పండుగంటేనే సందడి ,అందులోనూ ఇది పెద్ద పండుగ అనిపిలవబడే సంక్రాంతి ,ఇకచెప్పాలా సందడే సందడి .
అందుకే మా ఇంటి సందళ్ళు కొన్ని మీతో పంచుకోవాలను కుంటున్నాను . పండుగ పనులు వరుసలో మొదలయ్యేవి ,ముందుగా మొదలు పెట్టేది ఇంటికి సున్నం కొట్టించడం , ఇదేంటి వైట్ వాష్ అనాలి లేదా
పెయింట్ అనాలి అనుకుంటున్నారా ! బెడ్ రూమ్ కి ఒకరంగు బాత్రూం కి ఒకరంగు అప్పుడు లేవండి ..
ఇప్పటిలా పి ఓ పి వర్క్ చేయించుకుని మళ్లీ పదేళ్లవరకు రంగుల మాటే ఎత్తని పద్దతి కాదు . ప్రతి ఏడూ
వేయించుదామన్నా పి ఓ పి గీకేసరికే ఇంట్లోని సామాన్లు మనుషులు రంగు మారి పోతారు . అందుకే పెళ్లిళ్లకు తప్ప పెయింట్ మాటే ఎత్తము .కాని అప్పుడు మాత్రం ప్రతి సంక్రాంతి కి ''సున్నంకొట్టాల్సిందే ''.
తెల్లవారుఝామునే మనిషిని పంపి సున్నం రాళ్లు అంటే నత్తగుల్లలు అని తెల్లని షెల్స్ ప్రత్యెక పద్దతిలో బట్టీ లో
కాల్చి ఇస్తారట అవి కొని తెప్పించేవారు . నాలుగు కట్టెల పోయ్యలు పెరటిలో వెలిగించి ,పెద్ద గంగాళాల తో నీళ్ళు మరిగించేవారు ,మేడ మెట్ల కింద వున్న సిమెంట్ తో చేసిన నీళ్ళ తొట్టెలో సున్నంరాళ్ళు వేసి ,వేడి నీళ్ళు పోసి
ఉంచేవారు ,అవి కుత కుతా మని వుడుకుతూ ఉండేవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండేవారు చల్లగా అయినాక
మెత్తని పేస్టు లా అయ్యేది అప్పుడు ,అందులో నీలిమందు తుమ్మజిగురు కలిపి .. ఇవన్ని ఎందుకంటే నీలిమందు
తెల్లదనం కోసం ,తుమ్మజిగురు గోడకి కూర్చుంటే సున్నం మనకే అంటుకుపోకుండా ఉండడానికి అన్నమాట . మనుషులనిమాట్లాడి ,పెద్ద కట్టేకి చీపురు కట్టి దానితో గోడలకు సున్నం కొట్టించేవారు . హమ్మయ్య చెప్పేసాను .
తరువాత పిండివంటలు ,నానమ్మా అత్తయ్య కలిసి ,కట్టెల పొయ్య వెలిగించడం ,నానబెట్టిన బియ్యం కడిగి పిండి
కొట్టించేవారు ఆ తడిపొడి పిండితోనే అరిసెలు చెయ్యాలట . పే .. ద్ద గిన్నెపెట్టి దానిలో బెల్లం వేసి పాకం పట్టేవారు
ఒకచిన్ని గిన్నెలో నీళ్ళు తీసుకుని ఆ పాకం అందులో వేసి ఉండ అయిందో లేదో చూసేవారు ,అదే అరిసెలపాకం
అన్నమాట , అప్పుడు తడి పొడి పిండి వేస్తూ కలిపేవారు దానిపేరే చలిమిడి ,దీనితోనే అరిసెలుగా వత్తి నూనె లో
వేయిస్తారు . మిగతా చలిమిడిలో వేయించిన కొబ్బరి ముక్కలు వేసి వుండగా చేసి వేయిస్తే అవి ''పోకుండలు'' ,
ఇప్పుడు ఈ పెరేక్కడా వినపడడం లేదు నేనుకూడా మర్చిపోయేదాన్ని కాని మా చిన్నన్న ''పడిపోకుండా
కూర్చోకుండా '' పోకుండ '' అనేవాడు అందుకే గుర్తుంది . ఇంకా చలిమిడి మిగిలేది దానిని మధ్యలో ఎత్తుగా
చివరలు పలుచగా వుండేవి నూనె మొత్తం తగ్గించేసి అందులో వేయించేవారు దానిపేరేమి టో తెలుసా ''పొంగడం ''
నిజమండి దాని పేరే పొంగడం .ఇంటికి వచ్చే వాళ్ళకి పెట్టడం ,చుట్టుపక్కల వాళ్ళకి పంపించడం , పనివాళ్ళకి
పెట్టడం ,నాన్నమ్మ చేతికి ఎముక లేదు . ఆబ్బె .. అలాగంటే ఆవిడ మనసు మంచిదని ఉదారమైనదని అర్ధం .
