Total Pageviews

Thursday, June 11, 2015

ఆమె ఎవరు ..???????


ఇంటి ముందు  లాన్  లో కూచుని ,తలెత్తి బంగ్లా  వేపు  చూసింది ,ఇంత సాధించిన  ప్రతి  వాళ్ళ లాగ  '' ఆమె ''
పెదవులు  చిరునవ్వు తో  విచ్చుకోలేదు ,కళ్ళు గర్వం  గా  ఆనందం తో  మెరవలేదు . నిర్లిప్తం గా  ఒక నిట్టూర్పు
విడిచింది . కారణం ఆమె   , ఏమిసాధించిందో ,ఏమి పోగొట్టుకుందో  ఆమెకు తెలుసు . అదేమిటతెలుసుకునే
  తీరికా  , ఆలోచనా లేనివాళ్ళు  అదృష్ట వంతులు . అమాయకంగా  రోజులు వెళ్ళిపోతాయి .

ఆమె  యవ్వనపు  తొలినాళ్ళలో , '' ఆది'' ని  ప్రేమించింది . ఆషా  మాషీ  ప్రేమలు అప్పట్లో లేవు , చూసిన వెంటనే
'ప్రేమ ' సాయంత్రం సెల్లో  మెసేజ్ ,మరుసటి  రోజు  బండి మీద షికార్ ,మరుసటి రోజు మూవీ ,తర్వాతి రోజు తగువు
విడిపోవడం ,ఇంతచక్కని  అవకాశాలు లేని రోజులవి ,కాలేజ్ లో ,'కొన్ని ' ప్రేమ జంటలువున్నా వీరిద్దరే  పెళ్లి
చేసుకుంటారు  అనుకునేవాళ్లు ,అందరూ ,అంత  చక్కగా వుండేవాళ్ళు . మూడేళ్ళు ఇట్టే గడిచాయి ,ఉద్యోగాల పై
నిషేధమున్న రోజులవి . అలంటి సమయం లో  అతనికి వుద్యోగం  వచ్చింది . 'ఆమె 'ఆనందానికి  అవధులు లేవు .
''కాని ''ఆ ఆనందం   ఆవిరవ్వడానికి  ఎంతోసేపు పట్టలేదు . వుద్యోగం వేయించింది  మేనమామ కనుక  అతని
కూతురినే  పెళ్లి చేసుకోవలన్నదే  షరతని చెప్పాడు . కనుక నిన్ను పెళ్లి చేసుకోలేనన్నాడు . నయం  తనతో
ఉండమన్నాడు కాదు ,అంత గౌరవంగా  చెప్పాక  ఇంకేంటి ?..  ఆ బంధమెంతగా  భాదించిందంటే ,అలా కొన్ని
నెలలు  అయోమయం లో వుండి  పోయింది . మొదటిసారిగా  మనుష్యుల  మీద ,మమకారాల మీద అసహ్యం
వేసింది . వాళ్ళ వ్యాపార లక్షణం తనని కుంగదీసింది . కొన్ని నెలల లోనే  తండ్రి తనకీ చిరుద్యోగినితెచ్చాడు
వరుడిగా ... !  సమయం కావాలంది ,చెల్లెలు  పెళ్లి చెయ్యాలి కాబట్టి  తప్పదన్నాడు ,త్వరపడాలన్నాడు .
ఆయన్ని  గౌరవించి  పెళ్లి చేసు కుంది . పెద్ద గొప్పగా  జీవితమేమి  మారలేదు  కాని ఇద్దరు మగపిల్లలు .
 పిల్లలిని  పెంచే క్రమం లో  తానూ ,ఆస్తులు  పెంచే  క్రమం లో  అతనూ ,డిపార్ట్ మెంట్ పరిక్షలంటూ ,కెరియర్
అంటూ క్షణం తీరిక లేకుండ  పరుగుల్లో  అతనూ బిజీ ...

