్నానం చేసే వరకే కుర్చీ లో ఉంటుంది .
మళ్ళీ రాగానే వడిలోకి ఎక్కి కూచుంటుంది . తినగానే మళ్లీ ... ఇక నాకు స్థానమేలేదా ... !?.
ఈరోజు ఎలాగన్నా'' దీన్ని'' చంపేయాలి ,భరిస్తుంటే నెత్తికి ఎక్కుతోంది , ఇక లాభం లేదు ఆయన నన్ను
ఎమన్నా సరే .. '' దాన్ని '' చంపేస్తాను . ఒకనిర్ణయానికి వచ్చాను . రేపు ఆదివారమేగా వదిలేసి రావచ్చుగా
వెంట బెట్టుకొచ్చారు . ఇక నా వల్లకాదు ,ఏది ఏమైనా రేపు ఆదివారం గనుక తను ఆలస్యంగా లేస్తారు .
ఆ సమయం లో నేనే ముందుగా లేచి '' దీని'' పీక పిసికేస్తాను . దానితో ''దీని '' పీడ వదిలి పోతుంది .
ఒక నిర్ణయానికి రాగానే మనసు తేలిక పడింది . రేపంతా నాదే , వాడు నా వాడే అనుకుంటూ పాడుకుని
నిద్ర పోయా , నేనొకటి తలిస్తే దైవమొకటి తలచాడు ,నాకు మెలకువ వచ్చే సరికి ఆలస్యమైంది . తనే
ముందు లేచారు . యధా ప్రకారం వడిలో ''అదే ''. అయినా సరే నా నిర్ణయం లో మార్పు లేదు .
ఈరోజు కమ్మగా వండి పెడతాను . భోంచేస్తే నిద్దరొచ్చేయాలి ఆలా వండేస్తాను . మధ్యాహ్నం ఆయన
నిద్దరోగానే దీన్ని చంపేస్తాను . అనుకున్నట్లే ఆయన భోంచేసి పడుకున్నారు ,ఆసమయం కోసమే
చూస్తున్న నేను ''దాని '' దగ్గరకు వెళ్ళేను , ఆ సమయంలో తెలుగు సీరియల్ లో లావాటి లేడీ విలన్ లా వున్నాను కళ్ళలో ఎరుపు మోహంలో రంగులు బ్యాక్ గ్రౌండ్లో మ్యూజిక్ .. కొంచెముంటే అన్నంత పని చేసి ఉందును . కానీ ఒక్క సెకను ఒకే ఒక్క సెకను ఆలోచించేను .. పోన్లే పాపం'' దీని '' వల్లనే గా మనకి
కూసింత గుర్తింపు నలుగురు స్నేహితులు ,కలిగేరు మనల్ని కూడా గుర్తించి కామెంట్లు పెడుతున్నారు .
దీన్ని నాశనం చేస్తే మనకేమి వస్తుంది . మెల్లగా ఆయనలో మార్పు తెస్తాను .. మార్పు తెచ్చుకుంటాను ..
అని డిసైడయ్యాను . వెంటనే నాచేతుల్లో వున్నా '' లాప్ టాప్ '' పక్కన పెట్టేసి ఆయన కోసం లోపలి
నడిచేను .
భరించే భార్యలందరికి అంకితం .
******************************************************
Sunday, October 23, 2016
Thursday, September 8, 2016
రంగులపెట్టి .
