Total Pageviews

Thursday, December 29, 2016

అందమైన చలిమంట .



డిసెంబరు  నెల  చివరికి  వచ్చేసాం ,అందరి మనసుల్లో  భోగి మంటలు  మెదులుతూ  ఉన్నాయేమో   పండుగ ఎన్ని రోజులుందని చూస్తున్నారా ! నాకైతే  భోగిమంట కాదుగాని  చలిమంట అదేనండి  నెగడు గుర్తొస్తోందిఆవిషయాలన్నీ
మీతో పంచుకోవాలని వుంది . !. ఇంతకు ముందే చెప్పాను ,మా  నాన్నది అటవీశాఖ  లో  ఉద్యోగం  అని ,అక్కడ చలి చాలా బావుంటుంది ,చలి బాగోడమేమిటి అని ఆశ్చర్య పోకండి  చలికాలం అక్కడ  గడిపే రోజులు బాగుంటాయని  నా  మాటలకుఅర్ధం .

చలికాలం అందంగా ఉండడం ఏమిటో ఇప్పుడు చెప్పనా ! ఆకాశాన్నంటుతూ  పచ్చని చెట్లూ , జరీపువ్వులు
కుట్టిన నీలం చీర లాగా  ఆకాశం ,దానిమీద వెండి కంచం బోర్లించినట్లుండే  చందమామ ,చీకట్లో మిణుగురు
పురుగుల వెలుగు , ఎంతోదూరం లేని ఏటి నించి గలగలలు ... కుంకుడు ,షీకాయ, కరక్కాయ చెట్ల మీదుగా
వచ్చే చేదు వాసన గుండెల నిండా పీల్చుకుంటే వుంటుందీ .. హబ్బా ఆ ఆనందమే వేరు .


 రాత్రయ్యే సరికి అందరంభోజనాలు ముగించి ,ఇంటివెనుక వేసే పెద్ద చలిమంట దగ్గర చేరేవాళ్ళం . చలి అక్కడ
చాల ఎక్కువ  ఉండేది . అందరూ శాలువాలు ,మఫ్లర్ ,స్వేట్టర్లు వేసుకుని  చలిమంట చుట్టూ కూర్చునే వాళ్ళం .
మంచి కాలక్షేపం ,బోలెడన్ని విషయాలు అక్కడ చెప్పుకునే వాళ్ళం . దొంగలు ,దెయ్యాలు, చేతబడులు అవి
అప్పుడక్కడ అంతమందిలో  భయం వేయదుగాని  ఒక్కరు వున్నపుడు గుర్తు వస్తే భయమేసేది . ఒకరితో
ఒకరు మాట్లాడుతున్నప్పుడు  చలికి  నోటివెంట ఆవిర్లు వచ్చేవి ,అదిబాగా తమాషాగా ఉండేది . కొంతమంది
నిద్ర వచ్చి వెళ్లి పడుకున్నా ,నిద్ర రాని వాళ్ళు కబుర్లు కొనసాగుతూనే ఉండేవి . అక్కడ నిప్పుల మీద కెటిల్
తో వేడినీళ్లు మరుగుతూనే ఉండేవి ,వీలుని బట్టి కాఫి పొడి కానీ ,టీ పొడికాని  వేసి ఉంచేవారు ,చాలా తక్కువ
పంచదారతో , అదే బ్లాక్ కాఫీ  అంత చలిలో అలా వేడిగా పోసుకు తాగడం అదో ఆనందం . కాఫి గింజలు ,
మిరియాలు ,పచ్చి పసుపు కొమ్ములు (మెత్తగా అల్లం లాగ ఉంటాయి )కుంకుమ రాళ్లు , తేనె  ఎవరో ఒకరు ఇచ్చేవారు .వాటిని  ఉపయోగించాము అనే కన్నా  వృధా  పుచ్చాము  అంటే  బావుంటుందేమో !.