అసలు ఆ చలిమిడినే ఆడపిల్లను అత్తారింటికి పంపేటప్పుడు పెడతారు ,అదికూడా వేడిది కాదు నిద్ర చేసినది
అది చలువ అని ఒక నమ్మకం . ఆ చలిమిడి పసుపు కుంకుమలు , స్వీట్లు అందరికీ అక్కడ పంచుకుంటారు ,
కొత్త కోడలు కాపురానికి వచ్చిందని అర్ధం . ఇక వీధంతా ముగ్గులేసేవాళ్ళు.. ఎంత బావుండేవో .. ఒనాల్రోజులు
వుంచచ్చు కదా అబ్బే మళ్లీ మరుసటి రోజు వేరే ముగ్గు , ఇలా పండుగంటే ఇదే అనిపించేది . భోగి రోజు పొద్దున్నే
నలుగు పెట్టుకుని తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని , భోగి పిడకలు దండ తీస్కెళ్ళి భోగి మంటలో వెయ్యడం
ఒక గొప్ప అనుభూతి .భోగి ,సంక్రాంతి ,కనుమ మూడు రోజులకు మూడు జతలు ,అన్నట్లు కనుమ రోజు న
కొత్త బట్టలు కట్టుకుంటే కలకాలం కొత్తవే వేసుకుంటామని ఒక నమ్మకం . (ఎంత అందమైన నమ్మకం ? ).
కోళ్ల పందాలు గోదావరి జిల్లాల్లో ఎంత ఫేమస్ మీకు తెలిసిందే , తెలియంది ఏమిటంటే వాటికి బాదాం ,కాజు
పెట్టి పెంచు తారేమో వాటితో చేసిన కూర రుచే వేరు , చాలా ముఖ్యమైన వారికి మాత్రమే అది కానుకగా
పంపిస్తారు . ఎడ్ల బండ్ల పందాలు కూడా చాల బావుంటాయి (ట ) చాల ఎక్కువగా జరుగుతాయి .
మేము సంక్రాంతికే బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం . ముందు ఇంట్లో వున్నచెక్కలు ఐదు మెట్ల మాదిరిగా చక్కగా
అమర్చేవారు ,వాటిమీద తెల్లని దుప్పటి పరచి , ఏ ఏటికాఏడు కొత్తగా కొన్న బొమ్మలను కలిపి పెద్ద పెట్టెలోని
బొమ్మలను దించి , అన్నిటిని వరుసక్రమం లో అమర్చేవాళ్ళం , ఏటికుప్పాక , కొండపల్లి బొమ్మలు ,కొన్ని
దేవతల మట్టి ప్రతిమలు కలిపి సర్దే వాళ్లము . పెళ్ళికూతురు , పల్లకి , రైతులు ఇలా చాల బొమ్మలు ఉండేవి .
నాలుగురోజుల ముందే ఒక ట్రే లాంటిదానిలో మట్టినింపి నానబెట్టిన గింజలు వేసి మొలకెత్తించే వారు మా నాన్న . వాటిమధ్యలో కావిడితో వున్న రైతు , చిన్న గుడిసెలు , ఎడ్ల బండి ,పల్లెటూరు లాగా చేసేవాళ్ళు . సాయంత్రం
పేరంటం చేసి బొమ్మలకొలువుకు హారతిచ్చి ఎంతో పెద్దదాని లాగా ఫీలైపోయేదాన్ని . పండుగ అవగానే మళ్లీ
బొమ్మలు పెట్లోకి , పిల్లలం బళ్లోకి ... ... ... ...
********************************************************************************
అంజలి గారూ బాగున్నాయండి మీ జ్ఞాపకాలు. ఒక్కసారిగా ఒక పాతికేళ్ల మునుపటి సంక్రాంతి అనుభవాలు గుర్తుకు తెప్పించారు
ReplyDeleteపవన్ గారూ ,ధన్యవాదాలండీ .
ReplyDelete