మీరు ఉద్యోగస్తు లా ,ఐతే సరే సమయం ఎలాగూ వుండదు . సాయంత్రం అలసి పోయి వచ్చి కాసేపు వార్తలు కాసేపు గేమ్ షో చూసి బజ్జుంటారు . కాని గృహిణుల కు గమనిక దయచేసి సీరియల్స్ విషయం లో జాగ్రత్త .ఛానల్స్ మారుస్తూ .. ప్రోమోలు చూస్తేనే భయమేస్తోంది ,ఇక రోజూ ఆ డైలీ సీరియల్స్ చూస్తూ రేపటి ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో అని గుండెని అరచేత్తో పట్టుకునే సమయానికి ఆపేస్తారు .. రేపటివరకు .. ఈలోగా జనం అనారోగ్యం పాలై పోతారు . ఇంతే కాదండి , ఒకసారి చేతబడి చూపిస్తారు అదికూడా చిన్నపిల్లాడి మీద ,మరోసారి పాముకి బట్టలు వాసన చూపించి వదులుతారు .. వాళ్ళనే కాటేస్తుందన్నమాట ? అత్తగారు మెట్లు దిగుతుంటే కోడలు నూనె పోస్తుంది , కోడలు తాగే పాలలో అత్త విషం పోస్తుంది . ఇవన్ని జరగవు వాళ్ళు త్రుటిలో తప్పించుకుంటారు మనం ''బకారాలమైపోతాము .మరి రెండువేల ,తొమ్మిది వందల తొంబై తొమ్మిదో భాగం కూడా ప్రసారం కావాలి అంటే ఇదంతా తప్పదు మరి .మళ్లీ మరుసటి రోజు ఏమిజరుగుతుందో అంటూ అదే టైం కి టి వి ముందు ప్రత్యక్షం అవుతాము . ఇంకో అసహ్యమైన విషయం ఏమిటంటే .. చక్కగా భార్య భర్త అంటూ మొదలు పెడతారు . సీరియల్ , ఇదేదో సంసార పక్షం గా ఉంటుందేమో అని చూస్తాము . ఒకవారం బాగానే వుంటుంది ఆహ్లాదంగా .... తర్వాత ఆమె మొదటి భర్తనంటూ ఒకడువస్తాడు లేదా అతని ముందు భార్యననో, పిల్లాడి తల్లిననో మరోకామే వస్తుంది చూడలేము ,ఆ భాష భరించలేము ,ఆడైలాగులు ఎవరురాస్తారో మరి వారికి నా తరపున వందనాలు .ఒక పెళ్లైన యువతి కోసం ఇద్దరు ప్రయత్నించడం , గర్భవతి గా ఉన్న ఆమెకి వేరే వాళ్ళ తో పెళ్లి కావడం లాంటి ట్విస్ట్ లు కూడా వుంటాయి మరి చూసి తట్టు కోవాలి . పెళ్ళిళ్ళు , శోభనాలు ఐతే ఎప్పుడు పెట్టినా అదే జంటకుఅదే సీరియల్ లో మళ్లీ మళ్లీ జరుగుతూనే వుంటాయి ????????.
పొద్దున్నే భక్తీ ,గ్రహాలు అనుకూలత ,మంచిసమయం ,పిల్లల పుట్టిన సమయంతో వాళ్లు విదేశాలు వెళ్తారోవెళ్ళరో చెప్తారు , భార్యా భర్తలు విడిపోకుండా వుండాలంటే ఏ నూనె తో దీపం పెట్టాలో చెప్తారు ,అర్ధం చేసుకుని సర్దుకుపోతే కాపురం నిలుస్తుంది తప్ప నూనె వల్ల కాదండి . హమ్మయ్య ఇవన్నీ అయ్యాయి అనేసరికి బ్రతుకులో బండ , జీవితంలో అండ అంటూ కొత్తగా ముందు తరం హీరోయిన్లు తో ఒకకొత్త ప్రోగ్రాం లు మొదలయ్యాయి . మీ పేరులో (అక్కర్లేని చోట ) ఎల్ లు , హెచ్ లు ,కలుపుకుంటే మన డాబా మీద ఒక డుప్లెక్స్ హౌస్ మొలుస్తుందట మా వారికీ చెప్పేను ప్రయత్నించ కూడదు అని అయన నవ్వి నవ్వి నవ్వలేక ఇబ్బంది పడ్డారు కాసేపటికే వంటలు మొదలౌతాయి (అన్ని చానల్స్ లోను ) చక్కగా పదివేల పట్టుచీర కట్టుకుని (పాపం భర్తగారు ) గోరింటాకు పెట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని వంట చెయ్యడానికి వస్తారు అవన్నా చూద్దామంటే .. కావాల్సిన పదార్ధాలు అంటూ మొదలు పెట్టి ఉల్లి పాయలు పచ్చిమిర్చి పంచదార బెల్లం ముక్కా ,అంటూ సాగుతుంది ఆ లిస్ట్ ,అది కూరో, స్వీటో అర్ధం కాదు . అసలే అంతంత మాత్రం వంటతో మావాళ్ళు కక్క లేక మింగ లేక మెక్కుతుంటారు . ఇక ఇవికూడా చుసానంటే వున్నది పోయి అటూ ఇటూ కాకుండా పోతుంది
.నా వంట . తిరిగి చివాట్లు తినాలి ఎందుకొచ్చిన గొడవ .