అదేమిటో చలికాలం లోనే చల్లని పళ్ళు వస్థాయి , చెక్ పోస్ట్ దగ్గర లారీ చెక్ అయ్యేలోగా  ఎవరో ఒకరు  ఒక
బుట్టతో కమల ఫలాలో ,బుట్టెడు సీతాఫలాలో తెచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్లే వాళ్ళు ,వాళ్ళ పేరు చెప్పడం కానీ
వివరాలు చెప్పడం కానీ చేసే వారు కాదు , మా పెద్దన్నయ్యకి అంత శ్రద్ద లేదు కానీ నేను మా చిన్నన్నయ్య
పళ్ళబుట్ట మధ్యలో పెట్టుకుని కూర్చునే వాళ్ళం ,బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ అవే లాగించే వాళ్ళం ,నేను అంత
కాదు కానీ అన్నయ మాత్రం ,ఎలా తినేవాడంటే నల్లనయ్య కాస్తా సీజన్లో కలర్ వచ్చేసే వాడు . పైగా అనే వాడు
''ఈ గింజలొకటి అడ్డు ,అవి లేకపోతే ఇంకా  తినచ్చు '' తన సరస సంభాణ గురించి గతంలో కూడా రాసాను .
ఒకేలాంటి చీర జాకెట్ వేసుకుంటే ,''కళ్ళు తిరిగేస్తున్నాయి చీరన్నా మార్చు జాకెట్టన్నా మార్చు ''అంటాడు .
పిట్టలున్న చీర కట్టుకుంటే తేరిపారా చూసి తలాడించి ''  బావుంది . ఈచీర రోజూ  ఉతకాలా ''అక్కర్లా డ్రై వాష్
అన్నాను గొప్పగా .. ''ఓ మారేలా పిట్టలు ఖరాబు చేస్తేనో ..'' అని అడిగాడు .  ఇంక నేను ఒకటే నవ్వు , అలా
ఉంటుంది తన సంభాషణ . అన్నట్లు అన్నదమ్ము లిద్దరూ ఒకసారి వేటకెళ్ళేరు ,రాయొచ్చో లేదో నాకు
తెలీదు కానీ ,ఏది రాయకూడదంటే ఎలాగండీ చాలా పోస్టులు అలాగే ఉండి పోయాయి . ఇది మాత్రం
చెప్పే తీరతాను .