చెల్లెలు  ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఎంతో పోరాడి  తల్లి తండ్రులని  ఒప్పించి మరీ  పెళ్లి చేసుకుంది . చెల్లెలంటే
 వాళ్ళ అత్తగారికి  ప్రాణం . చాల బాగా చూసుకుంటుంది .  తనకు మాత్రం  తన అత్తగారు ఏరి కోరి  చేసుకున్న
కోడలైనా ,ఏదో ఒక పుల్ల విరుపు  మాటలంటుంది . చెల్లెలు పెళ్ళైన నాలుగేళ్ళకే  అమెరికా  వెళ్ళిపోయింది .
భర్తకి అక్కడ వుద్యోగం . తనకీ  ఇద్దరు  పిల్లలు  అత్తగారు  వెళ్తూ వస్తూ  వుంటుంది .  ఎప్పుడన్నా తను
 వచ్చినా మాట్లాడు కోలేనంత బిజీ ..








పిల్లలిద్దరూ  బాగా చదువుకున్నారు , జీవితమంతా ఏ  సంపాదన కోసం  పరుగులేట్టాడో  భర్త , ఆ సంపాదన
వాళ్ళను విదేశాలు  పంపడానికి  ఉపయోగ పడింది . వాళ్ళు వెళ్ళిపోయారు ,ఒకరి తర్వాత ఒకరు . మళ్లీ
ఇద్దరే మిగిలారు . భర్త చెడ్డవాడు కాదు ,అలా  అని  మంచివాడు కాదు . కష్ట పడటం తెల్సు ,సంపాదించడం
తెల్సు ,కాని ప్రేమించడం తెలీదు ,ఆప్రేమని  ప్రదర్శించడం రాదు . ఆసరాగా  వుండడం రాదు ,అవసరాలు
కనిపెట్టడం ,అవతలివారిని  పట్టించుకోవడం తెలీదు . ఎందుకో  మనసంతా ఖాళీగా వుంది . తరచి చుస్తే
చిన్నతనం లో  తండ్రిఅంటే ప్రాణం ,తర్వాత ఎవరినో ఇష్టపడి దగా పడ్డది . ఆనిముషమే తనలో ప్రేమించే
గుణం  అంతరించి పోయి వుంటుంది . భర్తకు కూడా దగ్గర కాలేక పోయింది . అతనుకూడా యంత్రం లా
సంపాదన అనే  ఎండా మావుల వెంట పరుగు తీసాడు . మొక్కుబడి  గా జీవితం గడిపారు తామిద్దరూ !

ఇప్పుడు ఈ యాభై ఏళ్ళ వయసులో  కూర్చుని  ఆలోచిస్తుంటే ,తను పొందినది  ఏమి లేదని తెలుస్తోంది .
ఆడవాళ్లంటే లత లాంటి వారంటారు , బలమైన పందిరి ఆసరా  దొరికితే జీవితం ఒకలా ,నేలని ఒదిలేస్తే
మరొకలా ,వుంటుంది . ప్రేమ కోసం ఆరాట పడటం ,ఆలంబన కోసం  ఆరాట పడటం  స్త్రీల బలహీనత
అదే భగవంతుడి  రాత కూడా ,ఇలాంటి సంఘర్షణలో  గాడి తప్పి పోయిన జీవితాలెన్నో .. భర్తలో  ఆ
ప్రేమకోసం  వెదుక్కుంటుంది . కుటుంబానికి ,ఉద్యోగానికి  రెంటికి  సమయాన్ని  కేటాయించలేక ,
సమన్వయం  లేక ,ఉరుకుల పరుగుల జీవితం లో  ఎవరికోసం  సంపాదిస్తున్నారో  వాళ్ళనే  నిర్లక్ష్యం
చేస్తూ ,ఎవరికైతే  అండగా ఉండాలో  వాళ్ళకే లేనివాడయ్యాడు . జీవితం అంటే ఒక్కరిది కాదు ,
భార్య భర్తలిద్దరిదీ .. అతని అండే  లేనప్పుడు  ఈసౌకర్యాలు  వుంటే ఎంత ,ఊడితే  ఎంత ?........
 దాదాపు అందరి  కతలు [వెతలు ] ఇలాగనే  వుంటాయి ,కాస్త అటూ  ఇటూ  గా , అన్నట్లు
  ''ఆమె '' పేరు చెప్పలేదు కదూ ! పేరెందుకు ..? ప్రతి ఇంట్లోనూ  వుండే వుంటుంది
,అమ్మ గానో అక్కగానో , చెల్లి గానో , భార్యగానో  మనం గుర్తించమంతే  .................

                                            ******************************

No comments:

Post a Comment