అసలు వాళ్ళు చేసే వంటలు మనకి తెలిసినవే చేస్తూ నోరు తిరగని పేర్లు పెడుతూ ,తమలపాకు బజ్జి ,కొబ్బరాకు బుర్జీ ,అప్పడాల కూర ,వడియాల బిర్యానీ అంటూ అదు''బూతాలు ''చేస్తారు .
పూర్వం నించి వండే పాకం గారెలకి ,స్వీట్ వడ అనిపేరుపెట్టి (బెల్లంగారెలు )జీడిపప్పు చల్లేసి
కొత్తగా చూపిస్తారు . ఆనక ఏంకర్ రుచిచూసి మెచ్చుకుని ఇచ్చే నూనెడబ్బా అందుకుని ఛీ ..
శని, నూనె ఎపుడూ చేత్తో తీసి''కొన ''కూడదు ,''కొనవచ్చు''కానీ అదికూడా తెలీదు . వాళ్ళ ఫ్యామిలీ
మొత్తం వచ్చి రుచి చూసి బావుందంటారు (అనకపోతే ఆ నక ఏమవుతుందో వాళ్లకు తెల్సు మరి ఒకోసారి అత్యుత్సాహం వున్న ఏంకర్ వస్తుంది . రండి పరిచయాలు పెంచుకుందాం అంటూ
మీపేరేమిటి ఏమి వండుతారు అంటూ మొదలెట్టుద్ది . మీకు పెళ్లిఅయిందా అంటుంది ??
ఆమెగారు బోలెడు సిగ్గు పడుతూ అయిందంటుంది . కొంత వంట జరుగుతూ ఉంటుంది
మీకు పిల్లలా ,అనిఅడుగుతుంది ,ఆమె ఇద్దరండి అంటుంది ''వావ్ ''అంటూ ఒక పోలి కేక
పెడుతుంది . మనఁవేపు తిరిగి అస్సలు ఆలా లేరుకదండి ఈవిడా ?అంటూ మనల్ని కూడా
ఇన్వాల్వ్ చేస్తుంది . (నాకేం తెలీదు రావుగారు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి . )
మరికొంత వంట తర్వాత పిల్లలేమి చేస్తున్నారు ,అని అడుగుతుంది అమ్మాయికి పెళ్లయిందని
చెప్పగానే ఏంకర్ కళ్ళుతిరిగి పడిపోయినంత పనిచేస్తుంది . ''వావ్ '' వోవ్ ''అంటూ సదరు
ఆంటీని పొడిగి సారీ పొగిడి మెచ్చుకుంటుంది . మొదటినించి ప్రోగ్రాం చూసేను కనుక
నాకళ్ళకిసైట్ఇంకారాలేదు కనుక మొత్తం ఈ కథ కమామిషు లో అంత ''వావ్ ''ఏమి కనబడలేదు
ఒక వంటల ప్రోగ్రాం వస్తోంది ,అన్నిరకాల కూరగాయలు వేసి ,, అదేనండి మనం కూరలు లేక వారాంతం లో చేస్తాము కదా వెజ్ ఫ్రైడ్ రైస్ అదన్నమాట ,చేస్తూ ,, వుంది ఏంకర్ తో ఏదోవొకటి మాట్లాడమని చెప్తారనుకుంటా'' అన్నికూరలు వేసుకోవచ్చా అని అడిగింది ,చేస్తున్నఆమె ' అందుబాటులో వున్న వి వేసుకోవచ్చు ' అంది .ఏంకర్ ''కాకర కాయ వేసుకోవచ్చా అనడిగింది టక్కున ,ఇక ఆమె చూసింది చుడండి .... వెంటనే హ్హి హ్హి కాకరకాయ చేదుకదా ! మర్చిపోయాను అని సర్దేసుకుంది . మరోసారి స్వీట్ చేస్తూ చివరిగా'' ఎలకల ''పొడి వేసుకోవాలి అన్నదామె ,ఈసారి ఎంకర్ తెలివైంది , '' ఓ ' యాలకుల' పొడి వెయ్యాలా'' అని కవర్ చేసింది . నిజంగా ఎలకల పొడి అనుకొని వేస్తె ఏమిటి పరిస్తితి ?...ఇప్పుడుంది అసలైన కథ . లైవ్ లో సైకాలజీ డాక్టర్ వచ్చి భార్య భర్తలు ఎలావుండాలో గొడవలు రాకుండా ఎలా సర్దు కోవాలో చెప్తున్నారు ఏంకర్ తనుచేప్పేది శ్రద్దగా విని ,ఒక కాలర్ లైన్ లో వున్నారంది కనెక్ట్ చేసారు అతను ఏంకర్ నడిగాడు '' మరి డాక్టరుగారి భార్య ఎక్కడుందో అడగండి '' అన్నాడు ఆమెకు అర్ధం కాక మళ్లీ అడిగింది . ''డాక్టరుగారు భార్య నెందుకు వదిలేసారో కనుక్కోండి '' అని స్పష్టం గా అడిగాడు . కట్ చేసారు లైన్ . మరోసారి చాల లావుగా వున్నఆమె వచ్చి ఆరోగ్యంగా వుండాలంటే వొళ్ళు తగ్గించుకోవాలంటే కొవ్వు తీఇంచు కోవాలని చెప్తోంది . మళ్లీ మరో కాలర్ , కనెక్ట్ చేసారు . ''మీరెందుకు చేయించుకోలేదు మరి ?''అని అడిగాడు కాలర్ ,నాకు విసిల్ రానందుకు చాల బాధ అన్పించింది . నేను చూస్తూఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయా అని నా సందేహం ?