అసలేమైందంటే .. వీళ్లిద్దరికీ  టీనేజ్ లోనే  పెద్దవాళ్ళతో స్నేహాలుండేవి ,ఐతే అలాంటి వాళ్లలో  ఒక ముదురు
వుండే వాడు పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి ,వాడు పిట్టల దొర లాగా కధలు చెప్పేవాడు ,నాకు వేట తెలుసు
ఇక్కడికి ఎవరు వచ్చినా ,నేను దగ్గరుండి వేటకు తీసికెళ్తాను ,ఆలా వేటకు వెళ్ళినపుడు  వాళ్ళిలా ,వీళ్ళలా
అంటూ వీళ్లని ఆకట్టు కున్నాడు . అప్పట్లో అక్కడ షూటింగ్ లు  జరుగుతుండేవి , మావాళ్లకి డైరెక్టర్స్
పరిచయముంది .  వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూసేవారు . ఆలా ఆ ముదురు కబుర్లు నిజమనుకున్నారువీళ్లు .
అవకాశం దొరికింది ,మా నాన్న గారు  ఊర్లో లేనప్పుడు  ముదురుతో కల్సి వేటకు  వెళ్లేందుకు సిద్ధమయ్యారు .
నాన్నది లాంగ్ కోట్ ,పది బ్యాటరీస్ పట్టే పెద్ద టార్చ్ లైటు ,లాంగ్ షూస్  అంతా పగడ్బందీగా  బయల్దేరి
వెళ్లారు . వాడు చెప్పిన ప్రకారం  ఒకరి వెనుక ఒకరు నడవడం ,మాట్లాడు కోకుండా నిశ్శబ్దం గా వెళ్లడం ,
అన్ని బానేవున్నాయి , వెళ్లి మాటు వేసుకుని  కూర్చున్నారు . అనుకున్న ప్రకారం గన్ పేల్చే వాడు
ముందు కూర్చున్నాడు . (మా  పెద్దన్నయ్య గన్  వాడి చేతికి ఇవ్వడానికి  ఇష్ట పడలేదు  క్రెడిట్ తనకే
దక్కాలని  డిసైడయ్యాడు ) వెనుక ఆ ముదురు ,ఆ వెనుక  మా చిన్నన్నయ్య , నిశ్శబ్దం ,చీకటి, జంతువుల
అరుపులు  లోపల నూట నాలుగు ..  అయినా  గన్  ఉందని  బోడి ధైర్యం ,ఇంతలో  దగ్గరలో అలికిడి
వాళ్ళు అనుకున్న ప్రకారం  ముదురు  టార్చ్  వేసి వెంటనే ఆపేస్తాడు ,వెంటనే అన్నయ్య  గన్ పేల్చాలి .
టార్చ్ వేసాడు ,పది అడుగుల దూరం లో ఎదో జంతువు కళ్ళు మెరుస్తూ కనపడ్డాయి ,వెంటనే టార్చ్
ఆపేసాడు ..మనవాడు అత్యుత్సాహం తో  కరెక్ట్ టైమింగ్ లో ఢమాల్ ని  గన్ పేల్చాడు ,వీళ్ళ టైమింగ్
 వీల్లకున్నట్లే  దాని టైమింగ్  దానికుందిప్రమాదాన్ని పసిగట్టిన  ఆ జంతువు  పారిపోవడానికి అప్పటికే
 వెనుదిరిగింది . అది అటు తిరగ్గానేబులెట్ వెళ్లి  వెనుక తొడలో దిగబడింది . ఇంక చుడండి  దాని అరుపులతో
 అడవి దద్దరిల్లింది .ఉన్నచోటే గుండ్రాలు  తిరుగుతూ  మట్టి తొలిచేస్తూ  ఘీంకారాలు చేస్తూ నానాహడావిడి చేసింది
 దాని అరుపులకి  ఆ గోలకి  వీళ్లు అది పులి అని భ్రమ  పడ్డారు ,అంతే వీళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి  ఏమి
జరిగినా నిశ్శబ్దం గా  ఉండాలన్న నిర్ణయాన్ని గాలికొదిలేసారు ,దాని కన్నా పెద్దగా  అరుస్తూ ,తీసి కెళ్లిన వన్నీ
అక్కడే పడేసి , ఎగురుతూ దుంకుతూ ,పడుతూ లేస్తూ పలాయనం చిత్తగించారు . కానీ ఒకటి మాత్రం మెచ్చు
కోవాలి ,అంత భయం లోను ముగ్గురూ  ఒక వైపే పరుగెడుతూ  విడిపోకుండా  వూళ్ళో కొచ్చి పడ్డారు . నేనో
తింగరి దాన్ని , నేను   చెప్పినట్టు పెంచు కోవడానికి  బ్రతికి వున్న చెవుల పిల్లిని (కుందేలు) ''పట్టు' కొస్తారని
అమ్మకి  వేట మాంసం ''కొట్టు ''కొస్తారని  ఎదురు  చూస్తున్నాను . ఎలాగో ఇంట్లో కొచ్చి పడ్డారు . ఇద్దరికీ
జ్వరాలు ''ఆతర్వాతవి '' కూడా ...  ఇద్దరికీ  ఒక్కసారే ఎందుకు  జ్వరం వచ్చిందో  తెలియక  మా అమ్మేమో
కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు ,దిష్టి తీసింది . అదో దండగ మళ్ళీ నాకు తెలిసినా  నేను చెప్పనాయే ..
వాళ్ళ తో  పాటే నా వీపు కూడా  చీరి పోతుంది , నాన్న ఏమనరు ,కానీ అమ్మ మాత్రం బడిత పూజే ...
అన్నీ తగ్గేక , టార్చ్ లైటు ,కోటు ఇత్యాది వస్తువుల కోసం  మళ్లీ అదే చోటుకు వెళ్ళి చూస్తే ఏముందీ ?
అక్కడేమీ లేవు . అన్నీ ఆ ముదురుగాడు   వచ్చి ఎప్పుడో  సేకరించుకు పోయాడు . వాడేనని వాడి పనేనని
తెలిసినా  ఏమీ చేయలేక  ఊరుకోవాల్సి  వచ్చింది .

అన్నట్లు  రెండు రోజుల ముందు ఆ ముదురు వేట మాంసం చాల ఖరీదుకు  కొందరికి  అమ్మేడని తర్వాత తెలిసింది .
ఈ కధలోని  సంఘటనలు ,సన్నివేశాలు '' కల్పితం'' మాత్రమే ,ఎవరినీ ఉద్దేశించి  రాసినవి కావు అని మనవి .

                          *******************************************

No comments:

Post a Comment