పోనీ పాటలైనా చూద్దాము అని మ్యూజిక్ ఛానెల్ పెడితే ,ఏంకర్ ప్రేమించావా , ఇంకా లేదా...
అంటూ ఇంటర్ చదివే పిల్లలతో ,ప్రేమించక పోతే మీ బ్రతుకెందుకు అన్నట్లు మాట్లాడతారు .
జీవితానికి లక్ష్యం అంటూఒకటుండాలి కదా ,కాస్త మంచివిషయాలు కూడా మాట్లాడితే బాగుండు
కొన్ని లక్షల మంది చూసే కార్యక్రమాలు ,జనం లోకి వెళ్లేముందే ఒకసారి సరిచుసుకుంటే బాగుంటుంది అనిపించి మాత్రమే ......
.నా వంట . తిరిగి చివాట్లు తినాలి ఎందుకొచ్చిన గొడవ .
అసలు వాళ్ళు చేసే వంటలు మనకి తెలిసినవే చేస్తూ నోరు తిరగని పేర్లు పెడుతూ ,తమలపాకు బజ్జి ,కొబ్బరాకు బుర్జీ ,అప్పడాల కూర ,వడియాల బిర్యానీ అంటూ అదు''బూతాలు ''చేస్తారు .
పూర్వం నించి వండే పాకం గారెలకి ,స్వీట్ వడ అనిపేరుపెట్టి (బెల్లంగారెలు )జీడిపప్పు చల్లేసి
కొత్తగా చూపిస్తారు . ఆనక ఏంకర్ రుచిచూసి మెచ్చుకుని ఇచ్చే నూనెడబ్బా అందుకుని ఛీ ..
శని, నూనె ఎపుడూ చేత్తో తీసి''కొన ''కూడదు ,''కొనవచ్చు''కానీ అదికూడా తెలీదు . వాళ్ళ ఫ్యామిలీ
మొత్తం వచ్చి రుచి చూసి బావుందంటారు (అనకపోతే ఆ నక ఏమవుతుందో వాళ్లకు తెల్సు మరి ఒకోసారి అత్యుత్సాహం వున్న ఏంకర్ వస్తుంది . రండి పరిచయాలు పెంచుకుందాం అంటూ
మీపేరేమిటి ఏమి వండుతారు అంటూ మొదలెట్టుద్ది . మీకు పెళ్లిఅయిందా అంటుంది ??
ఆమెగారు బోలెడు సిగ్గు పడుతూ అయిందంటుంది . కొంత వంట జరుగుతూ ఉంటుంది
మీకు పిల్లలా ,అనిఅడుగుతుంది ,ఆమె ఇద్దరండి అంటుంది ''వావ్ ''అంటూ ఒక పోలి కేక
పెడుతుంది . మనఁవేపు తిరిగి అస్సలు ఆలా లేరుకదండి ఈవిడా ?అంటూ మనల్ని కూడా
ఇన్వాల్వ్ చేస్తుంది . (నాకేం తెలీదు రావుగారు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి . )
మరికొంత వంట తర్వాత పిల్లలేమి చేస్తున్నారు ,అని అడుగుతుంది అమ్మాయికి పెళ్లయిందని
చెప్పగానే ఏంకర్ కళ్ళుతిరిగి పడిపోయినంత పనిచేస్తుంది . ''వావ్ '' వోవ్ ''అంటూ సదరు
ఆంటీని పొడిగి సారీ పొగిడి మెచ్చుకుంటుంది . మొదటినించి ప్రోగ్రాం చూసేను కనుక
నాకళ్ళకిసైట్ఇంకారాలేదు కనుక మొత్తం ఈ కథ కమామిషు లో అంత ''వావ్ ''ఏమి కనబడలేదు
ఒక వంటల ప్రోగ్రాం వస్తోంది ,అన్నిరకాల కూరగాయలు వేసి ,, అదేనండి మనం కూరలు లేక వారాంతం లో చేస్తాము కదా వెజ్ ఫ్రైడ్ రైస్ అదన్నమాట ,చేస్తూ ,, వుంది ఏంకర్ తో ఏదోవొకటి మాట్లాడమని చెప్తారనుకుంటా'' అన్నికూరలు వేసుకోవచ్చా అని అడిగింది ,చేస్తున్నఆమె ' అందుబాటులో వున్న వి వేసుకోవచ్చు ' అంది .ఏంకర్ ''కాకర కాయ వేసుకోవచ్చా అనడిగింది టక్కున ,ఇక ఆమె చూసింది చుడండి .... వెంటనే హ్హి హ్హి కాకరకాయ చేదుకదా ! మర్చిపోయాను అని సర్దేసుకుంది . మరోసారి స్వీట్ చేస్తూ చివరిగా'' ఎలకల ''పొడి వేసుకోవాలి అన్నదామె ,ఈసారి ఎంకర్ తెలివైంది , '' ఓ ' యాలకుల' పొడి వెయ్యాలా'' అని కవర్ చేసింది . నిజంగా ఎలకల పొడి అనుకొని వేస్తె ఏమిటి పరిస్తితి ?...ఇప్పుడుంది అసలైన కథ . లైవ్ లో సైకాలజీ డాక్టర్ వచ్చి భార్య భర్తలు ఎలావుండాలో గొడవలు రాకుండా ఎలా సర్దు కోవాలో చెప్తున్నారు ఏంకర్ తనుచేప్పేది శ్రద్దగా విని ,ఒక కాలర్ లైన్ లో వున్నారంది కనెక్ట్ చేసారు అతను ఏంకర్ నడిగాడు '' మరి డాక్టరుగారి భార్య ఎక్కడుందో అడగండి '' అన్నాడు ఆమెకు అర్ధం కాక మళ్లీ అడిగింది . ''డాక్టరుగారు భార్య నెందుకు వదిలేసారో కనుక్కోండి '' అని స్పష్టం గా అడిగాడు . కట్ చేసారు లైన్ . మరోసారి చాల లావుగా వున్నఆమె వచ్చి ఆరోగ్యంగా వుండాలంటే వొళ్ళు తగ్గించుకోవాలంటే కొవ్వు తీఇంచు కోవాలని చెప్తోంది . మళ్లీ మరో కాలర్ , కనెక్ట్ చేసారు . ''మీరెందుకు చేయించుకోలేదు మరి ?''అని అడిగాడు కాలర్ ,నాకు విసిల్ రానందుకు చాల బాధ అన్పించింది . నేను చూస్తూఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయా అని నా సందేహం ?
పోనీ పాటలైనా చూద్దాము అని మ్యూజిక్ ఛానెల్ పెడితే ,ఏంకర్ ప్రేమించావా , ఇంకా లేదా...
అంటూ ఇంటర్ చదివే పిల్లలతో ,ప్రేమించక పోతే మీ బ్రతుకెందుకు అన్నట్లు మాట్లాడతారు .
జీవితానికి లక్ష్యం అంటూఒకటుండాలి కదా ,కాస్త మంచివిషయాలు కూడా మాట్లాడితే బాగుండు
కొన్ని లక్షల మంది చూసే కార్యక్రమాలు ,జనం లోకి వెళ్లేముందే ఒకసారి సరిచుసుకుంటే బాగుంటుంది అనిపించి మాత్రమే ......
***********************************
Subscribe to:
Posts (Atom)













































